హీరో మోటోకార్ప్‌లో 4 శాతం వాటా విక్రయం
హీరో గ్రూప్ చేతికి రూ. 1,800 కోట్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌లో 4 శాతం వాటాను ప్రమోటర్ సంస్థ హీరో గ్రూప్ బుధవారం విక్రయించింది. వేగవంతమైన వృద్ధి అవకాశాలున్న కొత్త వ్యాపార విభాగాల్లో నిధులను వెచ్చించేందుకు వీలుగానే ఈ వాటా విక్రయిస్తున్నట్లు బ్రిజ్ మోహన్‌లాల్ ముంజల్ నేతృత్వంలోని హీరో గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 70 లక్షల షేర్లను విక్రయించిన తర్వాత కూడా తమకు ఇంకా హీరో మోటోకార్ప్‌లో 36% వాటా ఉన్నట్లు గ్రూప్ వెల్లడించింది.
గతేడాది డిసెంబర్ చివరి నాటికి హీరో గ్రూప్ వాటా 39.92%గా అంచనా. కాగా, ఎంత మొత్తానికి, ఏ రేటుకి తాజా షేర్ల విక్రయం జరిగిందనేది హీరో గ్రూప్ తెలియజేయలేదు. అయితే, గురువారం నాటి ముగింపు షేరు ము గింపు ధర రూ.2,663 చొప్పున చూస్తే ఈ డీల్ విలువ రూ.1,800 కోట్లకు పైగానే ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హోండాతో 26 ఏళ్ల భాగస్వామ్యానికి హీరో గ్రూప్ 2010 డిసెంబర్లో తెరదించిన సంగతి తెలిసిందే.
వాటా అమ్మకం నేపథ్యంలో బుధవారం హీరో మోటో షేరు ధర బీఎస్ఈలో 5.09 శాతం నష్టపోయింది. రూ.2,663 వద్ద స్థిరపడింది.