మొదలైన పుస్తకాల పండుగ
ప్రగతిమైదాన్‌లో తొమ్మిది రోజుపాటు నిర్వహించే 19వ ఢిల్లీ పుస్తక ప్రదర్శన శుక్రవారం ఘనంగా ప్రారంభమయింది. దేశవిదేశాలకుచెందిన 250 మంది ప్రచురణకర్తలు దీనికి హాజరయ్యారు. ఈ నెల 31న ప్రదర్శన ముగుస్తుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సామాన్య ప్రజలు ఈ ప్రదర్శనను వీక్షించవచ్చు.
న్యూఢిల్లీ: దేశవిదేశాల పుస్తకాల ప్రదర్శన, విక్రయాలకు నెలవైన 19వ ఢిల్లీ పుస్తక ప్రదర్శన ప్రగతి మైదాన్‌లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయింది. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పుస్తకాలను కొనుక్కోలేని పేద చిన్నారుల్లో పఠనాభిలాషను పెంచాలంటే అన్ని చోట్లా మరిన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ‘మనది ఇప్పటికీ పేదదేశమే కాబట్టి గ్రంథాలయాల ఏర్పాటు తప్పనిసరి. చాలా మంది పిల్లలు పుస్తకాలు కొనుక్కోలేరు. గ్రంథాయాలు, పఠన సంస్కృతి అభివృద్ధికి అంతా కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. భారతీయ ముద్రణాపకుల సమాఖ్య (ఎఫ్ఐపీ) భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీఓ) సహకారంతో 1995 నుంచి ఏటా ఢిల్లీ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది.
ఈసారి తొమ్మిది రోజులపాటు నిర్వహించే ప్రదర్శనకు దేశవిదేశాల నుంచి 250 మంది ప్రచురణకర్తలు హాజరయ్యారు. ఈ నెల 31న ప్రదర్శన ముగుస్తుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సామాన్య ప్రజలు దీనిని వీక్షించవచ్చు. పఠనాభిలాష తగ్గుదలపై దృష్టిసారించడానికి ఈసారి దానినే ప్రధానాంశంగా చేశారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించేందుకు ‘లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్’ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రదర్శనలకే పరిమితం కాకుండా సదస్సులు, చర్చాకార్యక్రమాలు, కవితా సమ్మేళనాలు, చిన్నపిల్లల కోసం కథల పఠనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్ ప్రాధాన్యం గురించి ఎఫ్ఐపీ ప్రధాన కార్యదర్శి అశోక్‌గుప్తా స్పందిస్తూ ‘మంచి గ్రంథాలయాలను ఒకప్పుడు సమాజ సంపదగా భావించేవారు. అవి మనలో అంతర్భాగమయ్యాయి. అయితే ఈతరం ప్రజల్లో పఠనాభిలాష తగ్గుతోంది. ఈ అంశంపై దృష్టి సారించడం అత్యవసరం కాబట్టే లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అని వివరించారు.
ప్రతిచోటా కనీసం చిన్నస్థాయి గ్రంథాలయాలనైనా ఏర్పాటు చేసి చదువుపై ఆసక్తిని పెంచాలని అభిప్రాయపడ్డారు. ప్రగతిమైదాన్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఢిల్లీతోపాటు అగర్తలా, ఆంధప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, అమెరికా, చైనాకు చెందిన ముద్రణసంస్థలు హాజరవుతున్నాయి. ఈసారి చిన్నారుల కోసం ‘లైబ్రరీ అండ్ ది రీడర్’ పేరుతో చర్చాకార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ‘సునె, జానే, ఖేలే కహానీ’ పేరుతో మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పలు కొత్తపుస్తకాల ఆవిష్కరణ సభలు కూడా జరుగనున్నాయి. ఇక పుస్తక ప్రదర్శనకు తొలిరోజే విశేష స్పందన కనిపించింది. కాలేజీ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ప్రదర్శనకు వచ్చారు. ప్రదర్శనకు ప్రవేశరుసుము రూ.20కాగా, విద్యార్థులకు 50 శాతం రాయితీ ఇస్తున్నారు. చిన్నారులు రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ‘ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఢిల్లీవాసులు అమితంగా ఆసక్తి చూపుతారని అనుకుంటున్నాను. నిజంగా ఇది అద్భుత ప్రదర్శన. గ్రంథాలయాలను ఈసారి ప్రధానాంశంగా (థీమ్) చేశాం. దేశవ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరాం’ అని ఐటీపీఓ చైర్మన్, మేనేజింగ్డెరైక్టర్ రీటా మీనన్ అన్నారు. రచయితలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా వారికి ఒక గదిని కేటాయించామని, అక్కడ పాఠకులతో చర్చలు జరుపవచ్చని చెప్పారు. చాలా మంది రచయితలు, ప్రచురణకర్తలతో మాట్లాడడానికి ఆసక్తి చూపారని తెలిపారు.
భారీగా తరలివచ్చిన స్కూళ్ల విద్యార్థులు
ఢిల్లీలోని పలు పాఠశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తొలిరోజే పుస్తక ప్రదర్శనకు తరలివచ్చారు. దేశవిదేశాల ప్రచుకరణకర్తలు ఈ ప్రదర్శనకు వస్తుండడం, ప్రత్యేక రాయితీలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చామని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి. ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలుగా ప్రగతి మైదాన్ వరకు రవాణా సదుపాయాలు కల్పించేందుకు చ ర్యలు తీసుకున్నామని రీటా తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం బోధన సామగ్రి దుకాణాలు, ఫలహారశాలలను కూడా ఏర్పాటు చేశామన్నారు.
తొలి రోజు స్పందన తక్కువే
న్యూఢిల్లీ: గత ఏడాదితో పోలిస్తే ఈసారి పుస్తక ప్రదర్శనకు స్పందన కాస్త తక్కువే కనిపించిందని చెప్పాలి. దీని నిర్వాహకులు ఈ ఏడాది వారాంతాలకు బదులు శుక్రవారం కార్యక్రమాన్ని ప్రారంభించడమే దీనికి కారణమని చెబుతున్నారు. ‘మామూలు రోజుల్లో ప్రజలు తీరిక లేకుండా ఉంటారు కాబట్టి శుక్రవారం ప్రారంభించడం సరైంది కాదు. అందుకే తొలిరోజు వీక్షకుల సంఖ్య తక్కువగా కనిపించింది’ అని ఓంబుక్స్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈఓ సంజయ్ మాగో అన్నారు. ఇంత తక్కువ మంది వస్తే తమకు నష్టాలు ఖాయమన్నారు. ప్రతి ఏడు రెండు వారాంతాల్లో ప్రదర్శన ఉండేలా చూసేవారని, ఈసారి మాత్రం ఒక్క ఆదివారమే మిగులుతోందని నియోగి బుక్స్ సంస్థ ప్రతినిధి అన్నారు.
‘ఈసారి చివరి రోజు ఆదివారమే అయినా మేం అప్పుడు స్టాల్స్‌ను ఖాళీ చేసే పనిలో ఉంటాం కాబట్టి వ్యాపారం పెద్దగా జరగకపోవచ్చు’ అని ఆయన అన్నారు. దీనికి ఐటీపీఓ ప్రతినిధులు వివరణ ఇస్తూ తాము కావాలని ఇలా చేయలేదన్నారు. గత ఆదివారం నుంచే స్టాల్స్ కేటాయిస్తున్నామని చెప్పారు. వచ్చే శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు కాబట్టి, సందర్శకులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మంచి పుస్తకాలు ప్రదర్శించగలిగే ఏ రోజైనా గిరాకీ బాగానే ఉంటుందని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రతినిధి ఎం.ఎల్.భాటియా అన్నారు. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం, పుస్తకాలు ధరలు పెరగడం వల్ల ఈసారి అమ్మకాలు తక్కువగా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రదర్శన ముగియడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే నిరాశకు గురికావాల్సిన అవసరం లేదని ముంబై ప్రచురణ సంస్థ జైకో పబ్లికేషన్స్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.