
‘జాదవ్ రెచ్చిపోతాడనుకోలేదు’
పుణె: మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియాను ఓడించాలన్న తమ వ్యూహాలను కేదార్ జాదవ్ చిత్తు చేశాడని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వాపోయాడు. జాదవ్ చెలరేగుతాడని తాము ఊహించలేదని అన్నాడు. ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో జాదవ్ విజృభించి సెంచరీ చేయడంతో కోహ్లి సేన శుభారంభం చేసింది.
‘భారత్ 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో మా కష్టాలు మొదలయ్యాయి. మిడిలార్డర్ లో మేము బ్యాటింగ్ బాగానే చేశాం కానీ బౌలింగ్ లో మాత్రం తడబడ్డాం. జాదవ్ విజృభించి ఆడతాడని మేము ఊహించలేదు. టీమిండియా విజయం ఘనత 65 బంతుల్లో సెంచరీ చేసిన అతడికే దక్కుతుంది. మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బాదాడం మొదలు పెట్టాడు. మాకు అసలు అవకాశం ఇవ్వలేద’ని మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
మ్యాచ్ కు ముందు జాదవ్ ఆటతీరును అధ్యయం చేశామని, అయితే సీరియస్ గా తీసుకోలేదని వెల్లడించాడు. ‘అంతర్జాతీయ మ్యాచుల్లో జాదవ్ ఆడిన మ్యాచ్‌లను చూశాం. అతడిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాం. జాదవ్ ను కట్టడి చేసేందుకు మరింత కసరత్తు చేయాల్సిందని మ్యాచ్ ముగిసిన తర్వాత అనిపించింద’ని మోర్గాన్ చెప్పాడు. కోహ్లిని కట్టికి చేసేందుకు తమ వ్యూహాలు ఫలించలేదని అన్నాడు.