
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా తాజాగా 150 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరాకై కాంట్రాక్టు పొందింది. దీని విలువ సుమారు రూ.300 కోట్లు. 12 నెలల్లో ఈ బస్‌లను సరఫరా చేస్తారు. ఫేమ్–2 కింద 150 ఎలక్ట్రిక్ బస్‌లకై పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఎంఈఐఎల్‌కు చెందిన మరో అనుబంధ కంపెనీ ఈవీ ట్రాన్స్ లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. ఈవీ ట్రాన్స్ ఈ బస్‌లను ఒలెక్ట్రా నుంచి కొనుగోలు చేసి.. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్‌కు అద్దె ప్రాతిపదికన సరఫరా చేస్తుంది.
మొత్తం 900 బస్‌లు..
తాజా ఆర్డర్‌తో కలిపి దేశవ్యాప్తంగా వివిధ రోడ్డు రవాణా సంస్థలకు ఒలెక్ట్రా సరఫరా చేయనున్న ఎలక్ట్రిక్ బస్‌ల సంఖ్య 900లకుపైగా చేరుకుంది. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్‌కు 12 మీటర్ల పొడవున్న బస్‌లను సరఫరా చేస్తారు. బస్‌లో 33 సీట్లు, ఒక వీల్ చైర్ ఏర్పాటు ఉంది. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే ట్రాఫిక్‌నుబట్టి 200 కిలోమీటర్ల వరకు బస్ ప్రయాణిస్తుంది. కాంట్రాక్టు కాల పరిమితి 10–12 ఏళ్లు. ఈ కాలంలో బస్‌ల నిర్వహణ బాధ్యత సైతం ఈవీ ట్రాన్స్ చేపడుతుంది. ఇప్పటికే పుణే నగరంలో ఈవీ ట్రాన్స్ 150 ఎలక్ట్రిక్ బస్‌లను నిర్వహిస్తోందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఈవో, సీఎఫ్‌వో శరత్ చంద్ర బుధవారం తెలిపారు. కొత్త కాంట్రాక్టుతో ఈ సంఖ్య 300లకు చేరుకుందని, దేశంలో ఇదే అత్యధికమని అన్నారు.