నేను క్షేమం
- విహారయాత్రకు వెళ్లిన వినయ్‌రెడ్డి ఫోన్..
- ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు
మెదక్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లో విహారయాత్రకు వెళ్లిన జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వినయ్‌రెడ్డి సేఫ్‌గా ఉన్నారు. నేను క్షేమంగా ఉన్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ నెల 3న హిమాచల్‌ప్రదేశ్‌లోని బీయాస్ నదిలో ప్రమాదానికి గురైన విషయం విదితమే. కాగా మెదక్ మండలం తొగిట గ్రామానికి చెందిన బారాజు భూపాల్‌రెడ్డి, పద్మ దంపతుల రెండో కుమారుడు వినయ్‌రెడ్డి సైతం అదే కళాశాలలో మెకానికల్ బ్రాంచిలో మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఈ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. అందులో వినయ్‌రెడ్డి కూడా ఉన్నారు. విహారయాత్రకు వెళ్లిన 48 మంది విద్యార్థుల్లో 24 మంది నదిలో గల్లంతయ్యారు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని టీ వీల ద్వారా వీక్షించిన వినయ్‌రెడ్డి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యరు. ఫోన్‌ద్వారా కొడుకు క్షేమంగా ఉన్నవిషయం తెలుసుకుని వారు ఊపిరిపీల్చుకున్నారు.
కాగా.. నది ప్రమాద ఘటనలో పటాన్‌చెరుకు చెందిన విద్యార్థిని ఉన్నారని స్థానికంగా ప్రచారం జరగడంతో కలవరం చోటుచేసుకుంది. ఎస్ఆర్ ట్రస్ట్ అధినేత సి. అంజిరెడ్డి కుమార్తె కూడా ఇదే కళాశాలలో చదువుతోంది. హిమాచల్‌ప్రదేశ్ టూర్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన కుమార్తె కూడా కాలేజి నుంచి టూర్‌కు వెళ్లిన మాట వాస్తవమే కానీ ఆమె బ్యాచ్ విద్యార్థులంతా వేరే టూర్‌కు వెళ్లారని తెలియడంతో కలవరం సద్దుమణిగింది.