షుగర్ ఫ్యాక్టరీ వద్ద టీటీడీ ఛైర్మన్ హల్చల్
తిరుపతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకలకు పాల్పడుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో సాక్షాత్తూ టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఆయన అనుచరులు హల్చల్ సృష్టించారు.
నిండ్రలోని ప్రొడన్షియల్ షుగర్ ఫ్యాక్టరీపై చదలవాడ, ఆయన అనుచరులు గురువారం దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షుగర్ ఫ్యాక్టరీ తాళాలు పగులగొట్టి లోపలికి చొచ్చుకెళ్లిందుకు యత్నించడంతో పాటు గెస్ట్‌హౌస్ అద్దాలు ధ్వంసం చేశారు. చదలవాడ, తన అనుచరులతో గెస్ట్హౌస్లోనికి ప్రవేశించి తిష్ట వేశారు. కవరేజికి వెళ్లిన మీడియా సిబ్బందిపై చదలవాడ అనుచరుల దాడికి దిగారు. దీనిపై ఫ్యాక్టరీ సిబ్బంది నగరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా ఆయన దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్ తీరుపై ఫ్యాక్టరీ సిబ్బంది, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.