దైవ దర్శనానికి వెళ్లి వస్తూ...
రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి
తొమ్మిది మందికి గాయాలు
సాక్షి, ముంబై: పుణే-నాసిక్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షిర్డీ సాయిని దర్శనం చేసుకుని కొంత మంది బోలేరో వాహనంలో తిరిగి ఇంటికి వెళుతుండగా ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. మృతులను నాసిక్ జిల్లా ఇగత్‌పూర్ తాలాకాకు చెందిన వాజే కుటుంబసభ్యులు పాండరంగ్ వాజే (35), వనితా వాజే (25), రోహినీ వాజే (3)లతోపాటు బైరవ్ పడవల్ (60), కాలు పడవల్ (25), సరిత పడవల్ (5), ఆరే పడవల్ (8)లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన డ్రైవర్ గోరఖ్ వాజేతోపాటు మొత్తం తొమ్మిది మంది స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
పోలీసుల కథనం ప్రకారం...అహ్మద్‌నగర్ జిల్లా ఘార్గావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోర్ఘాట్ శివార్లలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో విఠ్టల్ కామత్ హోటల్ సమీపంలో ప్రమాదం జరిగింది. పుణేవైపు వెళ్తున్న ఓ ట్రక్కు రాంగ్ సైడ్‌లో వచ్చి బోలేరో వాహనాన్ని వేగంగా ఢీకొంది. నిద్రలో ఉన్న వారు ఉలిక్కిపడేలేచినప్పటికీ ఏమిజరిగిందో తెలుసుకునేలోపే తమ బంధువులు రక్తం మడుగులో కన్పించారు. అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. ఘార్గవ్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.