ఐఎస్ వద్దందని అమ్మనే చంపేశాడు
ఎవరికోసమో, ఎందుకోసమో అర్థంకాని పోరాటం వద్దంది. మిగిలిన పేగు బంధం నువ్వొక్కడివే.. ఎక్కడికైనాపోయి బతుకుదాం రమ్మంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తాగింది తల్లిపాలే అయినా మతం మత్తులో నిలువెల్లా కలుషితమైన ఆ కొడుకు.. మాతృమూర్తినే అంతం చేశాడు. ఐఎస్ ది తప్పుడు మార్గం అన్నందుకు సొంత తల్లిని బహిరంగంగా కాల్చేశాడు. సిరియాలోని రక్కా పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న సంచలనాత్మక ఉదంతాన్ని రిబ్స్ సంస్థ వెలుగులోకి తెచ్చింది.
లీనా అల్ ఖాసిం (45) రక్కాలోని పోస్ట్ ఆఫీస్ ఉద్యోగిని. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన ఆమె.. పిల్లల్ని కూడా ఉన్నతంగా చదివించాలనుకుంది. కానీ విధి మరోలా ఎదురైంది. సిరియాలో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం చివరికి ప్రపంచ దేశాల యుద్ధంగా మారి.. ఒక్క కొడుకు తప్ప దాడుల్లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె కొడుకు అలీ సఖ్ర్ అల్ ఖాసీంకు 20 ఏళ్లు.
కొద్ది రోజుల కిందటే అలీ ఐఎస్ఐఎస్ జీహాదీగా మారడం తల్లిని కలవరపర్చింది. ఐఎస్ ను వీడాలంటూ లీనా కొడుకుపై ఒత్తిడి తెచ్చింది. బయటిదేశాలకుపోయి ప్రశాంతంగా బతుకుదామని చెప్పింది. తల్లి తనతో పంచుకున్న విషయాల్ని సీనియర్లకు చేరవేశాడు అలీ. అంతే. లీనా ఇస్లామ్ కు ద్రోహం తలపెట్టిందని, వెంటనే ఆమెకు మరణ దండన అమలుచేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. పట్టపగలు, అందరూ చూస్తుండగా, ఆమె పనిచేసే పోస్టాఫీసు ఎదుటే లీనాను కాల్చిచంపారు ఐఎస్ ఉగ్రవాదులు. ఆమె తలకు గురిపెట్టి తుపాకి పేల్చింది మరెవరోకాదు ఆమె కొడుకు అలీయే.