గొంతు తడిచేదెప్పుడు..?
► గడువు ముగిసి నాలుగేళ్లయినా పూర్తికాని ఏజెన్సీ తాగునీటి పథకం
► కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం..
► ఏటా కొనసాగుతున్న 226 గ్రామాల వాసులకు క‘న్నీటి’ కష్టాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదివాసీ గొంతులు తడిపేందుకు చేపట్టిన తాగునీటి పథకం అది.. రూ.78 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం పనులు ఏళ్లు గడుస్తున్నా ఓ కొలిక్కి రావడం లేదు. సుమారు ఆరేళ్లుగా ఈ పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారవడం విమర్శలకు దారితీస్తోంది. కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం.. ఆర్‌డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా విభాగం) అధికారుల అలసత్వం వెరసి నిర్దేశిత గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావడం లేదు. వీటి రూ.కోట్లలో నిధులు మాత్రం నీళ్లలా ఖర్చవుతున్నప్పటికీ, ఆదివాసీల గొంతులు ఈ ఏడాది కూడా తడవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు, మూడేళ్లయినా వీరి తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.
ఏజెన్సీ గొంతు తడిపేందుకు..
ఏజెన్సీ ప్రాంతమైన నార్నూర్, సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, ఉట్నూర్, ఇంద్రవెల్లి తదితర మండలాల పరిధిలోని 226 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కొమురం భీమ్ తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. 2012 మార్చిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ఏడాది వేసవిలో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. అడ ప్రాజెక్టు నుంచి భారీ పైప్‌లైన్‌లను నిర్మిస్తున్నారు. ఆరు చోట్ల పంప్‌హౌజ్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాదైనా కన్నీటి కష్టాలు తీరుతాయని.. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే ఇక్కట్లు తొలగిపోతాయని అడవిబిడ్డలు భావించారు.
కానీ.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీ ఆది నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అటవీ అనుమతుల పేరుతో ప్రారంభంలో పనులు పూర్తి చేయకపోగా, తాజాగా రోడ్డు పనుల పేరుతో మరింత జాప్యం చేస్తోందనే ఆరోపణలున్నాయి. గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ కనీసం తుది దశకు కూడా చేరడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
నత్తనడకన పనులు..
అడ ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. పలుచోట్ల ఈ పైపులు లీకేజీ అవుతున్నాయి. ముఖ్యంగా జోడేఘాట్, కెరమెరి మండల పరిధిలో కూడా లీకేజీలు వెలుగుచూడటంతో ఈ పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా తయారైంది. ఇక పంప్‌హౌజ్‌ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. కెరమెరి మండలం ధనోరా, కేస్లాగూడ వద్ద చేపట్టిన పంప్‌హౌజ్ పనులు పూర్తి కావస్తున్నాయి. అలాగే నార్నూర్ మండలం జామడ, జైనూర్ మండలం భూసిమెట్ట వద్ద కూడా పంప్‌హౌజ్ పనులు కొలిక్కి వచ్చాయి. కానీ.. పలు గ్రామాలకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీ పైప్‌లైన్‌ల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సిర్పూర్ (యు) మండలంలోని పంప్‌హౌజ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
వేగవంతం చేయిస్తున్నాం..
ఏజెన్సీకి తాగునీరందించే తాగునీటి పథకం పనులు వేగవంతం చేయించేందుకు చర్యలు చేపట్టాము. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో నిబంధనల ప్రకారం కాంట్రాక్టు కంపెనీపై చర్యలు తీసుకుంటాం. - మల్లేష్‌గౌడ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్‌ఈ