Public transportation system
-
ఆర్టీసీకి మొండిచెయ్యేనా!?
సాక్షి, అమరావతి: తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థను ప్రభుత్వం ఆదుకోకుంటే దాని మనుగడకు పెనుముప్పు వాటిల్లే పరిస్థితి ఏపీఎస్ ఆర్టీసీలో నెలకొంది. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటకలలో ప్రజా రవాణా వ్యవస్థకు అక్కడి ప్రభుత్వాలు ఊతమిస్తున్నా ఇక్కడ ఆ ఛాయలేమీ కనిపించడంలేదు. మోటారు వాహన చట్టం పన్ను మొత్తం భరించడంతోపాటు ఇంధనంపై వ్యాట్ శాతం కూడా పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు భరిస్తున్నాయి. నష్టాలు వస్తే బడ్జెట్లో కేటాయింపులు చేసి ప్రజా రవాణాను బలోపేతం చేస్తున్నాయి. కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ బాగోగులేవీ పట్టడంలేదు. సంస్థను ప్రభుత్వం ఆదుకోవాలని, దాని మనుగడ ప్రభుత్వం చేతుల్లోనే ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) స్పష్టంచేసినా సర్కారులో ఎలాంటి చలనంలేదు. ఏటా ఏఎస్ఆర్టీయూ స్టడీ టూర్‌కు రాష్ట్ర అధికారులను ఎంపిక చేసి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు పంపుతున్నా.. అక్కడి సంస్కరణలను ఏ మాత్రం అందిపుచ్చుకోవడంలేదు. దీంతో ఏ ఏటికాయేడు ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.460 కోట్లు వరకు నష్టాలను మూటగట్టుకుంది. కార్మికుల పనితీరుతో గతేడాది కంటే రూ.400 కోట్ల అధికంగా ఆదాయం వచ్చిందని, ఆక్యుపెన్సీ రేషియో 82 శాతానికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ, నష్టాలను పూర్తిగా అధిగమించి, కార్మికులకు మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలంటే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక్కటే మార్గమన్న డిమాండ్‌ను ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 50 శాతం ఫిట్మెంట్ ప్రధాన డిమాండ్లతో ఈ నెల 6 నుంచి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు ఇప్పటికే నోటీసిచ్చాయి. అయితే, సర్కారు ఇంతవరకు సమస్యల పరిష్కారంలో ఎలాంటి చొరవ చూపలేదు. అలాగే, గతేడాది ఆర్టీసీ ఛైర్మన్, అధికారులు గుజరాత్ వెళ్లి అక్కడ ప్రజా రవాణా వ్యవస్థను అధ్యయనం చేశారు. ఇతర రాష్ట్రాలు, ఆస్ట్రేలియా అధ్యయన నివేదికలను ఆర్టీసీ అధికారుల బృందం యాజమాన్యానికి, ప్రభుత్వానికి అందించినా ఇంతవరకు సర్కారు పట్టించుకోలేదు. ఇలా అయితే సంస్థ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని ఏఎస్ఆర్టీయూ పేర్కొన్నా సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంవీ ట్యాక్స్‌నూ తగ్గించాలి మోటారు వాహన పన్ను ఆర్టీసీకి భారంగా పరిణమించడంతో పలుమార్లు పన్ను తగ్గించాలని కార్మికులు, యాజమాన్యం ప్రభుత్వానికి విన్నవించినా ఫలితంలేదు. గతంలోనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంవీ ట్యాక్స్ ఆర్టీసీ ఆదాయంలో 13 శాతం ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దానిని ఏడుకు తగ్గించారు. ప్రస్తుతం మరింత నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఎంవీ ట్యాక్స్ ఇంకా తగ్గించాలని కార్మికులు కోరుతున్నారు. పన్ను భారంవల్ల ఆర్టీసీ ఏటా రూ.300 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. అదే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే పన్ను భారం ఉండదు. ఆస్ట్రేలియాలో ఇలా.. - రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రజా రవాణా వ్యవస్థకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏకంగా 80 శాతం నిధుల్ని రాయితీ రూపంలో అందిస్తోంది. - అక్కడి ప్రజా రవాణా డ్రైవర్లు సిమ్యులేటర్‌పై డ్రైవింగ్ నేర్చుకుని రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సున్నా శాతం ప్రమాదాలను నమోదు చేస్తున్నారు. - అక్కడి ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. - బస్ డిపోల పర్యవేక్షణ, టికెట్ టెక్నాలజీ, ట్రాన్స్‌లింక్ మాత్రం బస్ డిపోల అధికారులు నిర్వహిస్తారు. - లాభనష్టాలతో బస్ డిపోల అధికారులకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఆర్టీసీకి మొత్తం ఉన్న నష్టాలు :రూ.3,700 కోట్లు - ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఉన్న నష్టాలు : రూ.460 కోట్లు - ఆర్టీసీలో గతేడాది వచ్చిన ఆదాయం : 5,500 కోట్లు - కార్మికులవల్ల గతేడాది కంటే పెరిగిన ఆదాయం : రూ.400 కోట్లు - 50 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏటా అదనపు భారం : రూ.1,500 కోట్లు - 20 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏటా పడే భారం : రూ.650 కోట్లు -
బస్సు, రైలు ప్రయాణం ఫ్రీ
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో గాలి కాలుష్యం ప్రధానమైంది. వ్యక్తిగత వాహనాలు ఎక్కువైపోవడం దీనికొకకారణం. మనిషి మనుగడకు ముప్పుగా పరిణమించిన వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలు తమకు చేతనైన ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఐరోపాలో బుల్లి దేశమైన లక్సంబర్గ్ ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుంది. త్వరలో లక్సంబర్గ్ ప్రభుత్వం దేశంలో ప్రజా రవాణాను ఉచితం చేయనుంది. అంటే ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్ కొనాల్సిన పని ఉండదు. అది అమల్లోకి వస్తే ప్రపంచంలో ఇలాంటి విధానం అమలు చేస్తున్న తొలి దేశం లక్సంబర్గే అవుతుంది. 2020 నుంచి దేశంలో ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని గ్జేవియర్ బెటెల్ ప్రకటించారు. ఉచిత రవాణా వల్ల వ్యక్తిగత వాహనాలు తగ్గుతాయని దాంతో గాలి కాలుష్యం కొంత మేర తగ్గే అవకాశం ఉందని ఆయన వివరించారు. అంతేకాకుండా దీనివల్ల ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందన్నారు. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మధ్య ఉన్న చిన్న దేశం లక్సంబర్గ్. జనాభా 6 లక్షలు. దేశంలో ప్రతి వెయ్యి మందికి 647 కార్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఏడాదిలో 32.21 గంటలు ప్రయాణాల్లోనే గడుపుతున్నారు. ప్రతిరోజూ పొరుగు దేశాల నుంచి లక్షా 90వేల మంది వచ్చి ఇక్కడ పనులు చేసుకుని వెళ్లిపోతుంటారు. వారిలో కొందరు సొంత వాహనాల్లో వస్తే, మరికొందరు ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల దేశంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఎన్నికలప్పుడు ఇదీ కీలక ప్రచారాంశం కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను ఉచితం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇతర దేశాలను కూడా ఈ దిశగా ఆలోచించేలా చేస్తోంది. 2013 లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉ చిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. తలిన్‌లో ప్రజలు 2యూరోలతో హరిత రవాణా పాస్ కొను క్కుని అన్ని మున్సిపల్ బస్సులు, రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఎప్పటి నుంచో అక్కడ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. ఒక్కో కుటుంబానికి రూ.7లక్షలు ఆదా.. ప్రభుత్వ రవాణా వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనాలున్నాయని అమెరికన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(అప్టా) తెలిపింది. ఈ రంగంలో ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టే ప్రతి డాలరుకు 4 డాలర్లు తిరిగి వస్తుందని ఆప్టా తెలిపింది. దీనివల్ల గ్రీన్హౌస్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంది. సొంత వాహనాలను పక్కనపెట్టి ప్రభుత్వ వాహనాలు ఉపయోగించడం వల్ల అమెరికాలో ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదా చేయవచ్చని ఆప్టా అంచనా వేసింది. -
ఇంటి ధరను నిర్ణయించేవేంటి?
సాక్షి, హైదరాబాద్: ఇంటి అంతిమ విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? అని! చేరువలో షాపింగ్ మాళ్లు లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి.. వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందన్న విషయం మరిచిపోవద్దు. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్ సదుపాయాలూ కీలకమే. భవిష్యత్తు అవసరాలూ చూడాల్సిందే.. ఇంటి కొనుగోలులో సౌకర్యాలే కాదు భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ–మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరమే కావచ్చు. కానీ, అదే ఇంటిని మీరు అమ్మేటప్పుడు మాత్రం పైవన్నీ కీలకమవుతాయని మరిచిపోవద్దు. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇల్లు కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి అంతిమ విలువను లెక్కగడతారని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి. న్యాయపరమైన చిక్కులుంటే అంతే! చేరువలోనే స్కూలు, ఆసుపత్రి, షాపింగ్ మాల్ వంటి ఎన్ని రకాల సదుపాయాలున్నా సరే న్యాయపరమైన చిక్కులున్నాయో అంతే సంగతులు. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందగుగు వేస్తాడని మరవొద్దు. విక్రయించే స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారులకు స్పష్టంగా ఓపిగ్గా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు ఉండాలన్నమాట. అలాగే ఆ ఇంటికొచ్చేందుకు లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటుగా అడ్రస్ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.