Punyam
-
పరమాత్ముడికి పాలిచ్చిన పుణ్యం
రేపపల్లెలో నందుడి ఇంట పెరుగుతున్న కృష్ణుడిని చంపేందుకు కంసుడు పంపిన పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. తనకు కావలసిన రూపాన్ని పొందడం, శిశువులు ఎక్కడ వున్నా పసిగట్టడం, వారికి పాలిస్తున్నట్లు నటిస్తూ, పొట్టన పెట్టుకోవడం పూతన ప్రత్యేకత. అలా పూతన తన రూపం మార్చుకుని నందుడి ఇంట ప్రవేశించింది. లోపలి ఊయల దగ్గరకు వెళ్ళింది. కాలు, చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసింది. వచ్చిన పనేమిటో ఒక్క క్షణం మరచిపోయి, బాలుని అందానికి మైమరచి ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావురా! నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అందమూ చటుక్కున మాయమయి పోతుంది’ అనుకుంటూ చొరవగా ఉయ్యాలలో వున్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తనం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి అది చూశారు. ‘అయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లాడు పరాయి వాళ్ల పాలు తాగడు, ఆగాగు’ అంటున్నారు. పూతన అదేమీ వినిపించుకోనట్టు గబగబా పిల్లవాడిని తీసి ఒళ్లో పెట్టుకుని, వాడి ముఖాన్ని తన వైపునకు తిప్పుకుని, తన రొమ్మును వాడి నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా ఒకసారి క్రీగంట చూశాడు. కళ్ళు విప్పి అమ్మ స్తన్యం తాగినట్లే ఆ స్తనాన్ని తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు తాగాడు. ఆ రెండు గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణాల దగ్గరనుంచి శరీరంలో వున్న శక్తినంతటిని లాగేశాడు. ఆయన పాలు తాగెయ్యగానే ఆమె కామరూపం పోయి భయంకరమయిన శరీరంతో గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. యశోదా రోహిణులు మాత్రం ‘అయ్యో పిల్లాడు! అయ్యో పిల్లాడు! అని గుండెలు బాదుకుంటూ పూతన భుజాల మీద నుండి పర్వతం ఎక్కినట్లు ఎక్కారు. కృష్ణుడు హాయిగా ఆమె గుండెలమీద పడుకుని, ఏమీ తెలియని వాడిలా బోసినవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు ‘ఆహా! ఎంత అదృష్టమో! పిల్లవాడు బతికి వున్నాడు’ అని కన్నయ్యను ఎత్తుకుని గుండెలకు అదుముకున్నారు. ఈ లోగా నందుడు వచ్చి, జరిగిందంతా తెలుసుకుని కొందరు అనురుల సాయంతో ఆ రాక్షసిని ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి నిప్పు పెట్టాడు. అసలే రాక్షసి కదా, శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది. కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యం! అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. ఎందుకంటే, కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతోపాటు ఆమె శరీరంలో వున్న పాపాన్ని కూడా తాగేశాడు. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు... పరమఆప్తుడు... చంపాలని చనుబాలిచ్చినా, కైవల్యం ప్రసాదించాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఒక రొట్టెకు పది రొట్టెలు
హజ్రత్ రాబియా బస్రీ ధార్మిక చింతనాపరురాలు. ఒకసారి ఐదుగురు అతిథులు ఆమె ఇంటి తలుపు తట్టారు. వచ్చిన అతిథులకు భోజన ఏర్పాట్లు చేయాల్సిందిగా సేవకురాలికి పురమాయించారు రాబియా. ‘ఇంట్లో తినడానికి కేవలం ఒకే ఒక్క రొట్టె మాత్రమే ఉంది’ అని సేవకురాలు వివరించింది. ‘ఇంట్లో ఉన్న ఆ ఒక్క రొట్టెను ఎవరికైనా దానం చేసేయి’ అని చెప్పింది రాబియా. చెప్పినట్లుగానే సేవకురాలు ఇంట్లో ఉన్న రొట్టెను దానం చేసి వచ్చింది. కాసేపటికే ఎవరో తలుపు తట్టిన శబ్దం. తలుపు తీసి చూడగా..‘ఫలానా ‘రాజుగారు తమకోసం ఆహారం పంపారు’ అనే మాటలు! ఆహార పళ్లాన్ని తీసుకుని సేవకురాలు రాబియాకు అందించింది. వాటిని తెరిచి చూడగా అందులో ఐదు రొట్టెలు ఉన్నాయి. ‘‘ఇవి మన కోసం పంపి ఉండకపోవచ్చు. పొరపాటుగా మన ఇంటికి వచ్చాయి’’ అంటూ రాబియా వాటిని రాజుగారికి తిప్పి పంపేశారు. కాసేపటి తరువాత రెండోసారి ఎవరో తలుపు తట్టిన శబ్దం. మళ్లీ ‘ఫలానా రాజుగారు తమకోసం ఆహారం పంపారు’ అనే మాటలు! వాటిని సేవకురాలు అందుకుని రాబియాకు అందించింది. ఆహార పళ్లాన్ని తీసుకుని చూడగా అందులో ఈసారి ఏడు రొట్టెలు ఉన్నాయి. ‘ఇవి మన కోసం పంపి ఉండకపోవచ్చు. పొరపాటుగా మన ఇంటికి వచ్చాయి’ అంటూ రాబియా తన సేవకురాలితో తిప్పి పంపేశారు. మరికాసేపటికి మూడోసారి తలుపుతట్టిన శబ్దం. సేవకురాలు తలుపుతట్టి చూడగా ‘ఫలానా రాజుగారు మీకోసం ఆహారం పంపారు’ అంటూ ఒక సేవకుడు ఆహార పళ్లాన్ని ఇచ్చి వెళ్లాడు. వాటిని యజమాని రాబియాకు అందించింది. పళ్లెంలో మొత్తం ఈ సారి పది రొట్టెలున్నాయి. ‘‘ఇవి ముమ్మాటికీ మన రొట్టెలే. ముందు వీటిని వచ్చిన అతిథులకు పెట్టు’’ అని సేవకురాలికి పురమాయించారు రాబియా. ‘రాజుగారి సేవకులు రెండుసార్లు ఆహారం తీసుకువస్తే వాటిని తిరిగి పంపడంలో ఔచిత్యమేమిటి?’ అని సేవకురాలు అడిగింది.‘‘ఒక పుణ్యం చేస్తే పదిరెట్ల పుణ్యఫలాన్ని ఇస్తానని అల్లాహ్ హామీ ఇచ్చాడు. అందుకే ఒక రొట్టె దానం చేసినందుకు గాను పది రొట్టెలు లభించేదాకా నేను తీసుకోను అని గట్టిగా సంకల్పం చేసుకున్నాను. అందుకే రాజుగారి సేవకులను మాటిమాటికీ తిప్పి పంపాను.’’ అని సేవకురాలి సందేహాన్ని తీర్చారు రాబియా. మనస్సులో ఏదైనా మంచి పని చేయాలని సంకల్పం చేసుకుంటే ఆ పని చేసినంత పుణ్యం మన కర్మల ఖాతాలో జమచేయబడుతుంది. ఆ పుణ్యాన్ని ఆచరణలో పెడితే పదిరెట్ల పుణ్యఫలాన్ని మన ఖాతాలో జమచేస్తాడు అల్లాహ్. ఇది దైవవాక్కు. – ఉమైమా సిద్దీఖా -
సత్కర్మలు... సత్ఫలాలు
ఆత్మీయం మనిషి జీవితంలో మూడువిధాలైన కర్మల్ని ఎదుర్కొంటాడని వేదాంతశాస్త్రం చెబుతోంది. మనిషి చేసే కర్మలు మూడు రకాలు. అంటే గతకాలంలో చేసినవీ, ప్రస్తుతకాలంలో చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవీ అన్నీ అనుభవంలోకి వస్తాయన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలను ’సంచిత’ కర్మలుగా పిలుస్తారు. సంచిలో సరకులను వేసి దాచినట్లు ఇవి దాగి ఉంటాయి కనుక ఇవి సంచితాలు. చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ’ప్రారబ్ధ’ కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. మనిషి చెడు నడతలకు లోనైతే పాపాలు చేస్తాడు. మంచి నడవడిక కలిగి ఉంటే పుణ్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై ’ఇలా ఎందుకు చేశాను?’ అని అనుకొంటాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆరాటపడతాడు. కానీ చేసిన పాపం వూరకే పోదు. చేసిన తప్పువల్ల ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే. రాబోయే కాలంలో ఉత్తమ స్థితిని కలిగి ఉండటం కోసం మనిషి చేసే సత్కర్మలు ’ఆగామి’ కర్మలు. ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు మనిషికి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. ఇలాగే పుణ్య, పాపకర్మల విషయంలోనూ మనిషి ఆలోచించాలి అనేదే ఈ కర్మల పరమార్థం. అందుకే మనిషి మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి.