సాక్షి, అమరావతి: తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థను ప్రభుత్వం ఆదుకోకుంటే దాని మనుగడకు పెనుముప్పు వాటిల్లే పరిస్థితి ఏపీఎస్ ఆర్టీసీలో నెలకొంది. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటకలలో ప్రజా రవాణా వ్యవస్థకు అక్కడి ప్రభుత్వాలు ఊతమిస్తున్నా ఇక్కడ ఆ ఛాయలేమీ కనిపించడంలేదు. మోటారు వాహన చట్టం పన్ను మొత్తం భరించడంతోపాటు ఇంధనంపై వ్యాట్ శాతం కూడా పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు భరిస్తున్నాయి. నష్టాలు వస్తే బడ్జెట్‌లో కేటాయింపులు చేసి ప్రజా రవాణాను బలోపేతం చేస్తున్నాయి. కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ బాగోగులేవీ పట్టడంలేదు. సంస్థను ప్రభుత్వం ఆదుకోవాలని, దాని మనుగడ ప్రభుత్వం చేతుల్లోనే ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) స్పష్టంచేసినా సర్కారులో ఎలాంటి చలనంలేదు. ఏటా ఏఎస్‌ఆర్టీయూ స్టడీ టూర్‌కు రాష్ట్ర అధికారులను ఎంపిక చేసి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు పంపుతున్నా.. అక్కడి సంస్కరణలను ఏ మాత్రం అందిపుచ్చుకోవడంలేదు. దీంతో ఏ ఏటికాయేడు ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.460 కోట్లు వరకు నష్టాలను మూటగట్టుకుంది. కార్మికుల పనితీరుతో గతేడాది కంటే రూ.400 కోట్ల అధికంగా ఆదాయం వచ్చిందని, ఆక్యుపెన్సీ రేషియో 82 శాతానికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ, నష్టాలను పూర్తిగా అధిగమించి, కార్మికులకు మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాలంటే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక్కటే మార్గమన్న డిమాండ్‌ను ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 50 శాతం ఫిట్‌మెంట్ ప్రధాన డిమాండ్లతో ఈ నెల 6 నుంచి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు ఇప్పటికే నోటీసిచ్చాయి. అయితే, సర్కారు ఇంతవరకు సమస్యల పరిష్కారంలో ఎలాంటి చొరవ చూపలేదు. అలాగే, గతేడాది ఆర్టీసీ ఛైర్మన్, అధికారులు గుజరాత్ వెళ్లి అక్కడ ప్రజా రవాణా వ్యవస్థను అధ్యయనం చేశారు. ఇతర రాష్ట్రాలు, ఆస్ట్రేలియా అధ్యయన నివేదికలను ఆర్టీసీ అధికారుల బృందం యాజమాన్యానికి, ప్రభుత్వానికి అందించినా ఇంతవరకు సర్కారు పట్టించుకోలేదు. ఇలా అయితే సంస్థ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని ఏఎస్‌ఆర్టీయూ పేర్కొన్నా సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు.
ఎంవీ ట్యాక్స్‌నూ తగ్గించాలి
మోటారు వాహన పన్ను ఆర్టీసీకి భారంగా పరిణమించడంతో పలుమార్లు పన్ను తగ్గించాలని కార్మికులు, యాజమాన్యం ప్రభుత్వానికి విన్నవించినా ఫలితంలేదు. గతంలోనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంవీ ట్యాక్స్ ఆర్టీసీ ఆదాయంలో 13 శాతం ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దానిని ఏడుకు తగ్గించారు. ప్రస్తుతం మరింత నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఎంవీ ట్యాక్స్ ఇంకా తగ్గించాలని కార్మికులు కోరుతున్నారు. పన్ను భారంవల్ల ఆర్టీసీ ఏటా రూ.300 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. అదే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే పన్ను భారం ఉండదు.
ఆస్ట్రేలియాలో ఇలా..
- రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రజా రవాణా వ్యవస్థకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏకంగా 80 శాతం నిధుల్ని రాయితీ రూపంలో అందిస్తోంది.
- అక్కడి ప్రజా రవాణా డ్రైవర్లు సిమ్యులేటర్‌పై డ్రైవింగ్ నేర్చుకుని రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సున్నా శాతం ప్రమాదాలను నమోదు చేస్తున్నారు.
- అక్కడి ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది.
- బస్ డిపోల పర్యవేక్షణ, టికెట్ టెక్నాలజీ, ట్రాన్స్‌లింక్ మాత్రం బస్ డిపోల అధికారులు నిర్వహిస్తారు.
- లాభనష్టాలతో బస్ డిపోల అధికారులకు ఏ మాత్రం సంబంధం ఉండదు.
ఆర్టీసీకి మొత్తం ఉన్న నష్టాలు :రూ.3,700 కోట్లు
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఉన్న నష్టాలు : రూ.460 కోట్లు
- ఆర్టీసీలో గతేడాది వచ్చిన ఆదాయం : 5,500 కోట్లు
- కార్మికులవల్ల గతేడాది కంటే పెరిగిన ఆదాయం : రూ.400 కోట్లు
- 50 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఏటా అదనపు భారం : రూ.1,500 కోట్లు
- 20 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఏటా పడే భారం : రూ.650 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment