శంషాబాద్‌లో సైకో వీరంగం
♦ ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి యత్నం
♦ అందులో ఓ మహిళను బ్లేడ్‌తో గాయపర్చిన రసూల్
♦ చితకబాది.. పోలీసులకు అప్పగించిన స్థానికులు
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం సైకో వీరంగం సృష్టించాడు. నడిచి వెళ్తున్న ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి యత్నించడమే కాకుండా అందులో ఓ మహిళను బ్లేడ్‌తో గాయపరిచాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ అహ్మద్ పాషా వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ రాష్ట్రం కర్నూల్లోని అశోక్‌నగర్‌కు చెందిన సయ్యద్ రసూల్(25) తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క షాహినీబీ వద్ద ఉంటున్నాడు. 2 రోజుల క్రితం ఉపాధి కోసం కర్నూలు నుంచి శంషాబాద్ వచ్చాడు. మంగళవారం పెద్దషాపూర్‌కు వచ్చిన రసూల్.. మహ్మదాబేగం అనే మహిళపై లైంగిక దాడికి యత్నించాడు.
ఆమె సైకోపై రాళ్లు రువ్వి తప్పించుకొని స్థానికులకు విషయం చెప్పింది. కొద్దిసేపటి తర్వాత కె.పద్మ అనే మరో మహిళను అడ్డగించి, బలవంతంగా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆమెపై లైం గిక దాడికి యత్నించడమే కాకుండా.. బ్లేడ్‌తో ఆమె కాలి బొటన వేలు కోశాడు. అంతేకాకుండా బ్లేడ్‌తో తన కాలునూ గాయపర్చుకున్నాడు. మహ్మదా బేగం ఇచ్చిన సమాచారంతో పెద్దషాపూర్వాసులు గాలించి రసూల్‌ను పట్టుకున్నారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.