సురభి ఎదురు చూపులు
నటి సురభి పుగళ్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రంతో కోలీవుడ్‌లో తన స్థాయి పెరుగుతుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నది. విక్రమ్ ప్రభు సరసన ఇవన్ వేర మాదిరి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగు పెట్టిన సురభి ఆ తర్వాత ధనుష్ చిత్రం వేలైఇల్లాద పట్టదారి చిత్రంలో నటించారు. ఆ తర్వాత అవకాశాలు ఆశించిన మేరకు రాలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి పెట్టే పనిలో పడ్డారు. అక్కడ ఓ చిత్రంలో నటించి, మళ్లీ కోలీవుడ్‌కు తిరుగు పయనమయ్యారు.
ప్రస్తుతం జై సరసన పుగళ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అంగీకరించినప్పుడు గ్లామరస్‌గా నటించనని తొలుత కండీషన్ పెట్టిన సురభి, తర్వాత పాటల సన్నివేశాల్లో మాత్రం అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పుగళ్ రాజకీయ నేపథ్యం కథా చిత్రం కావడంతో జైతో పాటుగా తనకు ఈ చిత్రం మంచిపేరు తెచ్చి పెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. అందువల్ల చిన్న చిన్న చిత్రాల అవకాశాలు వచ్చినా తోసి పుచ్చి పెద్ద హీరోల చిత్రాల్లో రెండో హీరోయిన్ అయినా, నటించేందుకు సిద్ధం అని అంటున్నట్టు కోలీవుడ్‌లో టాక్.