సీసీటీవీ దృశ్యాల్లో పెద్ద ‘నోట్ల’ మూటలు!?
పుణె బ్యాంకులో భారీ బాగోతం
రూ. 10.80 కోట్లు పట్టివేత.. 8.8 కోట్లు కొత్త కరెన్సీ
పుణె: పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో గుట్టుగా సాగుతున్న అనేక అక్రమాలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పుణెలోని ఒక బ్యాంకు శాఖలోనూ భారీ బాగోతం వెలుగుచూసింది. ఈ ఏడాది ఆగస్టులో ఒకే పేరుతో 15 లాకర్లు తెరిచినట్టు ఐటీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నవంబర్, డిసెంబర్ నెలలలో ఇందులో రెండు లాకర్లను 12 సార్లు చొప్పున వాడినట్టు బ్యాంకు రికార్డులనుబట్టి వెల్లడైంది. ఈ 15 లాకర్లలో 9.85 కోట్లు దొరికాయి. మరో 94. 50 లక్షలు మిగతా వాటిలో దొరికాయి.
ఇక బ్యాంకు సీసీటీవీ దృశ్యాలలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఒక వ్యక్తి పెద్ద మూటలతో లోపలికి బయటకు వెళ్లినట్టు సీసీటీవీ దృశ్యాల్లో వెల్లడైంది. ఇది పలుసార్లు పునరావృతమైంది. ఈ మూటలతో మోసుకెళ్లిన వ్యక్తి వెంట కొందరు వ్యక్తులు అన్ని సందర్బాల్లోనూ కనిపించారు. ఇవి నోట్ల మూటలు అయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు లాకర్లలోని రూ. 10.80 కోట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 8.8 కోట్లు కొత్త కరెన్సీయేనని ఐటీ వర్గాలు తెలిపాయి.