PSLV-C33
-
భారత జాతీయ జెండా విశ్వకేతనం ఘనత ఇస్రోదే
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్) సిరీస్‌లో ఏడో నావిగేషన్ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష విజయాల వినువీధిలో భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని విశ్వకేతనం చేసిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగించి పీఎస్ఎల్వీ సీ33 ప్రయోగాన్ని ఆయన న్యూఢిల్లీ నుంచి తిలకించారు. వాస్తవంగా ప్రయోగాన్ని స్వయంగా వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకింతం చేయడానికి విచ్చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన రాలేకపోవడంతో ప్రయోగం విజయవంతం కాగానే న్యూఢిల్లీ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇది ఇస్రో చేసిన ప్రయోగాల్లో చరిత్రాత్మకమై ఘట్టమని, దీన్ని యజ్ఞంలా తీసుకుని ఏడు నావిగేషన్ ఉపగ్రహాలను వరుసగా దిగ్విజయంగా ప్రయోగించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉపగ్రహ ప్రయోగాలతో సాంకేతిక విప్లవం వచ్చిందని, వాటి ఫలితాలు సామాన్యుడికి సైతం అందుతున్నాయన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదు దేశాలకు మాత్రం వివిధ రకాల పేర్లుతో నావిగేషన్ సిస్టం ఉందని, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం అభివృద్ధి చేసుకున్న ఆరో దేశంగా నేడు భారత్ అవిర్భవించిందని చెప్పారు. నావిగేషన్ సిస్టం అంటే నేడు సామాన్య మానవుడికే కాకుండా సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారులు నుంచి విమానాలు, నౌకలు నడిపే పైలైట్లు, కెప్టెన్ వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అవి ఎక్కడ జరిగాయో గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఇది దోహదపడుతుందని వివరించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఇతరత్రా ఉపద్రవాలు జరిగినా గుర్తించి సమాచారం అందిస్తుందన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సముద్రంలో తిరిగే ఓడలకు దిశా నిర్దేశాన్ని అందజేస్తుందన్నారు. భూమిమీద తిరిగే వాహనాలు, రైళ్లు, ఆకాశంలో తిరిగే విమానాలకు, నీటిపై తిరిగే ఓడలకు దిక్సూచి వ్యవస్థను అందించడమే కాకుండా సామాన్య మానవుడు వాడుకునే ఆండ్రాయిడ్ ఫోన్లలో నావిగేషన్ సిస్టంను అందిస్తుందని చెప్పారు. మరో రెండు, మూడు నెలల్లో ప్రతి ఒక్కరి చేతిలో నావిగేషన్ సిస్టం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సాంకేతిక ఫలితాలు పేదా గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలనే భారత ప్రభుత్వం లక్ష్యం నేరవేరుతోందని అన్నారు. అందుకే దీన్ని జాతికి అంకింతం చేస్తున్నామని మోదీ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు పదేళ్లు శ్రమించి నావిగేషన్ సిస్టంను తయారు చేసినందుకు వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ - 33
-
పీఎస్ఎల్వీ సీ - 33 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం పీఎస్ఎల్వీ సీ - 33 నింగిలోకి దూసుకెళ్లింది. ఉప గ్రహ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశించిన సమయంలోనే పీఎస్ఎల్వీ సీ-33 కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో షార్‌లోని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉప గ్రహ ప్రయోగాలలో ఇది ఆఖరుది. సొంత నావిగేషన్ వ్యవస్థ కోసం ఇప్పటికే ఆరు ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఐఆర్ఎన్ఎస్ఎస్ నుంచి రెండు రకాల సేవలు పొందవచ్చు. స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా అందరికీ సేవలు అందుతాయి. అలాగే నిర్దేశించిన వ్యక్తులు, వ్యవస్థలకు గోప్యంగా సమాచారం అందిస్తుంది. విమానాలు, నౌకలకు ఐఆర్ఎన్ఎస్ఎస్ దిశానిర్దేశం చేయనుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం అందిస్తుంది. దీని ద్వారా ఏ వాహనమైనా ఎక్కడుందో... ఇట్లే పసిగట్టగలం. మొబైల్ ఫోన్లలో ఇంటిగ్రేషన్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. మ్యాపింగ్, డేటా సేకరణ, ట్రెక్కింగ్, ట్రావెలర్లకు ఇది మరింత ఉపయోగం. 20 మీటర్ల ప్రదేశంలో ఎలాంటి వస్తువునైనా ఈ శాటిలైట్లు ఇట్టే పసిగట్టగలవు. ఈ రాకెట్ 12 ఏళ్ల పాటు సేవలందించనుంది. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ బలగాలు, తీవ్రవాదుల కదలికలపై జీపీఎస్ సమాచారం ఇవ్వాలని భారత్... అమెరికాను కోరింది. అందుకు అమెరికా నిరాకరించింది. దీంతో సొంత నావిగేషన్ కోసం భారత్ అప్పుడే నడుం కట్టింది. ఈ పీఎస్ఎల్వీ సీ 33 విజయవంతంతో 17 ఏళ్ల కృషి నేడు సాకారం అయింది.. 1,425 కేజీల ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకు వెళ్లింది. అతి తక్కువ ఖర్చుతో మెగా ప్రాజెక్టును ఇస్త్రో రూపొందించింది. అయితే ఇదే నావిగేషన్ కోసం చైనా 35 శాటిలైట్లను ప్రయోగించింది. అలాగే బైదూ నావిగేషన్ కోసం చైనా భారీగా ఖర్చు చేసింది. -
పీఎస్ఎల్వీ సీ33 కౌంట్ డౌన్ ప్రారంభం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ33 ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్ డౌన్ మంగళవారం ఉదయం 9.20గంటలకు ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా ఇండిపెండెంట్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్‌లో ఆఖరి ఉపగ్రహమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1జీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ప్రయోగం సఫలమైతే రెండు నెలల్లోనే భారత్‌కు పూర్తి స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. జూన్‌లో పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగం.. పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగాన్ని వాస్తవంగా మే నెలాఖరులో చేపట్టేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం జూన్ మొదటి వారానికి వాయిదావేయాలని ఎఆర్ఆర్ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రయోగంలో సరికొత్తగా 22 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.