ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత
► ఎన్టీఆర్ భవన్ ముట్టడి
► బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలంటూ ప్రజాసంఘాల డిమాండ్
హైదరాబాద్: ఏఓబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను ముట్టడించాయి. వరవరరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ప్రజాసంఘాల నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని... పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ ఆర్కే పేరుతో చేపట్టిన కూంబింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని, ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పోలీసులు వరవరరావును అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. దీంతో ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏఓబీ ఎన్కౌంటర్లో కేంద్రం, ఏపీ, ఛత్తీస్గడ్ రాష్ట్రాల పోలీసు బలగాలు చాలా మంది మావోయిస్టులు, ఆదివాసీలను చంపేశాయని నేతలు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో.. దాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్తంభించి పోయింది.