ఇరాన్లో ఆందోళనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి
టెహ్రాన్: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ యువత, మహిళలు చేపట్టిన ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. సెప్టెంబర్‌లో మహ్సా అమీని మరణం తర్వాత ఈ నిరసనలు మరింత ఉదృతమయ్యాయి. వేలాది సంఖ్యలో మహిళలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ, జుట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కూడా ఆందోళనకారులను అణచివేస్తుంది. అల్లర్లలో పాల్గొన్న వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ ఉరిశిక్షలు విధిస్తుంది.
ఈ క్రమంలో తాజాగా హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిగాయి. ఇరాన్‌లోని నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసనకారులు, భద్రతా బలగాలపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా, 15మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దాడిని ఉగ్రవాద కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటించలేదు.
రెండు బైక్‌లపై వచ్చిన సాయుధ, ఉగ్రవాద శక్తులు ఇజెహ్ సీటిలోని సెంట్రల్ మార్కెట్లోకి వచ్చాయని, అక్కడే ఆందోళనకారులపై కాల్పులు జరిపాయని అక్కడి మీడియా పేర్కొంది. ఘటనలో పోలీసులు కూడా గాయపడినట్లు ఖుజెస్తాన్ డిప్యూటీ గవర్నర్ వాలియెల్లా హయాతీ తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళతోపాటు చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, నిందితుల వారికోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 26న షిరాజ్‌లో నిరసనకారులపై ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దాదాపు 13 మంది మరణించిన విషయం తెలిసిందే.
చదవండి: చెట్లకు సెలైన్‌లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి..