పోలీసు పహారా, తనిఖీలు ఎందుకు?
♦ ఈఆర్సీ బహిరంగ విచారణ తీరుపై ప్రజా సంఘాల నేతలు,
♦ విద్యుత్ నిపుణుల ఆగ్రహం
♦ చార్జీల పెంపుపై అభిప్రాయ సేకరణ రసాభాస
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహిస్తున్న బహిరంగ విచారణ తీరును ప్రజా సంఘాల నేతలు, విద్యుత్ నిపుణులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్యుత్ శాఖ ఉద్యోగన్న సాకుతో ఆ రంగ నిపుణుడు రఘును హాజరుకాకుండా నియంత్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్న సమావేశ మందిరం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి, తనిఖీలు చేపట్టి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరమేమిటని నిలదీశారు. విచారణ సందర్భంగా అభిప్రాయాలు చెబుతున్న వారి పట్ల ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ వ్యవహార శైలిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుతోనే తెలంగాణ వచ్చిందని, ఇక్కడ కూడా పారదర్శకత లేకపోతే ఎలాగని ప్రశ్నించారు.
తొలిరోజు రసాభాస...
విద్యుత్ చార్జీల పెంపుకోసం విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసిన ప్రతిపాదనలపై ఈఆర్సీ బుధవారం బహిరంగ విచారణ ప్రారంభించింది. తొలిరోజున హైదరాబాద్‌లోని తెలంగాణ ఫ్యాప్సీభవన్‌లో నిర్వహించిన విచారణకు పలు ప్రజా సంఘాలు, సంస్థల నాయకులు, విద్యుత్ రంగ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ విచారణకు హాజరుకావద్దంటూ ఈఆర్సీ జారీచేసిన అడ్వెయిజరీపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. విద్యుత్ రంగాన్ని మెరుగుపరిచేందుకు ఉద్యోగుల సహకారం కూడా తీసుకుంటే నష్టమేమిటని, రఘును విచారణలో పాల్గొనకుండా చేయడం సరికాదని పీపుల్ మానిటరింగ్ గ్రూప్ ఆన్ ఎలక్ట్రిసిటీ సభ్యుడు దొంతిరెడ్డి నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యం పెరిగేలా చూడాలన్నారు. ఈఆర్సీ పారదర్శకతను పాటించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (తెలంగాణ ఎన్ఆర్ఐఎస్) నాయకుడు డి.పాండురంగారెడ్డి సూచించారు. పబ్లిక్ హియరింగ్‌లో అందరినీ భాగస్వాములను చేయాలని, రఘును విచారణకు అనుమతించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈఆర్సీ ప్రభుత్వ నియంత్రణకు అతీతంగా పనిచేయాలని సూచించారు. విచారణకు రాకుండా రఘును అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని టీజేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఈ విధంగా జరగడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రశ్నించే గొంతుతోనే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు కూడా పారదర్శకత లేకపోతే ఎలాగని నిలదీశారు. ఇక బహిరంగ విచారణ ప్రాంగణాన్ని పోలీసు బందోబస్తుతో నింపేయడాన్ని, విచారణకు వచ్చినవారిని తనిఖీ చేశాకే లోపలికి పంపడాన్ని ఆప్ నేత పీఎల్ విశ్వేశ్వరరావు ప్రశ్నించారు.
ఏది వాగితే అది వినాలా..?: ఈఆర్సీ చైర్మన్
చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణలో సీనియర్ జర్నలిస్టు వేణుగోపాలరావు (సెంటర్ ఫర్ పవర్ స్టడీస్) పలు అంశాలను వివరించారు. ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్న మిగులు విద్యుత్ యదార్థం కాదని, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఏపీ నుంచి చౌకగా విద్యుత్ తీసుకునే అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఈఆర్సీ చైర్మన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘ఏపీ ఇవ్వకపోతే ఏం చేస్తారు.. తెలంగాణకు పరిమితమై మాట్లాడండి..’’ అని పేర్కొన్నారు. ఈ దశలో వేణుగోపాల్‌కు వెంకటరెడ్డి (టీ జేఏసీ), పీఎల్ విశ్వేశ్వరరావు మద్దతుగా నిలుస్తూ... చైర్మన్ మాట్లాడే పద్ధతి, వ్యవహారశైలి బాగోలేదని, భారీగా పోలీసులను ఎందుకు మోహరించారని నిలదీశారు. దీనిపైనా చైర్మన్ తీవ్రంగా స్పందించారు. ‘ఆయన (వేణుగోపాల్) ఏది వాగితే అది వినాలా?..’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. కొన్ని శక్తులు రాకూడదనే పోలీసులున్నారని, వారు ఎట్లా వస్తారో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు.