Adolescents Phase
-
టీనేజ్‌లో కాకుండా... యుక్తవయసు దాటాకా మొటిమలు వస్తున్నాయా?
కొత్తగా యుక్తవయసులోకి ప్రవేశించేటప్పుడు యువతీయువకుల్లో మొటిమలు రావడం చాలా సహజం. కానీ కొద్దిమంది మహిళల్లో ఇవి 25 నుంచి 35 ఏళ్ల వయసులోనూ కనిపిస్తుంటాయి. టీనేజీలోకి వచ్చే యువతుల్లో అప్పుడే స్రవిస్తున్న కొత్త హార్మోన్లు మొటిమలకు కారణం కాగా... యుక్తవయసు దాటినవారిలో కొంతమేర హార్మోన్ల ప్రభావంతోపాటు ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ సమస్యల కారణంగా కూడా మొటిమలు రావచ్చు. అంతేగాక... లుక్స్ గురించి టీనేజీలో పట్టించుకున్నట్లుగా కాకుండా... కొంత స్వేచ్ఛ తీసుకుని ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ వంటివి తినే ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు ఒక కారణం కావచ్చు. మొటిమల వల్ల పెద్దవయసులో ఏర్పడే మచ్చలు టీనేజీ సమయంలో కంటే కాస్త ఎక్కువకాలం ముఖంపై ఉండిపోవచ్చు. అది కొద్దివారాలు మొదలుకొని... కొన్ని నెలల వరకూ ఉండిపోవచ్చు. వీటి బాధ నుంచి విముక్తం కావడం కోసం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. చాలా తక్కువ తీవ్రతతో (మైల్డ్‌గా) ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, శాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ వంటి క్లెన్సర్స్ వాడాల్సి ఉంటుంది. మొటిమలు ఇంకాస్త తీవ్రంగా వస్తున్నవారు రెటినాయిడ్స్ వంటి పూత మందులు వాడాలి. స్వేద రంధ్రాలు పూడుకుపోయి మొటిమలు వస్తునప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. మరింత తీవ్రమైన మొటిమలకు రెటినాయిడ్స్‌తో పాటు కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో ప్రయోజనం లేనప్పుడు నోటిద్వారా తీసుకునే ఓరల్ మెడిసిన్స్ డాక్టర్ సలహా మేరకు వాడాల్సిన అవసరం పడవచ్చు. మొటిమలతో పాటు హార్మోన్ అసమతౌల్యతలు ఉన్నప్పుడు కొన్ని హార్మోన్ సంబంధిత మందులు వాడాల్సి వస్తుంది. ఈ చికిత్సల తర్వాత మొటిమల తాలూకు మచ్చలు, గాట్లు పోవడానికి కెమికల్ పీల్స్, డర్మారోలర్, లేజర్ చికిత్సలు, మైక్రో నీడిలింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) వంటి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉంటాయి. చదవండి: Vitamin A Deficiency: విటమిన్ ‘ఏ’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తిన్నారంటే! -
వీగనిజాలు
ఆహారపు అలవాట్లను బట్టి మనుషుల్లో శాకాహారులు, మాంసాహారులు రెండు రకాల విభజన అందరికీ తెలిసినదే. శాకాహారులు ఎలాంటి మాంసాహారాన్నీ తీసుకోరు. అయితే, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాడి ఉత్పత్తులను తీసుకుంటారు. శాకాహారులు తీసుకునే పదార్థాలతో పాటు గుడ్లు, చేపలు, పక్షుల మాంసం, జంతుమాంసం వంటివన్నీ తీసుకుంటారు మాంసాహారులు. సనాతన మతాల్లో ఆచారాన్ని అతిగా పాటించే వారు వీరవైష్ణవ, వీరశైవ వర్గాలుగా ఏర్పడినట్లుగా గడచిన శతాబ్దిలో ఆహారపు అలవాట్లలోనూ ఒక కొత్త అతిధోరణి మొదలైంది. తెలుగులో వీళ్లని వీర శాకాహారులనవచ్చు.ఇంగ్లిష్‌లో వీళ్లనే ‘వీగన్స్’ అంటున్నారు. వీళ్ల సిద్ధాంతమేమిటంటే పశు పక్ష్యాదులను వస్తువులుగా పరిగణించరాదు. అవి కూడా మనుషుల మాదిరిగా సాటి జీవులే. అందువల్ల వాటి నుంచి లభించే ఉత్పత్తులేవీ తీసుకోరాదు. పూర్తిగా ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవారు కనీసం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాడి ఉత్పత్తులను కూడా తీసుకోరు. కేవలం మొక్కలు, చెట్ల నుంచి లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాల ఉత్పత్తులను కూడా తీసుకునే శాకాహారులను ఇంగ్లిష్‌లో వెజిటేరియన్స్ అంటారు. పాల ఉత్పత్తులను తీసుకోని వీర శాకాహారులకు ‘వీగన్స్’ అనే పేరును 1944లో తొలిసారిగా డొనాల్డ్ వాట్సన్ అనే జంతు హక్కుల పరిరక్షణ ఉద్యమ కార్యకర్త ఖాయం చేశాడు. అప్పటి నుంచి పాల ఉత్పత్తులను సైతం నిరాకరించే వీర శాకాహారులకు ‘వీగన్స్’ పేరు స్థిరపడిపోయింది. డొనాల్డ్ వాట్సన్ ఇంగ్లండ్‌లో ‘వీగన్స్ సొసైటీ’ని కూడా ప్రారంభించాడు. ‘వీగన్’ ఆహారం అన్ని వయసుల వారికి, అన్ని శారీరక స్థితులకు చెందిన వారికి పూర్తిగా ఆమోదయోగ్యమైనదేనని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, డైటీషియన్స్ ఆఫ్ కెనడా, బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్ సంస్థలు ప్రకటించాయి. అయితే, జర్మన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ మాత్రం ఈ వాదనతో విభేదించింది. పాలు, పాల ఉత్పత్తులు సైతం లేని వీగన్ ఆహారం అన్ని వయసుల వారికీ ఆమోదయోగ్యం అని చెప్పడం తగదని, చిన్నారి శిశువులు, ఎదిగే వయసులోని పిల్లలు, గర్భిణులు, బాలింతలు పూర్తిగా వీగన్ ఆహారంపైనే ఆధారపడితే వారికి తగిన పోషణ లభించదని తేల్చిచెప్పింది. వారు కనీసం పాలు, పాల ఉత్పత్తులనైనా తమ ఆహారంలో భాగంగా చేసుకోవడమే మంచిదని స్పష్టం చేసింది. ఇదీ శాకాహార చరిత్ర ఆదిమానవులు ఆకులు అలములు పండ్లు దుంపలతో పాటు జంతుమాంసాన్ని కూడా తినేవారు. తొలి నాళ్లలో పచ్చిమాంసాన్ని తినేవాళ్లు. నిప్పును కనిపెట్టిన తర్వాత కాల్చిన మాంసం రుచి మరిగారు.కంచు, ఇనుము వంటి లోహాలను కనుగొని వాటితో పాత్రలు తయారు చేయడం, మట్టిపాత్రలు తయారు చేయడం మొదలైన తర్వాత రుచికరమైన ఆహారాన్ని వండుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలి నాగరికతల్లో చాలా చోట్ల మనుషులు మాంసాహారులుగానే ఉండేవారు. సింధులోయ నాగరికత విలసిల్లిన ప్రాంతంలో కొందరు శాకాహారులుగా జీవించారనేందుకు ఆధారాలు ఉన్నాయి. అప్పటి కాలంలో అంటే క్రీస్తుపూర్వం 3300–1300 సంవత్సరాల మధ్య కాలంలో మన దేశానికి వాయవ్య ప్రాంతంలో కొందరు శాకాహారులుగా ఉండేవారు. ఈ ప్రాంతంలో కొంత ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దానికి చెందిన జైన మత వ్యవస్థాపకుడు వర్ధమాన మహావీరుడు శాకాహారాన్ని ప్రోత్సహించాడు. ఆయన ప్రభావంతో భారత భూభాగంలోని చాలా ప్రాంతాలకు శాకాహారం విస్తరించింది. జీవహింస పాపమనే చింతన గలవారిలో చాలామంది శాకాహారులుగా మారారు. తొలినాటి శాకాహారులు ఇప్పటి వీగన్ల మాదిరి వీర శాకాహారులేమీ కాదు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు వారు పాలను, పాల ఉత్పత్తులను కూడా తీసుకునేవారు. చరిత్రకెక్కిన తొలినాటి శాకాహారుల్లో మౌర్య సామ్రాజ్యాన్ని ఏలిన చంద్రగుప్తుడు, అశోకుడు, ప్రాచీన తమిళకవి వళ్లువార్, రోమన్ కవి ఓవిద్, రోమన్ నాటకకర్త సెనెకా ది యంగ్, గ్రీకు తత్వవేత్తలు ఎంపెడాక్లిస్, థియోఫ్రాస్టస్, ప్లూటార్క్, పైథాగరస్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఆహారం కోసం జంతువులను, పక్షులను చంపడాన్ని పైథాగరస్ తీవ్రంగా వ్యతిరేకించేవాడని, వాటిని చంపేవారికి, వాటితో వంటకాలు తయారు చేసేవారికి కూడా దూరంగా ఉండేవాడని ప్లాటో రాశాడు. ఇప్పటి కాలంలో వీగన్స్గా పిలుచుకొనే వీరశాకాహార ధోరణికి క్రీస్తుశకం పదో శతాబ్దిలోనే మూలాలు ఏర్పడ్డాయి. అప్పటి కాలానికి చెందిన అరబ్ కవి అబ్దుల్ అల్ అలమారి వీరశాకాహారాన్ని పాటించేవాడు. పశుపక్ష్యాదులకు చెందిన ఎలాంటి ఉత్పత్తులనూ తీసుకునేవాడు కాదు. తన అనుచరులకు కూడా ఇదే సిద్ధాంతాన్ని బోధించేవాడు. మనుషులు పశుపక్ష్యాదులను తినేస్తున్నట్లయితే మరణానంతరం పశుపక్షుల ఆత్మలు మనుషుల్లో, మనుషుల ఆత్మలు పశుపక్ష్యాదుల్లోనికీ చొరబడే ప్రమాదం ఉందని, అలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండాలంటే మనుషులందరూ ఆహారం కోసం కేవలం వృక్షజాతులపై ఆధారపడటమే సరైన పద్ధతి అని ఆయన బలంగా నమ్మేవాడు. అప్పట్లో ఈ సిద్ధాంతం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటి కాలంలో అహింసావాద సిద్ధాంతాన్ని నమ్మేవారిలో చాలామంది స్వచ్ఛందంగా శాకాహారం వైపు మళ్లారు. నిర్ణీత ఆహారపు అలవాట్ల వల్ల చేకూరే ప్రయోజనాలపై మాత్రం వారిలో చాలామందికి తగిన అవగాహన ఉండేది కాదు. డొనాల్డ్ వాట్సన్ గత శతాబ్దిలో ‘వీగన్స్ సొసైటీ’ని ప్రారంభించినా, వీగన్ ఆహారానికి మాత్రం గడచిన దశాబ్దకాలంగా మాత్రమే ప్రాచుర్యం పెరుగుతూ వస్తోంది. శాకాహారం ప్రయోజనాలూ పరిమితులూ పాల ఉత్పత్తులను స్వీకరించే శాకాహారులను వెజిటేరియన్లుగా, పాల ఉత్పత్తులను సైతం ఆహారంలో భాగంగా చేసుకోని వారిని ‘వీగన్స్’గా పరిగణిస్తారు. నిజానికి శాకాహారంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా, వాటితో పాటే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, అందులోని పరిమితులతో పాటు వీగన్ ఆహారంపై ప్రచారంలో ఉన్న విషయాల గురించి వాస్తవిక దృక్పథంలో అవగాహన కల్పించడానికే ఈ సమాచారం.. శాకాహారం చాలా మేలు చేస్తుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కొన్ని సూక్ష్మజీవులు చేరుతాయి. అవి వ్యాధులకు కారణమవుతాయి. ఉదాహరణకు పందిమాంసం (పోర్క్) ద్వారా టేప్‌వార్మ్స్ వంటివి, బొవైన్ స్పాంజీతో ఎన్సెఫలోపతి, గొడ్డు మాంసంతో మ్యాడ్ కౌ డిసీజ్, ఆంథ్రాక్స్ వంటివి. గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి.ఫలితంగా న్యుమోనియా, బ్రాంకైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. శాకాహారంతో అలాంటి ప్రమాదం చాలా చాలా తక్కువ. ఇవీ పరిమితులు శాకాహారం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నా, దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. కేవలం శాకాహారం మాత్రమే శరీరానికి కావలసిన అన్ని పోషకాలనూ పూర్తిగా అందించలేదు. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్ బి–12, విటమిన్–డి, ఐరన్ వంటి పోషకాలు తగినంతగా లభించాలంటే కనీసం పాలు, పాల ఉత్పత్తులనైనా తీసుకోవాల్సి ఉంటుంది. ∙శరీరానికి కావలసిన ప్రొటీన్లు శాకాహారంతో పోలిస్తే మాంసాహారం ద్వారానే తేలికగా లభిస్తాయి. చాలా వరకు శాకాహార పదార్థాల్లో ప్రొటీన్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. శాకాహారం ద్వారా మాత్రమే పూర్తిగా ఆధారపడి శరీరానికి కావాల్సిన పరిమాణంలో ప్రొటీన్లు పొందాలంటే పప్పులు, సోయా వంటి గింజధాన్యాలు, వాటితో తయారయ్యే సోయా మిల్క్, తోఫు వంటి ఉత్పత్తులను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కినోవా, అవిసెగింజలను కూడా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటితో పోలిస్తే ఇవేవీ అంత చౌకైన ప్రత్యామ్నాయాలు కావు. ∙యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అంటే... 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వయసు గలవారికి ప్రతి ఒక్కరికీ 1000 మిల్లీగ్రాముల క్యాల్షియమ్ అవసరం. ఇది పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటుంది. అయితే వీగనిజమ్ అవలంబించే వారికి అదే మొత్తంలో క్యాల్షియం లభ్యం కావాలంటే వాళ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు అంటే పాలకూర, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా ఉత్పత్తులు వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి. వీరశాకాహారం పేరిట పాలు, పాల ఉత్పత్తులను సైతం మానేసి, ప్రత్యామ్నాయాలను తగినంతగా తీసుకోలేకపోతే ఎముకలకు తీరని నష్టం వాటిల్లుతుంది.ఎముకల్లోకి క్యాల్షియం ఇంకిపోవాలంటే, శరీరానికి కీలకమైన విటమిన్–డి తగినంతగా అందాలి. పూర్తిగా ఎదిగిన యుక్తవయస్కులకు ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ) పరిమాణంలో విటమిన్–డి అవసరం. ఇది కూడా పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. పాలు, గుడ్లు మానుకునేవారు ఈ లోటును భర్తీ చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రతిరోజూ సోయా ఉత్పత్తులు, పుట్టగొడుగులు వంటివి తీసుకోవాలి. ∙రక్తహీనత బారిన పడకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబీన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. ∙విటమిన్ బి–12 పూర్తిగా జంతు సంబంధ ఆహారంలోనే లభిస్తుంది. మాంసం తినకపోయినా, కనీసం పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా విటమిన్ బి–12 లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. విటమిన్ బి–12 లోపిస్తే మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎండ కన్నెరగకుండా ఇళ్లకు, ఆఫీసులకు మాత్రమే పరిమితమవుతూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్–డి, విటమిన్–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు, ఎముకల సమస్యలు ఇటీవలి కాలంలో చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు, విటమిన్–డి, విటమిన్–బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం సప్లిమెంట్ల వంటి ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. వీగన్ ఆహారానికి పెరుగుతున్న ప్రాచుర్యం గడచిన దశాబ్దకాలంగా వీగన్ ఆహారానికి ప్రాచుర్యం పెరుగుతోంది. అమెరికా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ వంటి పాశ్చాత్య సంపన్న దేశాలతో పాటు చైనా, హాంకాంగ్ వంటి ప్రాచ్య దేశాల్లోనూ ప్రాసెస్ చేసిన వీగన్ ఆహార పదార్థాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో పాడి పరిశ్రమ ద్వారా వచ్చే పాలకు బదులు సోయా మిల్క్ వంటి ప్రత్యామ్నాయ ఉత్పత్తులను తీసుకునే వారి సంఖ్య గత ఎనిమిదేళ్లలోనే 41 శాతం మేరకు పెరిగింది. పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారుచేసిన కృత్రిమమాంసం అమ్మే దుకాణాలు కూడా పాశ్చాత్య దేశాల్లో వెలిశాయి. జర్మనీలో 2011లో వీగన్ సూపర్‌మార్కెట్ ప్రారంభమైంది.యూరోప్‌లో వీగన్ల కోసం ప్రత్యేకంగా వెలిసిన తొలి సూపర్‌మార్కెట్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు వీగన్ ఆహారం వైపు మళ్లుతున్నారు. ఇవీ ప్రయోజనాలు శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను ఇటీవలి పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. మాంసాహారంతో పోలిస్తే శాకాహారమే ఎంతో మేలైదని తెలిపే అధ్యయన ఫలితాలు తరచుగా వెల్లడవుతున్నాయి. వాటిలో వెల్లడైన ఫలితాల సారాంశం సంక్షిప్తంగా... ∙శాకాహారం మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగిస్తుంది. అందుకే శాకాహారాన్ని స్వాభావికమైన డీటాక్స్ (విషహరిణి)గా చెప్పవచ్చు. శాకాహారంలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక అధ్యయన ఫలితం ప్రకారం శాకాహారం తినే జంతువులతో పోలిస్తే మాంసాహారం తినే వాటిల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ 10 శాతం అదనంగా స్రవిస్తూ ఉంటుంది. ∙మాంసాహారం సాధారణంగా ఒకేరంగుతో కంటికి అంత ఆకర్షణీయంగా కనిపించదు. కానీ శాకాహారంలోని రకరకాల పదార్థాలు రకరకాల రంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి. సహజంగా దొరికే రంగురంగుల ఆహారపదార్థాల్లో నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల వైవిధ్య భరితమైన విభిన్న తరహా ఆహారాలతో, అవి అందించే విభిన్న పోషకాలతో ఆరోగ్యం బాగుంటుంది. ∙ శాకాహారం తేలికగా జీర్ణమవుతుంది. కూరగాయలు, గింజలు, ఆకుకూరలతో కూడిన ఆహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్ధకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్ కేరిస్), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ స్వాభావికంగానే జరుగుతుంది. ∙పప్పులు, గింజలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో కూడిన శాకాహారంతో ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల తరచుగా వీటిని తీసుకునేవారు స్థూలకాయం బారిన పడకుండా ఉంటారు. అంతేకాదు, యాంటీ ఆక్సిడెంట్లు మేని మెరుపును కాపాడతాయి. పండ్లు ఆకుకూరలు తరచూ తినేవారికి స్థూలకాయం వల్ల తలెత్తే డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలు కూడా చాలావరకు ఉండవు. పండ్లు, ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజలవణాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. శాకాహారం వల్ల పిప్పిపళ్లు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా అరుదు. -
పరమాత్ముడికి పాలిచ్చిన పుణ్యం
రేపపల్లెలో నందుడి ఇంట పెరుగుతున్న కృష్ణుడిని చంపేందుకు కంసుడు పంపిన పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. తనకు కావలసిన రూపాన్ని పొందడం, శిశువులు ఎక్కడ వున్నా పసిగట్టడం, వారికి పాలిస్తున్నట్లు నటిస్తూ, పొట్టన పెట్టుకోవడం పూతన ప్రత్యేకత. అలా పూతన తన రూపం మార్చుకుని నందుడి ఇంట ప్రవేశించింది. లోపలి ఊయల దగ్గరకు వెళ్ళింది. కాలు, చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసింది. వచ్చిన పనేమిటో ఒక్క క్షణం మరచిపోయి, బాలుని అందానికి మైమరచి ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావురా! నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అందమూ చటుక్కున మాయమయి పోతుంది’ అనుకుంటూ చొరవగా ఉయ్యాలలో వున్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తనం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి అది చూశారు. ‘అయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లాడు పరాయి వాళ్ల పాలు తాగడు, ఆగాగు’ అంటున్నారు. పూతన అదేమీ వినిపించుకోనట్టు గబగబా పిల్లవాడిని తీసి ఒళ్లో పెట్టుకుని, వాడి ముఖాన్ని తన వైపునకు తిప్పుకుని, తన రొమ్మును వాడి నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా ఒకసారి క్రీగంట చూశాడు. కళ్ళు విప్పి అమ్మ స్తన్యం తాగినట్లే ఆ స్తనాన్ని తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు తాగాడు. ఆ రెండు గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణాల దగ్గరనుంచి శరీరంలో వున్న శక్తినంతటిని లాగేశాడు. ఆయన పాలు తాగెయ్యగానే ఆమె కామరూపం పోయి భయంకరమయిన శరీరంతో గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. యశోదా రోహిణులు మాత్రం ‘అయ్యో పిల్లాడు! అయ్యో పిల్లాడు! అని గుండెలు బాదుకుంటూ పూతన భుజాల మీద నుండి పర్వతం ఎక్కినట్లు ఎక్కారు. కృష్ణుడు హాయిగా ఆమె గుండెలమీద పడుకుని, ఏమీ తెలియని వాడిలా బోసినవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు ‘ఆహా! ఎంత అదృష్టమో! పిల్లవాడు బతికి వున్నాడు’ అని కన్నయ్యను ఎత్తుకుని గుండెలకు అదుముకున్నారు. ఈ లోగా నందుడు వచ్చి, జరిగిందంతా తెలుసుకుని కొందరు అనురుల సాయంతో ఆ రాక్షసిని ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి నిప్పు పెట్టాడు. అసలే రాక్షసి కదా, శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది. కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యం! అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. ఎందుకంటే, కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతోపాటు ఆమె శరీరంలో వున్న పాపాన్ని కూడా తాగేశాడు. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు... పరమఆప్తుడు... చంపాలని చనుబాలిచ్చినా, కైవల్యం ప్రసాదించాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
అమాయకత్వం మాయం?
ఎడాలసెన్స్ ప్రారంభం ఆ ప్రాయం చేసే పనులు విచిత్రం. ఆ వయసే ఒక మాయ. ఒక మర్మం. అప్పటి వరకు మాయామర్మం ఎరగని పిల్లలు చిత్రంగా ఉండటం చూసి పేరెంట్స్ విభ్రాంతి చెందుతారు. వారి ప్రవర్తన పట్ల కాస్తంత బెంగపడతారు. ఆ ఏజ్‌లో కొత్తగా స్రవించే హార్మోన్ల మాయ అది. ఆ ఈడు సమకూర్చే సరికొత్త అనుభవాల మర్మమది. ఈ విషయాలను తెలుసుకుంటే తల్లిదండ్రులు పిల్లల బిహేవియర్‌తో బెంగడాల్సిన అవసరం ఉండదు. ఆ టైమ్‌లో టీనేజ్‌లో ఉండేవారి ట్రెండ్స్ పట్ల తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించడం కోసం... వారి ఆందోళనలు తొలగించడం కోసం... టీనేజ్ పిల్లలకోసం ప్రత్యేకంగా క్లినిక్‌లు వస్తున్నాయంటూ భరోసా ఇవ్వడం కోసం ఫ్యామిలీ అందిస్తున్న ప్రత్యేక కథనమిది. పదహారేళ్ళ సుష్మ ఒకప్పుడు బాగా చదివేది. ఇంట్లో అమ్మానాన్నల మాటకు ఎదురుచెప్పేదీ కాదు. కానీ, ఈ మధ్య పరిస్థితి క్రమంగా మారుతోంది. అప్పటి దాకా మంచి మార్కులు తెచ్చుకుంటున్న సుష్మకు పరీక్షల్లో గ్రేడ్ కూడా తగ్గుతోంది. బంధు మిత్రులెవరితో కలవనైనా కలవట్లేదు. అన్యమనస్కంగా ఉంటున్న కూతురి ప్రవర్తనలో, మాట తీరులో వచ్చిన మార్పు కన్నతల్లి సునీతకు అర్థమవుతోంది. నిన్నటి దాకా చంటిపాపలా ఉన్న కూతురు ఇప్పుడు ‘‘చాలా వేగంగా పెరిగి పెద్దది అవుతోంది’’ అనే భావన తల్లికి వచ్చేసింది. పద్ధెనిమిదేళ్ళ ప్రవీణ్ తల్లితండ్రులది ఇలాంటి సమస్యే! చదువులో అప్పటి దాకా ఫస్ట్ ర్యాంకర్‌గా ఉన్న పిల్లాడు ఒక్కసారిగా వెనకబడ్డాడు. ఇంట్లో రెబల్‌లా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడూ తన గదిలోనే తలుపులు వేసుకొని, స్మార్ట్‌ఫోన్‌లో మాట్లాడుతూనో, కంప్యూటర్లో ఛాటింగ్ చేస్తూనో కాలం గడిపేస్తున్నాడు. అదేమని అడగబోతే, ‘మీకేం తెలుసు. నాకిష్టం లేని గ్రూప్‌లో ఇంజనీరింగ్‌లో పడేసి, నా జీవితం నాశనం చేశారు’ - జేవురించిన ముఖంతో, కోపంగా అరిచాడు. మనసు గాయపడ్డ ప్రవీణ్ అమ్మ కళ్ళలో సుడులు తిరుగుతున్న నీళ్లు. అసలు ఏమిటీ సమస్య? కౌమారం... కిశోరప్రాయం... ఇంగ్లీషులో చెప్పాలంటే ఎడాలసెన్స్... ఇప్పుడు పిల్లల తల్లితండ్రుల్ని భయపెడుతున్న దశ. అప్పటి దాకా బుద్ధిమంతులుగానే పెరిగిన పిల్లలు హార్మోన్లలో తేడాతో వచ్చిన శారీరక, మానసిక మార్పులతో... ఒక్కసారిగా రెబల్‌గా వ్యవహరించే ప్రమాదం ఉన్న దశ. ఇవాళ నూటికి తొంభై శాతం ఇళ్ళలో తల్లితండ్రులకు బెంగగా మారిన విషయం. ప్రారంభమైన ప్రత్యేక క్లినిక్‌ల ట్రెండ్ పిల్లలూ, పెద్దలూ - రెండూ కాని సుష్మ, ప్రవీణ్ లాంటి వాళ్ళ మానసిక సంక్షోభానికి పరిష్కారం చూపించాలంటే ఎలా? కౌమార వయసువారి సైకాలజీని కూడా అధ్యయనం చేసిన ‘చైల్డ్ సైకియాట్రిస్ట్’ దగ్గరకు తీసుకువెళ్ళడం మినహా ఇప్పటి దాకా మరో దోవ లేదు. కానీ, ఇప్పుడిప్పుడే మారుతున్న ట్రెండ్ ఏమిటంటే, అటూ ఇటూ కాని ఈ 13 నుంచి 18 ఏళ్ళ లోపు వయసు వారి కోసం ఎడాలసెంట్ సైకియాట్రిక్ క్లినిక్‌లు శ్రీకారం చుట్టుకుంటున్నాయి! బెంగుళూరులోని సుప్రసిద్ధ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్’ (నిమ్‌హ్యాన్స్) పూర్తిగా ఈ వయసు వాళ్ళ కోసమే ఒక మానసిక చికిత్సాలయాన్ని ప్రారంభిస్తోంది. సైకాలజిస్ట్‌లు, స్కూల్ కౌన్సెలర్లు ఈ సరికొత్త ధోరణికి స్వాగతం పలుకుతున్నారు. కారణం ఒకటే - ఈ ఎడాలసెంట్ ఏజ్‌లో పిల్లల్లో మానసికంగా కలిగే ఆటుపోట్లు పెద్దయ్యాక కూడా వాళ్ళపై ప్రభావం చూపిస్తాయి. చివరకు వాళ్ళు జీవితంలో తీసుకొనే కీలక నిర్ణయాల మీద కూడా ముద్ర వేస్తాయి. అందుకే, ఈ హార్మోన్ల మార్పు వయసులోని పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ అవసరమని తాజా అధ్యయనాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఆధునిక జీవనం తెచ్చిన అస్థిరత్వం నిజానికి, కౌమార దశలో పిల్లల్లో ఎదురయ్యే మానసిక అస్థిరత్వం ఇవాళ కొత్తగా వచ్చినదేమీ కాదు. నేటి తల్లితండ్రులు కూడా నిన్నటి బాలలే కాబట్టి, వాళ్ళూ ఈ దశ దాటి వచ్చినవాళ్ళే! కాకపోతే, అప్పట్లో పిల్లల్లోని ఈ సమస్య పెద్దది కాకుండా, ఉమ్మడి కుటుంబంలోని బంధువుల ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు పనికొచ్చేవి. ఇంట్లోనే ఒకరు కాకపోతే మరొకరి మంచి మాటలతో పిల్లల ప్రవర్తనకు పగ్గాలు పడేవి. కానీ, ఆధునిక సాంకేతిక యుగంలోని ఇవాళ్టి పిల్లలు వేరు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, రకరకాల టీవీ చానళ్ళు, వీడియో గేమ్‌లు అందుబాటులోకి రావడం, బయట సమాజంలో మార్కులు, ర్యాంకులు, ఫ్యాషన్ల ఒత్తిడితో పిల్లల ప్రవర్తన తీరే చాలా మారింది. పైగా, ఇవాళ అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే అయిపోయాక తల్లితండ్రులు తప్ప ఇంట్లో మంచీ చెడూ చెప్పే పెద్దవాళ్ళు, తోటి వయసువాళ్ళు లేకపోవడం పెద్ద ఇబ్బందిగా తయారైంది. కొత్తగా రెక్కలొచ్చెనా... అందుకే, ఇప్పుడు ఈ వయసు పిల్లల మీద పెద్దలు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం వచ్చింది. ఈ వయసులో పిల్లల్లో హార్మోన్ల పరంగా బోలెడన్ని మార్పులు జరుగుతాయి. అప్పటి దాకా శరీరం మీద పెద్దగా స్పృహ లేని వాళ్ళకు లైంగిక చైతన్యం కలుగుతుంది. శారీరకంగా కలిగే మార్పులు మానసికంగా కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. స్కూలు నుంచి కాలేజీకి ఎంటరై, చదువుల్లో, ఆ పైన జీవితంలో కీలకమైన మలుపులకు కారణమయ్యే వయసు అది. బాల్యం నుంచి యౌవనానికి మారే టైమ్ అది. అప్పటి దాకా ప్రతిదానికీ ఇంట్లో పెద్దల మీద ఆధారపడ్డవాళ్ళు కొత్తగా లభించిన స్వేచ్ఛతో బయట ప్రపంచంలో స్వతంత్రాన్ని అనుభవించాలని ఉవ్విళ్ళూరే దశ అది. గూటిలోని గువ్వ పిల్ల... కొత్తగా వచ్చిన పసి రెక్కలతో ఆకాశానికి ఎగరాలని తాపత్రయపడే తరుణం అది. వీళ్ళొక ప్రత్యేక కేటగిరీ! సాధారణంగా ఈ వయసు పిల్లలు తాము చేసేదంతా కరెక్ట్ అనుకుంటారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అందుకే వాళ్ళ మాటలు పెద్దల్ని ఎదిరించడంలా, రెబల్‌గా అనిపిస్తాయి. అదేమని తల్లితండ్రులు అంటే, తమని అందరూ అపార్థం చేసుకుంటున్నారని పిల్లలు అనుకుంటారు. ఈ సమయంలో వాళ్లను సరిగ్గా అర్థం చేసుకొని, అనునయించి సరైన మార్గంలో పెట్టకపోతే, వాళ్ళు సరిగ్గా తిండి తినరు. డిప్రెషన్లోకి జారిపోతారు. స్కిజోఫ్రెనియాతో బాధపడతారు. ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సెన్సైస్’కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న వైద్యనిపుణుడు స్వయంగా ఈ సంగతులు వివరించారు. ఇంట్లో పెద్దలు... స్కూల్లో టీచర్లు... ఆ వయసు పిల్లలకు మంచీ చెడూ చెప్పడం తప్పనిసరి. వారికి దిశా నిర్దేశం చేయాలి. అలాగే, ఆ వయసులో వారికి వచ్చే శారీరక, మానసిక సందేహాలకు సమాధానాలు చెప్పి, సమస్యల్ని వారే ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలి. కానీ, చాలా సందర్భాల్లో పిల్లలు తమ మనసులో మాట బయటపెట్టడానికి సిగ్గుపడతారు. అలాంటప్పుడు వాళ్ళను అనునయించి, విషయం కనుక్కొని, సరైన దోవలో పెట్టాలి. ఈ విషయంలో విద్యాలయాల్లో అధ్యాపకుల పాత్ర కూడా చాలానే ఉంటుంది. శరీరంలో వస్తున్న మార్పుల గురించి పిల్లలకు అవగాహన కలిగించాలి. అదే సమయంలో లైంగిక విజ్ఞానంతో పాటు చెడుదారులు పడితే వచ్చే ముప్పు గురించీ చెప్పాలి. మాదక ద్రవ్యాల లాంటి చెడు అలవాట్ల వల్లకలిగే దుష్ఫలితాల్ని వివరించాలి. పిల్లలు, పెద్దలు కాకుండా ఈ కౌమార వయస్కుల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలని ‘నిమ్‌హ్యాన్స్’ లాంటి సంస్థలూ భావిస్తున్నాయి. అందుకే! వీళ్ళ కోసం ప్రత్యేకంగా చికిత్సకు సన్నద్ధమవుతున్నాయి. తల్లితండ్రులు కూడా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని, వాళ్ళతో స్నేహితులలాగా, సమవయస్కుల లాగా ప్రవర్తించాలి. పెద్దలు తమ మనసులో మాట వింటున్నారన్న భావన వస్తే చాలు... ఈ వయసు పిల్లలకూ, పెద్దలకూ మధ్య మంచీ చెడూ మాట్లాడుకొనే మార్గం ఏర్పడుతుంది. పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ, అవసరాన్ని బట్టి ‘ఎడాలసెంట్ సైకియాట్రిస్ట్’ను సంప్రతించాలి. కీలకమైన ఈ వయసులో సరైన టైమ్‌కి, సరైన తోడ్పాటు అందిస్తే... అదే మనం మన పిల్లలకు ఇచ్చే అతి పెద్ద ఎడ్యుకేషన్. గిఫ్ట్ కూడా! ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూనో, ముభావంగానో ఉన్న తెలిసీ తెలియని వయసు పిల్లల్ని మానసిక ఉద్వేగాల్ని అదుపు చేసుకున్న అందమైన యువతీ యువకులుగా తీర్చిదిద్దడాన్ని మించి ఏ తల్లితండ్రులైనా, గురువులైనా కోరుకునేది ఏముంటుంది! - రెంటాల ప్రతి ఆరుగురిలో ఒకరున్నారు! సాధారణంగా 13 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసు పిల్లల్ని కౌమార వయస్కులు అంటారు. ఇవాళ ప్రపంచంలో దాదాపు 120 కోట్ల మందికి పైగా ఈ కౌమార వయసు పిల్లలు ఉన్నారని లెక్క. మరో మాటలో చెప్పాలంటే, ప్రతి ఆరుగురిలో ఒకరు ఎడాలసెంట్ అన్నమాట! ఇక, మన భారతదేశ జనాభాలో 21 శాతం మంది దాకా (దాదాపు 25 కోట్ల మంది) ఈ వయసు పిల్లలే. అటు పూర్తిగా పిల్లలూ కాక, ఇటు పూర్తిగా యౌవనప్రాయులూ కాకుండా మధ్య వయసులో ఉండే చిత్రమైన దశ ఇది. బాల్యం నుంచి కౌమారానికి వచ్చే ఈ ఎదిగే వయసు పిల్లలకు తమలో శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పుల గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఈ కౌమార సమస్యల గురించి సరైన సమాచారం లేకపోవడం, సరైన గెడైన్స్ లేకపోవడం, తల్లితండ్రులు ఈ సమస్యను సరిగ్గా గుర్తించకపోవడం, పిల్లల్లో వచ్చిన మార్పును ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ వయసు తెచ్చే సమస్యలు! ⇒ కిశోరప్రాయంలోని పిల్లలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో కొన్ని ఇవీ... ⇒ లైంగికపరంగా తెలియని సిగ్గు, అపరాధభావన ⇒ ఒంటి రంగు, అందం గురించి నిరాశా నిస్పృహలు ⇒ దుస్తులు, ఫ్యాషన్ల పట్ల పేరుకుపోయిన తప్పుడు అభిప్రాయాలు ⇒ స్నేహం, కలసి తిరగడం పట్ల ఉన్న తప్పుడు భావాలు. ఆడామగల్లో ఉండే పరస్పర ఆకర్షణ ⇒ మిగతావాళ్ళతో పోలిస్తే తనకు తెలివితేటలు తక్కువనే అనుమానం. ⇒ పరీక్షలంటే భయం. ఎక్కడ మార్కులు తక్కువొచ్చి, అనుకున్న ర్యాంక్ రాదోనని ఆందోళన. ⇒ భవిష్యత్ కెరీర్ గురించి భయాందోళనలు ⇒ ప్రతిదానికీ కుంగిపోతూ, ఆత్మహత్య వైపు మనసు లాగడం మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? ⇒ పిల్లలు ఇలా ఉంటే... తల్లితండ్రులు, స్కూల్ టీచర్లు జోక్యం చేసుకోవాల్సిందే! ⇒ ఏదో కోల్పోయినట్లు, తరచూ విషాదంగా ఉండడం ⇒ ఎవరితోనూ కలవకుండా విడిగా ఉండడం ⇒ ఇంట్లోవాళ్ళ మీద గట్టిగా అరుస్తూ, గొడవపడడం ⇒ సరిగ్గా తిండి తినకపోవడం, నిద్రపోకపోవడం, దేని మీదా ఆసక్తి లేకపోవడం, అసహనంగా ఉండడం ⇒ బరువులో మార్పు రావడం, మాదకద్రవ్యాలకు అలవాటుపడడం, వ్యక్తిగత హానికి సైతం దిగడం పెద్దలూ! ఇలా మెలగండి! ⇒ రెబల్‌గా మారిన కౌమార వయసు పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? అయితే, ఇది మీ కోసమే... ⇒ పిల్లలకు ఆర్డర్లు పాస్ చేయకండి. దాని బదులు సమస్య చెప్పి, ప్రశాంతంగా పరిష్కారాలు సూచించండి. ⇒ వాళ్ళ గోడును ప్రశాంతంగా వినండి. అంతేతప్ప, తొందరపడి కఠినంగా కామెంట్లు చేయకండి. ⇒ పెద్దలు తమ మనసులో మాట చెప్పడం మొదలుపెడితే, పిల్లలు కూడా వాళ్ళ భావాల్ని పంచుకుంటారు. వాళ్ళ మీద నింద మోపడం కాకుండా, విషయం చెబుతున్నట్లు మాట్లాడండి. ⇒ పిల్లలకు ఛాయిస్‌లు ఇచ్చి, ఏదో ఒక రాజీ మార్గం కుదుర్చుకోండి. ⇒ మీ విలువల్ని, వాళ్ళ మీద మీకున్న అంచనాల్ని అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళను స్నేహితులలాగా చూసి, ఎప్పుడు అవసరమైనా గెడైన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. ⇒ పిల్లలు భావోద్వేగంతో ఏదో అన్నారనీ, చేశారనీ మీరు రెచ్చిపోకండి. సానుభూతితో వాళ్ళను అర్థం చేసుకోండి. ⇒ పిల్లలు లాజికల్‌గా ఆలోచించేలా ప్రోత్సహించండి. అన్నిటి కన్నా ముఖ్యంగా, వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించి, వాళ్ళకు ఇష్టమైన విషయాల్లో ప్రోత్సహించండి. మిగతా పిల్లలతో పోలికలు తేకండి. వాళ్ళను నిరుత్సాహపరచకండి. వాళ్ళ భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించనివ్వండి. ఇంటి పరిస్థితులూ కారణమే! ⇒ కౌమారంలో పిల్లలు తరచూ భావోద్వేగాలకు గురవుతుంటారు. హార్మోన్లపరంగా మార్పుతో పాటు చాలా సందర్భాల్లో ఇంటిలోని పరిస్థితులు కూడా వాళ్ళను అలా తయారు చేస్తాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ⇒ ఇంట్లో తల్లితండ్రుల మధ్య సఖ్యత లేకపోతే, ఆ ప్రభావం పిల్లల మీద కచ్చితంగా పడుతుంది. కౌమార వయసుకు వచ్చిన పిల్లల్లో అది స్పష్టంగా కనపడుతుంది. ⇒ తల్లికి దూరమైన పిల్లల్లో ఎమోషనల్‌గా ఒక అస్థిరత్వం వస్తుంది. బాల్యం నుంచి కౌమారంలోకి ఎదిగినప్పుడు అది బయటపడుతుంది. ⇒ తండ్రి గనక ఏదైనా వ్యసనానికి బానిస అయితే, అది కూడా తెలియకుండా పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. తండ్రి వ్యసనాల వల్ల ఇంట్లో బాధల్లో పెరిగిన పిల్లలు ఎడాలసెంట్ వయసులో పూర్తిగా మారిపోతారు. అయినదానికీ, కానిదానికీ ఇంట్లోవాళ్ళను ఎదిరించే స్వభావం పెరుగుతుంది. ⇒ ఒంటరిగా పెరిగే పిల్లల్లో, ఒక్కరే సంతానం కాబట్టి అతి గారాబంగా పెరిగే పిల్లల్లో కూడా ఈ ఇబ్బందులు ఎక్కువే. వీలైనంత వరకు నలుగురితో కలిసేలా, కలిసిమెలిసి ఉండేలా చూడడం వల్ల కొంత వరకు సమస్యను నివారించవచ్చు.