Puhalendi
-
సీఎం, మాజీ సీఎంలకు షాక్.. కోర్టుకు రండి
సాక్షి, చెన్నై: పుహలేంది దెబ్బకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామిలకు ఏర్పడింది. ఆ మేరకు మంగళవారం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా బెంగళూరు పుహలేంది ఇది వరకు వ్యవహరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి తొలగించారు. తనను అకారణంగా తొలగించారంటూ కోర్టు తలుపుల్ని పుహలేంది తట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు ఈ పిటిషన్ మంగళవారం చేరింది. వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి స్పందిస్తూ పన్నీరుసెల్వం, పళనిస్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు. విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. అయితే ఈ ఆదేశాలపై స్టే కోరడమే కాకుండా, పిటిషన్ విచారణ యోగ్యం కాదని ప్రకటించాలని కోరుతూ మరో కోర్టులో పిటిషన్ల దాఖలకు అన్నాడీఎంకే సన్నద్ధం అవుతోంది. -
‘భార్య కోసం కేసుల్ని ఎదుర్కొంటున్న భర్త"
సాక్షి, చెన్నై : ‘భార్య కోసం కేసుల్ని ఎదుర్కొంటున్న భర్త ’ ఎన్నికల్లో ప్రచారం చేయకూడదా అని మద్రాసు హైకోర్టు ధర్మసందేహాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకు తగ్గ పిటిషన్ బుధవారం కోర్టులో దాఖలు కావడంతో విచారణకు న్యాయమూర్తులు స్వీకరించారు. పిటిషనర్ తరఫు వాదనల్ని విన్నారు. నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు. 20 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసు హొసూరు ఎమ్మెల్యే, మంత్రి బాలకృష్ణారెడ్డి మెడకు ఉచ్చుగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో అనర్హత వేటుకు గురి కాక తప్పలేదు. మంత్రి, ఎమ్మెల్యే పదవులు దూరం కావడంతో మాజీ అయ్యారు. అలాగే, జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినా, చివరకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. బాలకృష్ణారెడ్డి పిటిషన్‌ను పరిగణించిన సుప్రీంకోర్టు ఆయనకు విధించిన శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో ఈ కేసు తగ్గ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా, ఆ విచారణ ముగిసే వరకు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు ఊరట కల్పించడంతో బాలకృష్ణారెడ్డి మద్దతు దారుల్లో ఆనందం వెల్లి విరిసింది. దీంతో తాను ప్రాతినిథ్యం వహించిన హొసూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన సతీమణి జ్యోతికి మద్దతుగా బాలకృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, తన భార్య జ్యోతిని ఆదరించాలని గెలిపించాలని వీధి వీధినా, ఇంటింటా బాలకృష్ణారెడ్డి చక్కర్లు కొడుతున్నారు. పుహలేంది వ్యతిరేకత : అన్నాడీఎంకే అభ్యర్థిగా జ్యోతి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఆ పార్టీలో చీలికతో పుట్టుకొచ్చిన అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం అభ్యర్థిగా పుహలేంది ప్రధాన ప్రత్యర్థిగా రేసులో ఉన్నారు. బాలకృష్ణారెడ్డి ప్రచారానికి చెక్ పెట్టే విధంగా బుధవారం మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ప్రజా ప్రతినిధుల చట్టం మేరకు శిక్ష పడ్డ వ్యక్తి, ప్రస్తుతం తానే అభ్యర్థి అన్నట్టుగా ప్రచారంలో ఉన్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఇందుకు తగ్గ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్య ప్రసాద్ నేతృత్వంలోని పిటిషన్ పరిశీలించింది. విచారణలో పిటిషనర్ పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలను వీక్షించారు. పిటిషనర్ తరపు వాదనను పరిగణించి, విచారణకు స్వీకరించారు. ఈ సమయంలో కేసుల్ని ఎదుర్కొంటున్న భర్త, ఎన్నికల్లో తన భార్య కోసం ప్రచారం చేయకూడదా..? అన్న ధర్మసందేశాన్ని న్యాయమూర్తులు తెరపైకి తెచ్చారు. ప్రజాప్రతినిధుల చట్టంలో శిక్షపడ్డ వాళ్లు అనర్హులు అని, ఎన్నికల్లో మళ్లీ నిలబడేందుకు అవకాశం లేదని, అయితే, పిటిషనర్ వాదన మేరకు ప్రచారాలు కూడా చేయకూడదా అంటూ వ్యాఖ్యలు చేశారు. చివరకు పిటిషన్ విచారణకు స్వీకరిస్తూ, మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన నిర్ణయాన్ని గురువారం చెబుతామని వాయిదా వేశారు. ఆ రోజున బాలకృష్ణారెడ్డి, ఎన్నికల కమిషన్ వివరణను న్యాయమూర్తులు కోరేనా, లేదా, ప్రచారాలకు వెళ్లకూడదన్నట్టుగా స్టే విధించేనా అన్నది వేచి చూడాల్సిందే. -
అమ్మ మృతిలో మిస్టరీ లేదు
♦ త్వరలో జయ చికిత్స ఫొటోలు విడుదల చేస్తాం ♦ అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది వెల్లడి ♦ అమ్మ మరణంపై అనుమానాలున్నాయి: పన్నీర్ సాక్షి ప్రతినిధి, చెన్నై: జయ మరణంపై నెలకొన్న అనుమానాలను కొంత వరకు నివృత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేస్తానని టీటీవీ దినకరన్ అనుచరుడు, అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది బుధవారం మదురైలో ప్రకటించారు. మరణం వెనుక ఎటువంటి మిస్టరీ లేదని ఆయన అన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత రెండుగా చీలిపోయిన పార్టీ మళ్లీ ఏకం అయ్యేందుకు ఇటీవల ప్రయత్నాలు జరిగాయి. అయితే జయలలిత మరణంపై సీబీఐ లేదా న్యాయవిచారణకు ఆదేశించాలని, శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం ప్రధానంగా రెండు షరతులు విధించింది. అయితే ఈ షరతులను శశికళ వర్గం తోసిపుచ్చడంతో ఇరువర్గాల విలీనానికి విఘాతం ఏర్పడింది. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలు, అమ్మ మరణం తదితర అంశాలను ప్రస్తావిస్తూ నేటి నుంచి పన్నీర్‌సెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభిస్తున్నారు. పన్నీర్ పర్యటనను నీరుగార్చేందుకు శశికళ వర్గం కూడా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దినకరన్ అనుచరుడు, అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది బుధవారం మదురైలో బహిరంగ సభ నిర్వహించారు. దినకరన్‌పై కేంద్ర ప్రభుత్వం బూటకపు కేసులను బనాయించిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దినకరన్‌పై పెట్టిన కేసులను కొట్టివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనుమతి రాగానే ఫొటోలు బహిర్గతం: పుహళేంది ఈ సందర్భంగా పుహళేంది మీడియాతో మాట్లాడుతూ అపోలో ఆస్పత్రిలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగిన చికిత్సను అనుమానిస్తూ అమ్మ మరణం వెనుక మిస్టరీ ఉందని కొందరు నిందలు వేస్తున్నారని అన్నారు. అందుకే జయలలిత చికిత్స పొందతున్నప్పటి ఫొటోలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫొటోల విడుదలపై తగిన అనుమతి రాగానే బహిరంగ పరుస్తామని చెప్పారు. ఈ ఫొటోలు విడుదలైతే కొందరి ముఖాలు వాడిపోతాయని పరోక్షంగా పన్నీర్‌సెల్వంను ఎద్దేవా చేశారు. జయకు చికిత్స సమయంలో పక్కనే ఉన్న పన్నీర్‌సెల్వం ఇప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. స్నేహితురాలిగా, తల్లిగా 33 ఏళ్లపాటు జయలలిత వెన్నటి ఉండి శశికళ ఎంతో త్యాగం చేశారని ఆయన అన్నారు. శశికళ త్యాగాలను మరిస్తే పార్టీలో ఉండలేమని చెప్పారు. జయ మరణంతో తల్లిలేని బిడ్డల్లా మారిన అన్నాడీఎంకేను శశికళ తన చేతుల్లోకి తీసుకుని పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడారని అన్నారు. శశికళ లేకుంటే ఎడపాడి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గేదా అని ఆయన ప్రశ్నించారు. మనిషి జన్మనెత్తిన వారికి కృతజ్ఞత ఉండాలి, అది లేనివారితో దిగులు లేదని పన్నీర్‌సెల్వంపై పరుషపదజాలం ప్రయోగించారు. జయ మరణం మర్మమే: పన్నీర్ సెల్వం ఇదిలా ఉండగా, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తూత్తుకూడిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, జయకు జరుగుతున్న చికిత్సను ముఖ్యమంత్రిగా తాను తరచూ సమీక్షించేవాడినని, ఈ 74 రోజుల్లో ఒక్కసారి కూడా జయను చూసేందుకు అవకాశం లేని పరిస్థితులను సృష్టించారని అయన ఆరోపించారు. వైద్యుల బృందం విడుదల చేసే బులిటెన్లలోని సారాంశాన్ని పార్టీ అధికార ప్రతినిధులు అలాగే వెల్లడి చే సేవారని, తాము సైతం నమ్మామని తెలిపారు. అయితే జయ మరణంలో ఇంకా అనేక సందేహాలు ఉన్నాయని, వీటిని ప్రజల్లో నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జయ ఫొటోల విడుదల వల్ల మరణంపై సీబీఐ విచారణ జరపాలన్న తమ డిమాండ్‌లో మార్పు ఉండదు, ఎలాంటి బెంగలేదని ఆయన స్పష్టం చేశారు.