అరుదైన వ్యాధితో బాలుడి మృతి
సుల్తానాబాద్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన బీట్ల నేహాల్(15) ప్రొజేరియా వ్యాధితో బాధపడుతూ మంగళవారం వేకువజామున మరణించాడు. బీట్ల శ్రీనివాస్-శ్రీదేవి దంపతుల కుమారుడైన నేహాల్ పుట్టిన మూడేళ్ల వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు.
ఉపాధి నిమిత్తం 15 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని భీవండికి వలస వెళ్లారు. శ్రీనివాస్ మొబైల్ రిపేర్స్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. 2014లో ముంబైలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వైద్యులు నేహాల్కు ప్రొజేరియా సోకిందని నిర్ధారించారు. జన్యు సంబంధ సమస్యతో వచ్చే ఈ వ్యాధి సోకిన వారు ఎండలో తిరగకూడదు. ఎప్పుడూ ఏసీలోనే ఉండాలి. ఎముకలు పెలుసుగా తయారయి, చిన్నవయసులోనే ముసలితనం వచ్చినట్లుగా మారడం ఈ వ్యాధి లక్షణం.
ప్రపంచం మొత్తం మీద ఈ వ్యాధిసోకిన వాళ్లు 134 మంది ఉండగా ఇండియాలో గుర్తించిన నలుగురిలో మొదటివాడు నేహాలే. అమెరికాలోని ప్రొజేరియా రీసెర్చ్ ఫౌండేషన్ ఈ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సేవ చేయడమే కాకుండా వ్యాధి నయం చేసేందుకు రూ.3 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడింది. నేహాల్ను ప్రొజేరియాకు ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది.15 ఏళ్ల వయసులోనూ నేహాల్ బరువు 13 కిలోలకు మించలేదు. ఇటీవల తన బాబాయి కూతురు పెళ్లి ఉండడంతో స్వగ్రామం పూసాలకు నేహాల్ కుటుంబం వచ్చింది.
సోమవారం ఎండతీవ్రత అధికంగా ఉండడంతో అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకోగా కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల సూచనమేరకు కరీంనగర్ వైద్యులు ముంబైలో నేహాల్కు చికిత్స అందించే వైద్యులను ఫోన్లో సంప్రదించారు. ఎండలో తిరగడం వల్లే సమస్యకు కారణమని, అతడు ఎప్పుడూ చల్లటి వాతావరణంలో ఏసీలోనే ఉండాలని వారు చెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున నేహాల్ మృతి చెందాడు.