సైకియాట్రీ కౌన్సెలింగ్
మా ఊళ్లో మాకు తెలిసిన ఒక వ్యక్తి రోజుల తరబడి ఒకే భంగిమలో స్థాణువులాగా నిలబడిపోయి ఉన్నాడు. అదే భంగిమలో స్థిరంగా, శిలావిగ్రహంలా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాకు దూరపు బంధువు. ఆయనను బాగు చేసే అవకాశం లేదా?
- సునీల్, కర్నూలు
ఒక వ్యక్తి శిలావిగ్రహంలా అదేపనిగా అలా నిలబడిపోవడాన్ని సైకియాట్రిక్ పరిభాషలో ‘కెటటో నియా’ అంటారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు కెటటోనిక్ రిజిడిటీ అనే కండిషన్లో వ్యక్తి కండరాలు బిగుసుకుపోయి చాలాసేపు కదలకుండా ఉంటాయి. ఇక పోస్ట్యూరింగ్ అనే స్థితిలో రోగులు అత్యంత కఠినమైన, ఇబ్బందికరమైన భంగిమల్లో గంటలు / రోజుల తరబడి ఉండిపోతారు. ఇలా కెటటోనియా కండిషన్ అనేక రకాలుగా వ్యక్తమవు తుంది. అయితే ఈసీటీ అనే చికిత్సతోనూ, కొన్ని మందులతోనూ వీళ్లను పూర్తిగా బాగు చేసే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి.
- డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్