ఎమ్మెల్యేల సరాసరి ఆస్తులు రూ. పది కోట్లు
న్యూఢిల్లీ: ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజా ప్రతినిధులైన చట్టసభల ప్రతినిధులు సామాన్యుల సంక్షేమానికి పట్టం కట్టాలి. అయితే ఢీల్లీ చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నవారే. ఒక్కొక్కరి సగటు ఆస్తి రూ.10 కోట్లకు పైమాటే. ఇటీవలి గణాంకాల ప్రకారం ఢిల్లీలోని సగటు మనిషి ఆదాయం రూ. 2.01 లక్షలు. అదే ప్రజా ప్రతినిధి అనిపించుకున్న శాసనసభ్యుడి సగటు ఆస్తి రూ.పది కోట్లు. ఢిల్లీ శాసనసభకు ఎన్నికైన ప్రతినిధులందరూ లక్షలాధికారులే. భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైన 31 మందిలో 30 మంది లక్షలాధికారులే. ఇక అవినీతి మీద ధ్వజమెత్తిన ఆమ్ఆద్మీ పార్టీ విజేతలు 28 మందిలో 12 మంది ఇదే స్థాయిలో ఉన్నారు. ఎనిమిది సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల్లో ఏడుగురు కోటీశ్వర్లు. ఇక శిరోమణి అకాలీదళ్ ఏకైక సభ్యుడు, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మరొకరు ఇదే వరుసలో చేరుతారు. జనతాదళ్ (యు) సభ్యుడు మాత్రమే ఈ కేటగిరీలో లేరు.
22 మంది ఢిల్లీ శాసనసభ్యుల ఆస్తులు రూ.14.22 కోట్లు. 2008లో వీరి ఆస్తులు కేవలం రూ.3.2 కోట్లు. ఐదేళ్ల కాలంలో వీరి ఆస్తులు 332 శాతం పెరిగాయి. కాంగ్రెస్ శాసనసభ్యుల ఆస్తులు ఈ ఐదేళ్లలో 232 శాతం పెరిగినట్లు వెల్లడయింది. ఇక బీజేపీ అభ్యర్థిగా సత్ప్రకాశ్ రాణా ఆస్తుల పెరుగుదల అందరికంటే ఎక్కువగా కనిపిస్తోంది. ఇతని ఆస్తి 2008లో రూ.6.38 కోట్లు కాగా ఇప్పుడు రూ.111.89 కోట్లు అని నమోదయింది. బీజేపీ మరో నేత పాలమ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ధరమ్దేవ్ సోలంకీ ఆస్తులు ఈ ఐదేళ్లలో రూ.180 కోట్లకు చేరాయి. దీని ద్వారా ఢిల్లీ సామాన్యుల కంటే అసాధారణంగా, అందనంత ఎత్తులో వీరున్నట్లు వెల్లడవుతోంది. వీరి సామాన్యుల ఆశలు నిలబెట్టి కాపాడితే ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లినట్లే అని విశ్వసిద్దాం.