నాటు బాంబు తిని ఏనుగు మృతి
ఎర్రావారిపాళెం: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలం పులుబోనువారిపల్లెలో సోమవారం నాటు బాంబు తిని ఏనుగు మృతి చెందింది. మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. రాత్రి సమయాల్లో అటవీ సరిహద్దు గ్రామాల్లోని పంట పొలాలపై దాడులు చేస్తూ పగటిపూట శేషాచలం అడవుల్లో సేదదీరుతున్నాయి.
ఆదివారం రాత్రి మండలంలోని నెరబైలు పంచాయతీ పులుబోనువారిపల్లెకు సమీపంలోని ఓ మామిడితోటలోకి ఆరు సంవత్సరాల ఆడ ఏనుగు వచ్చింది. అక్కడున్న ఓ నాటుబాంబును ఆహారం అని భావించి తినడంతో నోటిబాగం పేలి మామిడి తోటలో మృతి చెందింది.
సోమవారం గుర్తించిన రైతులు అటవీశాఖాధికారులకు తెలిపారు. అటవీ అధికారులు వచ్చి ఏనుగు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకున్నారు. నాటుబాంబు అక్కడకు ఎలావచ్చిందనే విషయాన్ని ఆరాతీస్తున్నారు.