‘నా కారును ఆపి.. నన్నే లైసెన్స్ అడుగుతావా..?’
చండీగఢ్: పంజాబ్‌లో ఓ వ్యాపార వేత్త తన అహంకారాన్ని బయటపెట్టాడు. బాధ్యతగా తన విధులు నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీసుపై చేయిచేసుకున్నాడు. తన బీఎండబ్ల్యూ కారునే ఆపుతావా అంటూ చెలరేగిపోయాడు. ఎవ్వరు అతడిని పట్టుకునే సాహసం చేసినా ఏ మాత్రం ఆగకుండా దాడికి తెగబడ్డాడు. అనంతరం పలువురు అక్కడికి చేరుకొని అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాడు. పాటియాలలో రాంగ్ రూట్‌లో హిమాంషు మిట్టల్ అనే వ్యక్తి బీఎండబ్ల్యూ కారు నడుపుకుంటూ వస్తుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓం ప్రకాశ్ అనే ట్రాఫిక్ పోలీసు కారును ఆపేశాడు.
లైసెన్స్ చూపించాలని కోరాడు. దీంతో అందులో ఉన్న హిమాంషు తాను ఎవరో తెలుసా అని బీరాలు పోతూ.. తన కారునే ఆపుతావా అని ఊగిపోతూ నేరుగా ఓం ప్రకాశ్‌ను చెంపమీద కొట్టాడు. అనంతరం పిడిగుద్దులు కురిపించాడు. ఇదంతా చూస్తున్న పాదచారుల్లో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా పెద్ద దుమారమై కూర్చుంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడికి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయింది.