నాలుగేళ్లలో రెట్టింపు హోటళ్లు
2020 నాటికి దేశంలో 80 హోటళ్లు
♦ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3,900.. దేశంలో 39
♦ డిమాండ్ పెరుగుతోంది కనకే ఇండియాపై ఫోకస్
♦ హైదరాబాద్ అన్నింటా బెస్ట్; అందుకే విస్తరణ
♦ విజయవాడ నొవోటెల్ రెండేళ్లలో అందుబాటులోకి
♦ ఆర్థిక సంక్షోభం, ముంబై దాడులతో డిమాండ్ తగ్గింది
♦ గతేడాది నుంచి పరిస్థితులు చక్కబడుతున్నాయి
ఎకార్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీన్ మిషెల్
హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో : ఎకార్ హోటల్స్. ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్రాండ్లతో 3,900కుపైగా హోటళ్లను నిర్వహిస్తున్న అతిపెద్ద సంస్థ. ఇండియాలో ఏడు బ్రాండ్లతో ప్రస్తుతం 39 హోటళ్లను నిర్వహిస్తూ... రాబోయే కొద్ది సంవత్సరాలకు పెద్ద లక్ష్యాన్నే పెట్టుకుంది. వచ్చే నాలుగేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపుకన్నా ఎక్కువ చేయాలని లక్ష్యించటమే కాక... ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. సంస్థ తాజాగా హైదరాబాద్‌లో నిర్మించిన ‘కెసిపి మెర్క్యూర్’ లాంఛనంగా ఆరంభం కాబోతోంది.
ఈ ఆరంభ కార్యక్రమం కోసం సంస్థ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీన్ మిషెల్ కాసె శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఫ్రాన్స్‌కు చెందిన జీన్... ఫ్రాన్స్ ట్రేడ్ డివిజన్‌కు అక్కడ ప్రత్యేక సలహాదారుగా ఉండటంతో పాటు ఇండియాలో ఆ విభాగానికి జనరల్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి బిజినె స్ బ్యూరో’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియాలో... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి ప్రణాళికలను వివరించటంతో పాటు, పెరుగుతున్న బడ్జెట్ హోటళ్ల మార్కెట్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
♦ ప్రపంచ వ్యాప్తంగా మీకు చాలా బ్రాండ్లున్నాయి కదా! ఇండియాలో..?
ఇక్కడ 7 బ్రాండ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. అప్స్కేల్ బ్రాండ్లయిన సోఫిటెల్, పుల్మాన్, గ్రాండ్ మెర్క్యూర్తో పాటు మిడ్‌స్కేల్ బ్రాండ్లు నొవోటెల్, మెర్క్యూర్.. బడ్జెట్ బ్రాండ్లు ఫార్ములా-1, ఐబిస్ హోటళ్లు ఉన్నాయి.
♦ ప్రపంచ వ్యాప్తంగా మీకు చాలా బ్రాండ్లున్నాయి కదా! ఇండియాలో..?ఎందుకిన్ని బ్రాండ్లు? వీటిలో ఏమైనా తేడాలుంటాయా?
ఉన్నాయి. దిగువనుంచి ఎగువకు వెళితే ఎఫ్1 అనేది బడ్జెట్ బ్రాండ్. ఐబిస్ దానికన్నా కాస్త బడ్జెట్ ఎక్కువ. ఇక మెర్క్యూర్, నొవోటెల్, గ్రాండ్ మెర్క్యూర్, సోఫిటెల్, పుల్మాన్ అనేవి ఎగువకు వెళతాయి. అందించే సౌకర్యాలను బట్టే ఈ బ్రాండ్లు పనిచేస్తుంటాయి.
♦ ఇండియా విషయానికొస్తే నొవోటెల్ ఒక్కటే బాగా పాపులర్ అయినట్టుంది?
అలాగని కాదు. ఇండియాలో మా హోటళ్లు మిడ్‌స్కేల్ విభాగంలోనే ఎక్కువున్నాయి. దేశంలో 13 నొవోటెల్ హోటళ్లను నిర్వహిస్తున్నాం. పుల్మాన్, సోఫిటెల్ హోటళ్లు తలా ఒకటి ఉన్నాయి. గ్రాండ్ మెర్క్యూర్ హోటళ్లు రెండుండగా... మిగతావి ఐబిస్, ఎఫ్-1 విభాగాలకు చెందినవి.
♦ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని హోటళ్లున్నాయి? మొత్తం ఇండియా కార్యకలాపాల ఆదాయంలో వీటి వాటా ఎంత?
తెలంగాణలో... అంటే హైదరాబాద్‌లో నొవోటెల్ బ్రాండ్‌తో రెండు, ఐబిస్, ఎఫ్-1, మెర్క్యూర్ బ్రాండ్లతో తలా ఒకటి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో నొవోటెల్ ఉంది. బీమిలి బీచ్ దగ్గర మరో నొవోటెల్ త్వరలో ఆరంభమవుతుంది. ఇండియా ఆదాయంలో 20% ఈ రాష్ట్రాల వాటా ఉందని చెప్పగలను.
♦ ఇంకా విస్తరణ ప్రణాళికలేమైనా ఉన్నాయా?
విశాఖ నొవోటెల్ ప్రాపర్టీ యజమాని వరుణ్ గ్రూప్ విజయవాడలో కూడా మరో హోటల్ నిర్మిస్తోంది. నొవోటెల్ బ్రాండ్‌తో ఇది కూడా అందుబాటులోకి వస్తుంది. అయితే దీనికి మరో రెండేళ్లు పడుతుంది.
♦ మరి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల సంగతో?
ప్రస్తుతం దేశంలోని మెట్రోలన్నిటా మా హోటళ్లున్నాయి. టైర్-2, 3 నగరాలపైనా దృష్టిపెట్టాం. గువాహటి, షిల్లాంగ్‌లలో నొవోటెల్ హోటళ్లు ఏర్పాటు చేస్తున్నాం. డిమాండ్‌ను బట్టి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ హోటళ్లు ఏర్పాటు చేసే అవకాశముంది.
♦ మీవి కేవలం నిర్వహణ సేవలేనా... లేక లీజుకు తీసుకున్న హోటళ్లు కూడా ఉన్నాయా?
మేం ప్రాపర్టీ మేనేజ్మెంట్ సేవలు మాత్రమే అందిస్తాం. రాబడిని పంచుకునే పద్ధతిపై హోటళ్లను తీసుకుంటాం.
♦ ఇండియాలో మీ హోటళ్లు ఎక్కువే కానీ... ప్రపంచవ్యాప్తంగా చూస్తే తక్కువ. ఎందుకని?
అంతర్జాతీయంగా మాకున్న హోటళ్లతో పోలిస్తే ఇండియాలో ఉన్నవి ఒక శాతమే. కానీ ఇక్కడ ఎదుగుదలకు అవకాశాలెక్కువ. అందుకే దీనిపై ఫోకస్ పెట్టాం. 2006లో మేం నొవోటెల్ బ్రాండ్‌ను హైదరాబాద్ ద్వారా ఇండియాకు పరిచయం చేసి గురువారానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటిదాకా ఇక్కడ 39 హోటళ్లకు చేరాం. కానీ వచ్చే నాలుగేళ్లలో అంటే... 2020 నాటికి ఈ సంఖ్యను 80కి చేరుస్తున్నాం. చాలా హోటళ్లు నిర్మాణంలో ఉన్నాయి. పలు ఒప్పందాలు జరగబోతున్నాయి.
♦ ఇప్పటిదాకా సాధ్యపడని వేగం వచ్చే నాలుగేళ్లలో కుదురుతుందా?
నిజమే! కాకపోతే ఒక్కటి గుర్తుంచుకోవాలి. 2008 త రవాత ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్థిక వ్యవస్థలూ దెబ్బతిన్నాయి. జనం కొనుగోలు శక్తి తగ్గటంతో డిమాండ్ కూడా తగ్గింది. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై దాడులు దీనికి ఆజ్యం పోశాయి. దీంతో ఇండియాలో హోటళ్లకు డిమాండ్ తగ్గింది. బోలెడన్ని హోటళ్లొచ్చాయి కానీ డిమాండ్ తగ్గి గదులు పేరుకుపోయాయి. కాకపోతే గతేడాది నుంచీ పరిస్థితులు సర్దుకున్నాయి. డిమాండ్ పెరుగుతోంది. అందుకే మా ప్రణాళికలతో ముందుకెళ్లగలుగుతున్నాం.
♦ ఇండియాలో మీరు లాభాల్లోనే ఉన్నారా?
మొత్తమ్మీద లాభాల్లోనే ఉన్నామని చెప్పాలి. ఇక బ్రాండ్ల వారీ చెప్పాలంటే కష్టం. ఎందుకంటే ఏ హోటల్‌ను ఆరంభించినా పరిస్థితులు సర్దుకోవటానికి కనీసం మూడేళ్లు పడుతుంది. ఆ తరవాతే దానిపై ఒక నిర్ణయానికి రాగలం.
♦ హైదరాబాద్‌లో నాలుగు బ్రాండ్లున్నాయి. ఇక్కడ బాగా ఫోకస్ పెట్టినట్టున్నారు!!
నిజమే! ప్రతి నగరంలో ఓ హోటల్ నిర్మించి... అక్కడ కూడా ఉన్నామని చెప్పుకోవటం మాకిష్టం లేదు. హైదరాబాద్‌లో అన్ని వర్గాల వారూ ఉన్నారు. అందుకే అన్ని బ్రాండ్లనూ ఇక్కడ పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం నాలుగు హోటళ్లలో కలసి 869 రూమ్లున్నాయి. ఇక్కడ ఇన్ని రూమ్‌లున్న అతిపెద్ద హోటల్ గ్రూప్ మాదే. ఈ ఏడాది చివరికి ఐబిస్ కూడా ఆరంభమై... ఈ సంఖ్య వెయ్యికి చేరుతుంది.
♦ శంషాబాద్‌లోని నొవోటెల్ హోటల్ని జీఎంఆర్ సంస్థ రెండుసార్లు అమ్మకానికి పెట్టినా ఎవరూ కొనటానికి రాలేదు. ఎందుకని? అది లాభదాయకం కాదా?
అది వాళ్ల సొంత వ్యవహారం. ఎందుకు అమ్మకానికి పెట్టారన్నది మాకు తెలియదు. మా వరకూ చెప్పాలంటే బిజినెస్ చాలా బాగుంది. ఆక్యుపెన్సీ బాగుంది. లాభాలొస్తున్నాయి. ఇక వాళ్లు అమ్మకానికి పెట్టడం, ఎవరూ కొనకపోవటం అది వాళ్ల వ్యక్తిగత వ్యవహారం. మేమైతే ఎవరి చేతుల్లో ఉన్నా నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తాం. హెఐసీసీ నొవోటెల్నే తీసుకోండి. ఎమ్మార్‌తో కాంట్రాక్టు ముగిసింది. కొత్త సంస్థతో పదేళ్ల కాంట్రాక్టు చేసుకున్నాం. అందులో భాగంగా హోటల్‌ను నవీకరిస్తున్నాం కూడా.