pune mahanagar parivahan mahamandal limited
-
ఒలెక్ట్రాకు మరో 150 బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా తాజాగా 150 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరాకై కాంట్రాక్టు పొందింది. దీని విలువ సుమారు రూ.300 కోట్లు. 12 నెలల్లో ఈ బస్‌లను సరఫరా చేస్తారు. ఫేమ్–2 కింద 150 ఎలక్ట్రిక్ బస్లకై పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఎంఈఐఎల్కు చెందిన మరో అనుబంధ కంపెనీ ఈవీ ట్రాన్స్ లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. ఈవీ ట్రాన్స్ ఈ బస్‌లను ఒలెక్ట్రా నుంచి కొనుగోలు చేసి.. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్‌కు అద్దె ప్రాతిపదికన సరఫరా చేస్తుంది. మొత్తం 900 బస్‌లు.. తాజా ఆర్డర్‌తో కలిపి దేశవ్యాప్తంగా వివిధ రోడ్డు రవాణా సంస్థలకు ఒలెక్ట్రా సరఫరా చేయనున్న ఎలక్ట్రిక్ బస్‌ల సంఖ్య 900లకుపైగా చేరుకుంది. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్‌కు 12 మీటర్ల పొడవున్న బస్‌లను సరఫరా చేస్తారు. బస్‌లో 33 సీట్లు, ఒక వీల్ చైర్ ఏర్పాటు ఉంది. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే ట్రాఫిక్నుబట్టి 200 కిలోమీటర్ల వరకు బస్ ప్రయాణిస్తుంది. కాంట్రాక్టు కాల పరిమితి 10–12 ఏళ్లు. ఈ కాలంలో బస్‌ల నిర్వహణ బాధ్యత సైతం ఈవీ ట్రాన్స్ చేపడుతుంది. ఇప్పటికే పుణే నగరంలో ఈవీ ట్రాన్స్ 150 ఎలక్ట్రిక్ బస్‌లను నిర్వహిస్తోందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఈవో, సీఎఫ్‌వో శరత్ చంద్ర బుధవారం తెలిపారు. కొత్త కాంట్రాక్టుతో ఈ సంఖ్య 300లకు చేరుకుందని, దేశంలో ఇదే అత్యధికమని అన్నారు. -
వచ్చే నెలాఖరు నుంచి అదనపు బస్సు సేవలు
పింప్రి, న్యూస్‌లైన్: పుణే మహానగర్ పరీవాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎంఎల్) జనవరి ఆఖరు నాటికి నగరంలో అదనంగా మరికొన్ని బస్సులను నడపనుంది. బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా 300 కొత్త బస్సులను నడపాలని యోచిస్తోంది. కొత్త బస్సుల రాక ఆలస్యమయ్యే సూచనలు ఉండడంతో ప్రైవేటు బస్సులను బాడుగకు తీసుకొని నడపాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. పీఎంపీఎంఎల్ బస్సులు తరచూ మరమ్మతులకు గురికావడం, సాంకేతికపరమైన సమస్యలు తలెత్తి ఆగిపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అందువల్ల బాడుగకు తీసుకున్న బస్సులను డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నడుపుతామని పీఎంపీఎంఎల్ సంచాలకుడు డాక్టర్ ప్రవీణ్ అష్టికర్ పేర్కొన్నారు. ఇదిలాఉంచితే బీఆర్టీ (బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థ) మార్గాలలో నడిపే బస్సులకు ఇరువైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు.15 ఏళ్లు పైబడిన పాత బస్సులను తుక్కు సామగ్రి కింద అమ్మివేయనున్నారు. తెలిపారు. కాగా పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ), పుణే మహానగర్ పరీవాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎంఎల్)లు సంయుక్తంగా ఇటీవల మండాయి బస్సు సేవలను ప్రారంభించాయి. అయితే మండాయి నుంచి కనీస చార్జి కింద కేవలం ఐదు రూపాయలు వసూలు చేయాలని నగర బస్సు ప్రయాణికుల సంఘం విజ్ఞప్తి చేసింది. మండాయి నుంచి పది మార్గాల్లో బస్సులు నడపాలని, మండాయి పరిసరాలలోని ఆక్రమణలను తొలగించి బస్టాపులను ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ వినపతిపత్రం సమర్పించింది. మండాయి నుంచి పది మార్గాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సును నడపాలని కోరింది.