Pump House works
-
అధికారుల వైఖరిపై స్మితాసబర్వాల్ అసంతృప్తి
సాక్షి, రామగుండం: గోలివాడ పంపుహౌస్ పనుల్లో పురో‘గతి’ లోపించడంతో పక్షం రోజుల్లోనే సీఎం పేషీ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ గురువారం రెండోసారి పర్యటించారు. ఈనెల 2న సీఎం కేసీఆర్ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, గోలివాడ పంపుహౌస్ పనులను సందర్శించారు. ఆ సమయంలో వివిధ ప్రాజెక్టుల్లో అధికారులు పనుల పురోగతిపై ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రబీకి సాగు నీరందించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ మారిన రాజకీయ సమీకరణాలు, అకాల వర్షాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో వర్షాకాలానికి సాగు నీరందించాలనే లక్ష్యంతో సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 31లోపు నూరు శాతం పూర్తి కష్టమే... సీఎం కేసీఆర్ పర్యటన సమయంలో గోలివాడ పంపుహౌస్‌ను సందర్శించిన సమయంలో వారం రోజుల్లో తొలిసారి ఒక మోటార్ డ్రైరన్ చేస్తామని, ప్రతీ పది రోజులకు ఒకసారి ఒక్కో మోటారు డ్రైరన్ చేసి మార్చి 31వ తేదీలోగా నూరుశాతం పంపుహౌస్‌ను వినియోగంలోకి తీసుకువస్తామని అధికారులు సీఎంకు విన్నవించినప్పటికీ పనుల పురోగతిని పరిశీలిస్తే కష్టమేనని తెలుస్తోంది. తాను పర్యటించి పక్షం రోజులైన గోలివాడ పంపుహౌస్‌లో ఒక్క మోటార్ కూడా డ్రైరన్ చేయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్ గోలివాడ పంపుహౌస్‌ను సందర్శించారు. తొమ్మిది మోటార్లలో ఒక మోటారును బిగించగా, మరో మూడు మోటార్లకు సిమెంట్ ప్లాట్‌ఫామ్స్ సిద్ధం చేయగా, మరో మూడింటికి ఇప్పుడే ఎరక్షన్ పనులు కొనసాగుతుండగా, మిగతా రెండు మోటార్ల పనులు ఇంకా ప్రారంభించలేదు. దీనికి తోడు అదనంగా మరో నాలుగు మోటార్లను స్టాండ్‌బైగా బిగింపుకు గోలివాడ పంపుహౌస్‌లో డిజైన్ చేశారు. ఎర్త్ పనులు నూరు శాతం పూర్తికాగా కాంక్రీట్ పనులు 43 వేల క్యూబిక్ మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. పంపుహౌస్పరిధిలోని 18 లైన్ల పైపులైన్ పనులలో 487 పైపులను 17,964 ఆర్ఎంటీతో వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 15,044 పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ఇరవై నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జనవరి 28న డ్రైరన్‌కు కసరత్తు...? గోలివాడ పంపుహౌస్‌లో తొమ్మిది మోటార్లలో ఈనెల 28వ తేదీన తొలి మోటార్ డ్రై రన్ చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరొకటి ఫిబ్రవరి 25న, ఏప్రిల్ 10 నాటికి మిగతా ఏడు మోటార్లను వినియోగంలోకి తీసుకురానున్నట్లు పేర్కొంటున్నారు. మోటార్ల డ్రైరన్ గడువు పెరుగుతుండడం పట్ల సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టడం లేదని, పనుల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతోనే పనులలో పురోగతి మందగిస్తుందని, ఇకనుంచి పనులు వేగవంతం చేస్తేనే ఏప్రిల్ పది నాటికి పూర్తయి వర్షాకాలం నాటికి సాగునీరందించే అవకాశం అందని సూచించారు. -
గొంతు తడిచేదెప్పుడు..?
► గడువు ముగిసి నాలుగేళ్లయినా పూర్తికాని ఏజెన్సీ తాగునీటి పథకం ► కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం.. ► ఏటా కొనసాగుతున్న 226 గ్రామాల వాసులకు క‘న్నీటి’ కష్టాలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదివాసీ గొంతులు తడిపేందుకు చేపట్టిన తాగునీటి పథకం అది.. రూ.78 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం పనులు ఏళ్లు గడుస్తున్నా ఓ కొలిక్కి రావడం లేదు. సుమారు ఆరేళ్లుగా ఈ పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారవడం విమర్శలకు దారితీస్తోంది. కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం.. ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా విభాగం) అధికారుల అలసత్వం వెరసి నిర్దేశిత గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావడం లేదు. వీటి రూ.కోట్లలో నిధులు మాత్రం నీళ్లలా ఖర్చవుతున్నప్పటికీ, ఆదివాసీల గొంతులు ఈ ఏడాది కూడా తడవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు, మూడేళ్లయినా వీరి తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఏజెన్సీ గొంతు తడిపేందుకు.. ఏజెన్సీ ప్రాంతమైన నార్నూర్, సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, ఉట్నూర్, ఇంద్రవెల్లి తదితర మండలాల పరిధిలోని 226 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కొమురం భీమ్ తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. 2012 మార్చిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ఏడాది వేసవిలో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. అడ ప్రాజెక్టు నుంచి భారీ పైప్లైన్లను నిర్మిస్తున్నారు. ఆరు చోట్ల పంప్‌హౌజ్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాదైనా కన్నీటి కష్టాలు తీరుతాయని.. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే ఇక్కట్లు తొలగిపోతాయని అడవిబిడ్డలు భావించారు. కానీ.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీ ఆది నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అటవీ అనుమతుల పేరుతో ప్రారంభంలో పనులు పూర్తి చేయకపోగా, తాజాగా రోడ్డు పనుల పేరుతో మరింత జాప్యం చేస్తోందనే ఆరోపణలున్నాయి. గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ కనీసం తుది దశకు కూడా చేరడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నత్తనడకన పనులు.. అడ ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. పలుచోట్ల ఈ పైపులు లీకేజీ అవుతున్నాయి. ముఖ్యంగా జోడేఘాట్, కెరమెరి మండల పరిధిలో కూడా లీకేజీలు వెలుగుచూడటంతో ఈ పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా తయారైంది. ఇక పంప్‌హౌజ్‌ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. కెరమెరి మండలం ధనోరా, కేస్లాగూడ వద్ద చేపట్టిన పంప్‌హౌజ్ పనులు పూర్తి కావస్తున్నాయి. అలాగే నార్నూర్ మండలం జామడ, జైనూర్ మండలం భూసిమెట్ట వద్ద కూడా పంప్‌హౌజ్ పనులు కొలిక్కి వచ్చాయి. కానీ.. పలు గ్రామాలకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీ పైప్లైన్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సిర్పూర్ (యు) మండలంలోని పంప్‌హౌజ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వేగవంతం చేయిస్తున్నాం.. ఏజెన్సీకి తాగునీరందించే తాగునీటి పథకం పనులు వేగవంతం చేయించేందుకు చర్యలు చేపట్టాము. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో నిబంధనల ప్రకారం కాంట్రాక్టు కంపెనీపై చర్యలు తీసుకుంటాం. - మల్లేష్‌గౌడ్, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఈ