తొలి వన్డేలో నో బౌలింగ్.. ఈ వన్డే సంగతేంటి!
ఫుణే : టీమిండియాలో గత కొంత కాలంనుంచి రాణిస్తున్న ఆటగాడు కేదార్ జాదవ్. బ్యాట్ తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇవ్వగల క్రికెటర్. తొలి వన్డేలో భారత్ ఓటమిపాలుకాగా ఆ మ్యాచ్ లో జాదవ్ చేతికి బంతి అప్పగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శకులకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రెండో వన్డేలో జాదవ్ తొలి ఓవర్లో కేవలం ఒకే పరుగు ఇచ్చి ఆకట్టుకున్నాడు.
ఆ సెషన్లో ఆరు ఓవర్లు వేసిన జాదవ్ కేవలం 16 పరుగులే ఇచ్చి కివీస్ టాప్, మిడిలార్డర్ ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేశాడు. తొలి వన్డేలోనూ జాదవ్ చేతికి బంతిని ఇచ్చి ఉంటే.. పరుగులు కట్టడి చేసేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పరుగులు రాని పక్షంలో కివీస్ బ్యాట్స్ మెన్లు ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకునేవారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వన్డేలో జాదవ్ బౌలింగ్ లో పరుగులు తక్కువ వస్తుండటంతో రన్ రేట్ పెంచే యత్నంలో కివీస్ కీలక ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. తాను వేసిన చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న జాదవ్.. ఓవరాల్ గా 8 ఓవర్లలో 3.87 ఎకానమీతో 31 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో జాదవ్ కంటే అతి తక్కువ ఎకానమీ (3.80)తో బౌలింగ్ చేసిన ఆటగాడు బుమ్రా మాత్రమే. నేరుగా తన బౌలింగ్ లో వికెట్లు తీయకపోయినా తొలి ఆరు ఓవర్లలో పరుగులు ఇవ్వకపోవడంతో ఇతర భారత బౌలర్లకు వికెట్లు తీయడం సులభతరం అయిందని ట్వీట్లు చేస్తున్నారు.