జన సమీకరణలో గులాబీ శ్రేణులు
- నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ సభ
- జిల్లా నుంచి 50వేల మంది
- పార్టీ నేతల సమావేశాలు
- ప్రత్యేక వాహనాల ఏర్పాటు
ఆదిలాబాద్ టౌన్ : అధికార టీఆర్ఎస్ పార్టీ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జన సమీకరణలో నాయకులు నిమగ్నమయ్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు జిల్లాకు నుంచి 50 వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనరీ విజయవంతం కావడంతో సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించడానికి నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు.
బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల ఇన్చార్జిలు కసరత్తు చేస్తున్నారు. పశ్చిమ జిల్లా నుంచి 25వేల మంది, తూర్పు జిల్లా నుంచి మరో 25వేల మందిని బహిరంగ సభకు తరలించనున్నట్లు టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభకు తరలివెళ్లేందుకు జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల నుంచి ఉదయం 8గంటలకు బయల్దేరి సభకు చేరుకుంటామని తెలిపారు.
ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 5,500 మందిని తరలిస్తున్నట్లు చెప్పారు. 100 బస్సులు, పది జీపులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3వేల మంది తరలి వెళ్లనున్నారు. ఇందుకోసం 42 బస్సులు, 55 జీపులు ఏర్పాటు చేశారు. బోథ్ నియోజకవర్గం నుంచి 3వేల మందికి గాను 25 బస్సులు, 107 జీపులు, నిర్మల్ నియోజకవర్గం నుంచి 4,500 మంది కోసం 80 బస్సులు, 150 కార్లు ఏర్పాటు చేశారు. ముథోల్ నియోజకవర్గం నుంచి 3,300 మందిని తరలించడానికి 60 బస్సులు, 30 జీపులు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామం నుంచి కనీసం 50 మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా చూస్తున్నారు. బహిరంగ సభ బాధ్యతలను మండల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.
మందమర్రిలో ఆదివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని తరలించనున్నట్లు తెలిపారు. బహిరంగ సభ పోస్టర్లను విడుదల చేశారు. తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలు తరలిరావాలి
నిర్మల్ రూరల్ : హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని రాష్ర్ట గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ఐకేరెడ్డి నివాస భవనంలో ఆదివారం సాయంత్రం చలో హైదరాబాద్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి 50వేల మంది సభకు హాజరవుతారని తెలిపారు. ఇందులో టీఆర్ఎస్ నాయకులు ముత్యంరెడ్డి, తుల శ్రీనివాస్, మారుగొండ రాము, గోవర్ధన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.