పంజాబ్ చరిత్రలోనే తొలిసారిగా..
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైన మొదటి మహిళగా విని మహాజన్ రికార్డు సృష్టించారు. కరణ్ అవతార్ సింగ్ స్థానంలో ఈమె నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన విని మహాజన్ శుక్రవారం పంజాబ్ సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పంజాబ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసు, సివిల్ రంగాలకు నేతృత్వం వహిస్తున్నది మహాజన్ దంపతులే కావడం విశేషం. పంజాబ్ రాష్ట్ర డీజీపీ దినకర్ గుప్తా భార్యే నూతన సీఎస్ విని మహాజన్. గత వారం రోజుల నుంచి ఈ నియామకంపై చర్చలు జరగ్గా రెండు రోజుల క్రితమే మహాజన్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (భారత్ గట్టిగా పోరాడుతోంది: మోదీ )
అయితే దీని వెనుక భర్త దినకర్ గుప్తా లాబీయింగ్ ఉందన్న ఆరోపణలపై విని మహాజన్ ఘాటుగా స్పందించారు. డీజీపీ భార్య అయినంత మాత్రానా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా? దానికంటూ ఓ హోదా, అర్హత ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయి ఇలా నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారంటూ మహాజన్ మండిపడ్డారు. అయితే 1987 బ్యాచ్‌కు చెందిన విని మహాజన్ ఆరుగురు ఇతర సహోద్యోగుల కంటే జూనియర్ కావడం గమనార్హం.
రాష్ట్ర సీఎస్‌గా ఉన్న కరణ్ అవతార్ సింగ్ పదవీకాలం ఆగస్టు 31తో ముగియనుంది. అయితే గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కరణ్‌ని పదవిలోంచి తొలగించాలని పలువురు కేబినెట్ మంత్రులు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో పదవీకాలం ముగియకుండానే ఆయన్ని తప్పించినా మరికొన్ని నెలల్లోనే ప్రభుత్వంలో కీలక పదవి చేపట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ వాటర్ రెగ్యులేటరీ అథారిటీ చైర్పర్సన్ పోస్టుకు కరణ్ అవతార్ దరఖాస్తు చేస్తుకున్నట్లు తెలుస్తోంది.
(అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు )