పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ నెల 29న ప్రారంభమయ్యే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లోని తహసీల్లార్లు, మెడికల్ ఆఫీసర్లు, స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
గ్రామ స్థాయిలో దండోరాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ నెల 28వ తేదీన అన్ని పాఠశాలల విద్యార్థులతో పల్స్‌పోలియో ర్యాలీ నిర్వహించాలని డీఈవో రవీంద్రారెడ్డిని ఆదేశించారు. 30వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని ఆదేశించారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు టెలిఫోన్లో డయల్ టోన్ మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్, డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి, మైనార్టీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.