ఆయుష్షును పెంచే సరికొత్త మాత్ర!
మానవ జీవితకాలాన్ని పొడిగించుకునే పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలలు మరో ముందడుగు వేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరంలోని అవయవాల పనితీరును తగ్గిస్తూ వచ్చే ప్రొటీన్ మాలిక్యూల్స్ జాడను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జిఎస్కే -3 గా పిలవబడే ప్రొటీన్ మాలిక్యూల్ అవయవాల పనితీరు సామర్థ్యాన్ని తగ్గిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో జీఎస్కె 3ను నియంత్రించడం ద్వారా ఆయుష్షను పొడిగించుకోవచ్చని డాక్టర్ జార్జ్ ఇవాన్ క్యాస్టిల్లో-క్వాన్ నేతృత్వంలో నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం మానవ ఆయుర్దాయాన్ని మరో 10 సంవత్సరాలు పెంచేలా ఓ చిన్న మాత్రను తయారు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
అవయవాల పనితీరును నియంత్రిస్తున్న జీఎస్కె 3ని నివారిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని దీన్ని నేరుగా ప్రభావితం చేసే మాత్ర తయారీకి ఎంతో కాలం పట్టకపోవచ్చని జార్జ్ వ్యాఖ్యానించారు. తమ పరిశోధన ద్వారా అల్జీమర్స్ వ్యాధికి గురయ్యే వారి వయసును పొడిగించగలిగితే చాలా మంచి విషయమవుతుందన్నారు. 100 నుంచి 120 సంవ్సతరాల సుదీర్ఘ కాలం బతకాలని కాకుండా.. కనీసం బతికనన్నాళ్లు ఆరోగ్యవంతంగా జీవించడం అవసరమన్నారు. అన్ని యాంటీ ఏజింగ్ మందుల్లో లాగానే దీంట్లో కూడా లిథియం వాడుతున్నప్పటికీ, తక్కువ లిథియం మోతాదు, తక్కువ దుష్ఫలితాలతో ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు తమ ప్రయోగాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
జీవితకాలం పొడిగింపు విషయంలో చాలా వివాదాలు ఉన్నప్పటికీ, వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవడం ముఖ్యమన్నారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, మధుమేహం, పార్కిన్సన్, క్యాన్సర్ వంటి రోగాలను సైతం ఈ మాత్రతో దూరం చేయవచ్చని ఆయన తెలిపారు. 'జీఎస్కే-3ని కనుగొనడంతో మేమెంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. వయసుతో పాటే వచ్చే అన్ని రోగాల నుంచి ఇక విముక్తి లభించనుంది. మధ్య వయసులో ఈ మాత్రల ద్వారా చికిత్స తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే అన్ని రకాల వ్యాధులు సమీప భవిష్యత్తులో నివారించవచ్చు' అని జార్జ్ పేర్కొన్నారు.
లండన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన ఫలిస్తే ఏడు నుంచి పది సంవత్సరాల జీవితం కాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు చెప్పారు. జర్నల్ సెల్ రిపోర్ట్స్ లో ప్రచురితమైన మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ బయాలజీ, యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ లేబరేటరీ కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నట్టు తెలిపారు.