నిరసన సెగలు
ప్రజలకేమీ చేయనప్పుడు జన్మభూమి సభలెందుకు
అడుగడుగునా నిలదీతలతో ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు
హామీల అమలు కోసం రోడ్డెక్కుతున్న తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
సమస్యల పరిష్కారం కోరుతూ బహిష్కరణలు, అడుగడుగునా నిరసనల మధ్య శుక్రవారం జిల్లాలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలు వేడెక్కాయి. గత జన్మభూమి సభల్లో ఇచ్చిన హామీలు ఎందుకు పరిష్కారం కావడం లేదని, ప్రజలకేమీ చేయనప్పుడు ఈ సభలు నిర్వహించడం ఎందుకని జనం నిలదీశారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో నిర్వహించిన సభను గ్రామస్తులు బహిష్కరించారు. టీడీపీ నాయకులు సైతం కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. గతంలో జన్మభూమి సభల్లో సమస్యల పరిష్కారం కోసం చేసుకున్న దరఖాస్తులు పరిష్కరించకుండానే మళ్లీ సదస్సులు ఎందుకని ప్రశ్నించారు. వర్జీనియా పొగాకు రైతు సంఘం నాయకుడు పరిమి రాంబాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు కోనే శ్రీనివాస్ అధికారులను నిలదీసి సదస్సును అడ్డుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్టు నాయకులు ప్రకటించగా.. ప్రజలు సభ నుంచి వెళ్లిపోయారు. మొగల్తూరులో గ్రామ సభను సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించే వరకూ సభ జరపకూడదని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించినట్టు చెప్పారని.. ఇంతవరకూ స్థలాలు కేటాయించలేదని ధ్వజమెత్తారు. దీంతో అరగంటపాటు సభ జరగలేదు. చివరకు ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు హాజరై త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సభను అధికారులు ప్రారంభించారు. నరసాపురం మండలం సారవ, ఎల్బీ చర్ల గ్రామాల్లో ఇళ్ల స్థలాలకోసం మహిళలు అధికారులను నిలదీశారు. మంచినీటి సౌకర్యం మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. నరసాపురం పట్టణం 20వ వార్డులో మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ బుడితి దిలీప్ నిప్పులు చెరిగారు. చాగల్లు మండలం మార్కొండపాడులో ఇళ్లు మంజూరు చేయాలంటూ స్థానికులు అధికారులను చుట్టుముట్టి నిరసన తెలిపారు. కొవ్వూరు మండలం తోగుమ్మిలో కొత్తగా నియమించిన ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి తమకు వద్దని, ఇంతకు ముందు పనిచేసిన ఇన్చార్జి కార్యదర్శి కొనసాగించాలని డిమాండ్ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో పింఛన్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయకపోవడంపై గ్రామస్తులు అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. అర్హులైన వారికి పింఛన్లు ఎందుకివ్వడం లేదని వృద్ధులు ప్రశ్నించారు.