రేపపల్లెలో నందుడి ఇంట పెరుగుతున్న కృష్ణుడిని చంపేందుకు కంసుడు పంపిన పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. తనకు కావలసిన రూపాన్ని పొందడం, శిశువులు ఎక్కడ వున్నా పసిగట్టడం, వారికి పాలిస్తున్నట్లు నటిస్తూ, పొట్టన పెట్టుకోవడం పూతన ప్రత్యేకత. అలా పూతన తన రూపం మార్చుకుని నందుడి ఇంట ప్రవేశించింది. లోపలి ఊయల దగ్గరకు వెళ్ళింది. కాలు, చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసింది. వచ్చిన పనేమిటో ఒక్క క్షణం మరచిపోయి, బాలుని అందానికి మైమరచి ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావురా! నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అందమూ చటుక్కున మాయమయి పోతుంది’ అనుకుంటూ చొరవగా ఉయ్యాలలో వున్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తనం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి అది చూశారు. ‘అయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లాడు పరాయి వాళ్ల పాలు తాగడు, ఆగాగు’ అంటున్నారు. పూతన అదేమీ వినిపించుకోనట్టు గబగబా పిల్లవాడిని తీసి ఒళ్లో పెట్టుకుని, వాడి ముఖాన్ని తన వైపునకు తిప్పుకుని, తన రొమ్మును వాడి నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా ఒకసారి క్రీగంట చూశాడు. కళ్ళు విప్పి అమ్మ స్తన్యం తాగినట్లే ఆ స్తనాన్ని తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు తాగాడు.
ఆ రెండు గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణాల దగ్గరనుంచి శరీరంలో వున్న శక్తినంతటిని లాగేశాడు. ఆయన పాలు తాగెయ్యగానే ఆమె కామరూపం పోయి భయంకరమయిన శరీరంతో గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. యశోదా రోహిణులు మాత్రం ‘అయ్యో పిల్లాడు! అయ్యో పిల్లాడు! అని గుండెలు బాదుకుంటూ పూతన భుజాల మీద నుండి పర్వతం ఎక్కినట్లు ఎక్కారు. కృష్ణుడు హాయిగా ఆమె గుండెలమీద పడుకుని, ఏమీ తెలియని వాడిలా బోసినవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు ‘ఆహా! ఎంత అదృష్టమో! పిల్లవాడు బతికి వున్నాడు’ అని కన్నయ్యను ఎత్తుకుని గుండెలకు అదుముకున్నారు. ఈ లోగా నందుడు వచ్చి, జరిగిందంతా తెలుసుకుని కొందరు అనురుల సాయంతో ఆ రాక్షసిని ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి నిప్పు పెట్టాడు. అసలే రాక్షసి కదా, శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది. కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యం! అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. ఎందుకంటే, కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతోపాటు ఆమె శరీరంలో వున్న పాపాన్ని కూడా తాగేశాడు. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు... పరమఆప్తుడు... చంపాలని చనుబాలిచ్చినా, కైవల్యం ప్రసాదించాడు.
– డి.వి.ఆర్. భాస్కర్
పరమాత్ముడికి పాలిచ్చిన పుణ్యం
Published Sun, Oct 21 2018 1:39 AM | Last Updated on Sun, Oct 21 2018 1:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment