నరేంద్ర మోదీ ని 'బుక్' చేసేస్తున్న పబ్లిషర్లు!
బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ అంటే సంచలన రాజకీయాలకు మారు పేరు. చాయ్ వాలా నుంచి పీఎం అభ్యర్థిగా ఆయన యాత్ర ఎంతో ఆసక్తికరం. అంతకుమించి, ఆయన జీవితంలో చాలా రహస్యాలున్నాయి.
ఆయనకు పెళ్లైందా? అయితే భార్య ఉందా? భార్య ఉంటే ఆమె ఇప్పుడెక్కడ ఉంది? ఏం చేస్తోంది? మోదీకి, ఆమెకి ఇప్పటికీ సంబంధాలున్నాయా? ఆయన ఒంటరిగానే ఉంటారా లేక తల్లిగారితో కలిసుంటారా? గుజరాత్ అల్లర్లలో ఆయన పాత్ర ఏమిటి? మోదీ పర్సనల్ లైఫ్ కబుర్లేమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నల జవాబుల కోసం చాలా మంది వెతుకుతున్నారు. ఆయన జీవితం ఎంత విలక్షణమో అంతే వివాదాస్పదం.
అందుకే మోదీ పట్ల ఉన్న ఈ ఆసక్తిని ఇప్పుడు ఈ ఎన్నికల వేళ ప్రింటింగ్, పబ్లిషింగ్ రంగం సొమ్ముచేసుకుంటోంది. మోదీపైన కుప్పలు తెప్పలుగా పుస్తకాలు పుట్టుకొస్తున్నాయి. తోచినవారు తోచినన్ని వివరాలు సేకరిస్తున్నారు. రాసినవారు రాయగలిగినంత రాస్తున్నారు. ఆన్ లైన్ అమ్మకందారు ఫ్లిప్ కార్ట్ వద్ద మోదీ జీవితానికి సంబంధించిన 42 కి పైగా పుస్తకాలున్నాయి. అందులో గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ లో జర్నలిస్టుగా పనిచేసి, మోదీకి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసి చీకాకు పెట్టిన కింగ్ షుక్ నాగ్ రాసిన 'ది నమో స్టోరీ, ఎ పొలిటికల్ లైఫ్( నుంచి నీలాంజన్ ముఖ్యోపాధ్యాయ రాసిన 'నరేంద్ర మోదీ, ది మ్యాన్' వరకూ పలు రకాల పుస్తకాలున్నాయి.
ఒక్క ఇంగ్లీషులోనే కాదు, హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ సహా పలు భారతీయ భాషల్లో మోదీపై పుస్తకాలు ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. ఒక రచయిత మోదీ చిన్నప్పుడు నాటకాలు వేసేవాడని, అందుకే ఆయన తన ప్రసంగాల్లో హావభావాలను, అభినయకళను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారని రాస్తే, ఇంకొకరు హిందీ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా నుంచి తాను వేసుకునే హాఫ్ కుర్తా ను మోదీ రూపొందించుకున్నారని రాశారు.
మోదీపై వెలువడిన పుస్తకాల్లో నరేంద్ర మోదీ - ఎ పొలిటికల్ బయోగ్రఫీ, ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ - నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీ - యెస్ హీ కెన్, నరేంద్రమోదీ - ది గేమ్ ఛేంజర్, మోడినామిక్స్, నరకేసరి నరేంద్ర మోదీ వంటివి హాట్ కేక్ లుగా అమ్ముడౌతున్నాయి.
అంతే కాదు. నరేంద్ర మోదీ రాసిన సామాజిక్ సమరసతా, కన్వీనియంట్ ఎడ్యుకేషణ్ వంటి పుస్తకాలు కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా కొనుక్కుని చదువుతున్నారు. ఎన్నికల వేడి పెరిగేకొద్దీ తమ పుస్తకాల సేల్స్ పెరుగుతాయని పబ్లిషర్లు అంచనావేస్తున్నారు. మే నెల నాటికి మరిన్ని పుస్తకాలను మార్కెట్ పై వదిలేందుకు ప్రచురణకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. మోదీ ప్రధాని అయితే మాత్రం తమ అమ్మకాలు ఆకాశాన్ని తాకడం ఖాయమంటున్నారు ప్రచురణకర్తలు.
ఎన్నికల వేళ రాజకీయ నాయకుల జీవిత చరిత్రల పట్ల గతంలో ఎన్నడూ ఇలాంటి ఆసక్తి కనిపించలేదు. వాజ్ పేయీ ప్రధాని అయిన తరువాత ఆయన రచనల పట్ల కొంత ఆసక్తి పెరిగిన మాట వాస్తవమే అయినా మోడీ క్రేజు దానిని బీట్ చేసేసింది. గత లోకసభ ఎన్నికల సమయంలో బీజేపీ మహారథి లాల్ కృష్ణ అద్వానీ 'మై కంట్రీ, మై లైఫ్' పేరిట తన ఆత్మకథను వెలువరించారు. అయితే దాని వల్ల అద్వానీకి పెద్దగా లాభం కలగలేదు.