ప్రామిసరీ నోట్ అంటే..!
కాకినాడ లీగల్ : అప్పు తీసుకునేటప్పుడు రుణం ఇచ్చేవారికి తీసుకునేవారు ప్రామిసరీ నోట్ రాసి ఇస్తూంటారు. ఈ నోట్‌పై అవగాహన లేక కొందరు మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై సరైన అవగాహన ఉంటే మోసపోకుండా జాగ్రత్త పడే అవకాశముంటుంది.
ప్రామిసరీ నోట్ (ప్రోనోట్) అంటే రాతపూర్వకమైన పత్రమని అర్థం.
ప్రామినరీ నోట్లో డబ్బు ఇచ్చే వ్యక్తి (రుణదాత), అప్పు తీసుకున్న వ్యక్తి (రుణగ్రహీత) పూర్తి పేర్లు, చిరునామాలు ఉండాలి. డబ్బు ఎంత మొత్తం అనేది తప్పనిసరిగా అక్షరాల్లో రాసుకోవాలి. ప్రోనోట్ రాసిన స్థలం, తేదీని రాయాలి.
డబ్బు తీసుకునే వ్యక్తి ప్రోనోట్ కింది భాగంలో అంటించిన రెవెన్యూ స్టాంప్‌పై సంతకం చేయాలి. చదువురానివారు ఎడమచేతి బొటనవేలి ముద్రలను వేయాలి.
ప్రామిసరీ నోట్‌కు సాక్షులు ఉండి తీరాలని చట్టంలో లేదు. కాకపోతే ఇద్దరు సాక్షుల సంతకాలు తీసుకోవడం మంచిది. అలాగే రుణగ్రహీతకు ప్రోనోట్ రాసిన వ్యక్తి సంతకం చేయడం మంచిది.
నిర్ణీత మొత్తాన్ని ఒక వ్యక్తి లేదా అతడిచే ఆర్డర్ పొందిన వ్యక్తికి లే దా ఆ పత్రంపై డబ్బు తీసుకోవడానికి దానిని తెచ్చిన వ్యక్తికి చెల్లిస్తానని వాగ్దానం చేసి ఉండాలి. షరతులు మాత్రం ఉండకూడదు.
ప్రతిఫలం (ఇచ్చిన సొమ్ము) నగదు ద్వారా ముట్టినదో, చెక్కు ద్వారా ముట్టినదో రాయాలి.
ప్రామిసరీ నోట్ రాతపూర్వకంగా ఉండాలి.
ప్రామిసరీ నోట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
రూపాయి నుంచి ఎంత రు ణానికైనా ఒక రూపాయి రెవె న్యూ స్టాంప్ సరిపోతుంది.
కాలపరిమితి
ప్రామిసరీ నోట్‌పై ఉన్న తేదీ నుంచి మూడేళ్లు, ప్రామిసరీ నోట్ రాసిన తేదీ నుంచి మూడేళ్లలోపు రుణగ్రహీత సొమ్ము చెల్లించకుంటే కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. ఆపైకాలం దాటితే కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు. మూడేళ్ల కాలంలో రుణగ్రహీత ఏమైనా సొమ్ము చెల్లిస్తే ప్రామిసరీ నోట్ వెనుక ఎంత చెల్లించిందీ రాసి, సంతకం చేసి తేదీ వేయాలి. దీంతో ఆ తేదీ నుంచి తిరిగి మూడేళ్లు ప్రోనోట్‌కు కాలపరిమితి ఉంటుంది.
వడ్డీ : అప్పుగా తీసుకున్న సొమ్ముకు రూ.2 మాత్రమే వడ్డీగా వసూలు చేయాలి. అధిక వడ్డీ వసూలు చేయడం నేరం.
రుణదాత బాధ్యతలు
ప్రామిసరీ నోట్‌పై కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా చూసుకోవడం మంచిది.
రుణగ్రహీత సంతకాలను ఫోర్జరీ చేసి ప్రామిసరీ నోట్లు తయారు చేయడం నేరం.
రుణగ్రహీత డబ్బు అప్పు గా తీసుకుని మూడేళ్లలోవు చెల్లించకుంటే న్యాయవాది ద్వారా అతడి కి నోటీసు ఇచ్చి కోర్టులో కేసు దాఖలు చేయాలి.
రుణగ్రహీత బాధ్యతలు
ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేస్తే ఇబ్బందులు తప్పవు.
తాను అప్పుగా తీసుకున్న సొమ్మును స కాలంలో తీర్చాలి. తన ఆర్థిక శక్తి ఎంత ఉం దో అంతవరకే అప్పు తీసుకోవడం మంచిది.
ప్రోనోట్ బదిలీ
ప్రామిసరీ నోట్‌ను రుణదాత తనకు కావాల్సిన వ్యక్తికి బదిలీ చేయవచ్చు. రుణగ్రహీత నుంచి అప్పు వసూలు చేసుకునే హక్కును బదిలీ చేయవచ్చు.