protect women
-
మంటపుట్టిస్తాయి.. పారిపోయేలా చేస్తాయి
► భూత్ ఝలోకియా మిరపకాయలతో బాంబులు ► గుంపులు చెదరగొట్టేందుకు, మహిళల రక్షణకు ఉపయోగం ► డీఆర్డీవో శాస్త్రవేత్త శశి బాలా సింగ్ తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అల్లర్ల సమయంలో పోలీసులు, పారామిలటరీ దళాలు భాష్పవాయు గోళాలు వాడటం, పరిస్థితి చేయి దాటితే బుల్లెట్లు ప్రయోగించడం గురించి మనకు తెలుసు. కానీ ఇకపై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు మిర్చిబాంబులు వాడనున్నారు. అసోంలో పండే భూత్ ఝలోకియా రకం మిరపకాయలతో డీఆర్డీవో వీటిని తయారు చేస్తోంది. ఈ బాంబులను జమ్మూ కశ్మీర్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో గుంపులను చెదర గొట్టేందుకు ఉపయోగించినట్లు డీఆర్డీవో లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశి బాలా సింగ్ తెలిపారు. సైన్స్ కాంగ్రెస్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శశి బాలాసింగ్ ‘సాక్షి’తో మాట్లాడారు. భూత్ ఝలోకియా ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చి అని, దాని ఘాటుకు కారణమైన రసాయనాలను వేరు చేసి ఈ బాంబులు తయారుచేసినట్లు ఆమె తెలిపారు. ఈ బాంబుల నుంచి వచ్చే ఘాటుతో పాటు మంట వల్ల గుంపును చెల్లాచెదురు చేయవచ్చన్నారు. ఈ రసాయనాలను పెప్పర్ స్ప్రేల రూపంలో వాడేందుకూ అవకాశముందని, మహిళలు స్వీయ రక్షణకు ఈ పెప్పర్స్ప్రేలను వినియోగించుకోవచ్చ న్నారు. హిమాలయాలతో పాటు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండే ప్రదేశాల్లో సాధారణ పంటలు పండించేందుకు కొన్ని పద్ధతులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సియాచిన్ తో పాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులు ప్రాణవాయువు కోసం ఇబ్బంది పడుతుంటారని, ఈ సమస్యను అధిగమించేందుకు సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు డాక్టర్ శశి బాలా సింగ్ తెలిపారు. ఆక్సిజన్ తక్కువగా ఉండే అలాంటి ప్రాంతాల్లో సైనికులకు ప్రాణవాయువు అందించేందుకు గానూ సోలార్ చాంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. -
నిర్భయ చట్టంలో సారం లేదు: వి. సంధ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహిళల రక్షణకు చేసిన నిర్భయ చట్టంలోని అంశాలు ఆశాజనకంగా లేవని, జస్టిస్ వర్మ చేసిన ప్రధాన సిఫారసులను పక్కనపెట్టి సారం లేని చట్టాన్ని తయారు చేశారని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) ఆరోపించింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని నియంత్రించాలని, డిఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పీవోడబ్ల్యూ 6వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిసాయి. మహాసభల చివరిరోజు సోమవారం సంస్థాగత కార్యక్రమాలపై చర్చించి పలు నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. మహిళా ఉద్యమాలతో సాధించుకున్న 498ఏ చట్టాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని, అలాంటి ఆలోచనను విరమించుకుని వరకట్న వేధింపులు, హత్యల నిరోధానికి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తీర్మానించారు. మత రాజకీయాలు ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం కల్పించుకోకూడదని, ఆదివాసీ మహిళల ఉపాధి, నివాస హక్కులను పరిరక్షించే 5వ షెడ్యుల్‌ను అమలు చేయాలని, అటవీ భూములపై ఆదివాసీలకే హక్కులు కల్పించాలని, బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కుగా గుర్తించాలని, స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండు కమిటీలు వేయాలనే ప్రతిపాదనకు మహాసభలో ప్రతినిధుల నుంచి ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్టు సమాచారం. అయితే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు రెండు కమిటీలకు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పూర్తి స్థాయి కమిటీని మంగళవారం ప్రకటించనున్నారు. మహాసభలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య, ప్రధాన కార్యదర్శి విష్ణు, రాష్ట్రనేతలు బి.పద్మ, నర్సక్క, రమాసుందరి, సూర్యకుమారి, అనురాధ పాల్గొన్నారు.