మహిళా సర్వోదయంస్త్రీ శక్తి
సాధారణంగా స్వయం సహాయ సంఘాల మహిళలంటే తాము పొదుపు చేసుకున్న మొత్తానికి తోడు, బ్యాంకు లింకేజీ కింద వచ్చే రుణాలతో కిరాణాషాపులు.. పాడి పశువుల పెంపకం వంటి పనులకు పరిమితమవుతుంటారు. అయితే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గంగ్లూర్ గ్రామానికి చెందిన మహిళలు ఓ అడుగు ముందుకేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామంలోని 126 మంది మహిళలు సంఘటితమై మూడు కుటీర పరిశ్రమలను స్థాపించారు. సర్వోదయ ఉమెన్ ఎంటర్పైజెస్ పేరుతో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలోనే స్వయం సహాయక బృంగాల మహిళలు కాస్తా మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు.
‘సర్వోదయ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన 15 రకాల సబ్బులు తయారు చేస్తున్నారు. 20కిపైగా రసాయనాలతో తయారయ్యే సాధారణ సబ్బులకు భిన్నంగా ఇవన్నీ బొప్పాయి, టమాట వంటి సహజ వనరులతో తయారు చేసినవే కావడం గమనార్హం. ఈ పరిశ్రమల్లో కోల్డ్‌ప్రెస్ వంటనూనెలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనె, కొబ్బరినూనెలను తయారు చేస్తున్నారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారు. స్థానికంగా పండే పప్పుదినుసుల ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తున్నారు.
జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలు..
బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యత విషయంలో రాజీ పడటం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్) వంటి జాతీయ సంస్థల లైసెన్సులు తీసుకున్నారు. హ్యాండ్‌మేడ్ సబ్బులు వంటి కాస్మోటిక్స్ ఉత్పత్తుల కోసం ఆయుష్ విభాగం నుంచి అనుమతి పొందారు.
త్వరలో మార్కెట్లోకి ఉత్పత్తులు..
సర్వోదయ ఉత్పత్తులు మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2022 జనవరిలోనే ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రారంభించాలని భావించినప్పటికీ కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం కారణంగా మరో పక్షం రోజులు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల కోసం వినియోగదారుల అభిరుచుల సేకరణ ప్రక్రియను కూడా చేపట్టారు. వారి అభిరుచుల మేరకు తమ ఉత్పత్తుల్లో మార్పు చేర్పులు కూడా చేసినట్లు మహిళలు చెబుతున్నారు.
బాధ్యతగా పనిచేస్తున్నాం...
‘సర్వోదయ’లో పనిచేసే మేము అందరం ఈ పరిశ్రమలకు ఓనర్లమే. అందరికీ యాజమాన్య వాటా ఉంది. వచ్చే లాభాల్లో డివిడెండ్ వస్తుంది. అందువల్ల బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మేమందరం పప్పుల ప్రాసెసింగ్, నూనెలు తయారు చేయడం నేర్చుకుంటున్నాము. గ్రామంలోనే మా సొంత పరిశ్రమ లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.
– అంకమ్మగారి చిట్టెమ్మ, ‘సర్వోదయ’ సభ్యురాలు
సొంతూరులోనే పని దొరుకుతోంది...
ఇప్పటివరకు ఇంటిపనికే పరిమితమైన మాకు ఈ పరిశ్రమ వల్ల సొంత ఊరిలోనే పని దొరుకుతోంది. ఈ పరిశ్రమలో మా కుటుంబం పెట్టుబడి ఉండటంతో అందులో పనిచేస్తున్న నేను కార్మికురాలిగా కాకుండా యజమానురాలిగా భావిస్తున్నాను. ప్రస్తుతం నేను సబ్బుల తయారీలో పనిచేస్తున్నాను.
– జంగం శిరీష, ‘సర్వోదయ’ సభ్యురాలు
గ్రామీణాభివృద్ధి సేవలందిస్తున్నాం...
సర్వోదయ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యా, వైద్యం, ఉపాధి, పర్యావరణం వంటి విషయాల్లో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నాము. ఐఆర్ఎస్ అధికారులం కలిసి ఇప్పటి వరకు జిల్లాలో ఆరు గ్రామాల్లో కార్యకలాపాలను ప్రారంభించాం. కరస్‌గుత్తి, ఎద్దుమైలారం, మునిపల్లి, మైనంపల్లి, హన్మంతరావుపేట్‌లలో కూడా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాము.. అనే నినాదం తో ముందుకెళుతున్నాం.
– డాక్టర్ సుధాకర్ నాయక్, సర్వోదయ సంస్థ
ఐఆర్ఎస్ అధికారుల సహకారం..
ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్కే పాలివాల్ అనే ఉన్నతాధికారి ఈ గంగ్లూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ఐఆర్ఎస్ ఉన్నతాధికారులు సర్వోదయ సంస్థను స్థాపించి ఈ గ్రామంలోని మహిళలను సంఘటితం చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా మహిళలకు పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నత స్థాయి శిక్షణ ఇప్పించారు. ఈ సంస్థ సహకారంతో మహిళలు ముందడుగు వేస్తున్నారు.
– పాత బాలప్రసాద్, సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
ఫొటోలు: బగిలి శివప్రసాద్
సర్వోదయ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ మహిళలు గొంగ్లూర్‌లో ఏర్పాటు చేసుకున్న పరిశ్రమ యూనిట్లు.
హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తితో సమావేశమైన గొంగ్లూర్ మహిళలు