పోలీసు ఇంట్లో భారీగా డ్రగ్స్
చండీగఢ్/జలంధర్: పంజాబ్‌లో మాదకద్రవ్యాల వ్యాపారంలో చీకటి కోణం వెలుగు చూసింది. యువతను నిర్జీవులుగా చేస్తున్న డ్రగ్స్ దందాలో ఖాకీల ప్రమేయం బట్టబయలైంది. ఒక పోలీసు అధికారి ఇంట్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడడం సంచలనం రేపింది. కపుర్తలా క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఇంద్రజిత్‌ను ఫగ్వారా ప్రాంతంలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం(సిట్) సోమవారం అరెస్ట్ చేసింది. ఆయన ఇంటి నుంచి 3 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
జలంధర్‌లో పంజాబ్ పోలీసు నివాస సముదాయంలోని ఇంద్రజిత్ ఉంటున్న ఇంట్లోనూ భారీగా అక్రమ నగదు, ఆయుధాలు వెలుగు చూశాయి. ఏకే -47 తుపాకీ, 9 ఎంఎం ఇటాలియన్ పిస్టల్, పాయింట్ 38 రివాల్వర్, 383 తుపాకీ తూటాలతో పాటు రూ. 16.50 లక్షలు, 3,550 బ్రిటీషు ఫౌండ్లను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. అమృతసర్‌లోని ఇంద్రజిత్ వ్యక్తిగత ఇంట్లోనూ సిట్ సోదాలు నిర్వహించింది.
నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు సిట్ చీఫ్ హరప్రీత్ సిద్ధూ తెలిపారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు సిట్ ఏర్పాటు చేశారు. మత్తుపదార్థాల అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఎన్నికల్లో ఆయన హామీయిచ్చారు. డ్రగ్స్ దందాను సంబంధాలున్న పోలీసులను వదలబోమని ఆయన హెచ్చరించారు.