అమాయకత్వం మాయం? | Start edalasens | Sakshi
Sakshi News home page

అమాయకత్వం మాయం?

Published Sun, Sep 25 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

అమాయకత్వం మాయం?

అమాయకత్వం మాయం?

ఎడాలసెన్స్ ప్రారంభం
ఆ ప్రాయం చేసే పనులు విచిత్రం.  ఆ వయసే ఒక మాయ. ఒక మర్మం.  అప్పటి వరకు మాయామర్మం ఎరగని పిల్లలు  చిత్రంగా ఉండటం చూసి పేరెంట్స్ విభ్రాంతి చెందుతారు. వారి ప్రవర్తన పట్ల కాస్తంత బెంగపడతారు. ఆ ఏజ్‌లో కొత్తగా స్రవించే హార్మోన్ల మాయ అది.  ఆ ఈడు సమకూర్చే సరికొత్త అనుభవాల మర్మమది.  ఈ విషయాలను తెలుసుకుంటే తల్లిదండ్రులు  పిల్లల బిహేవియర్‌తో బెంగడాల్సిన అవసరం ఉండదు.  ఆ టైమ్‌లో టీనేజ్‌లో ఉండేవారి ట్రెండ్స్ పట్ల  తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించడం కోసం...  వారి ఆందోళనలు తొలగించడం కోసం...  టీనేజ్ పిల్లలకోసం ప్రత్యేకంగా క్లినిక్‌లు వస్తున్నాయంటూ భరోసా ఇవ్వడం కోసం ఫ్యామిలీ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
 
పదహారేళ్ళ సుష్మ ఒకప్పుడు బాగా చదివేది. ఇంట్లో అమ్మానాన్నల మాటకు ఎదురుచెప్పేదీ కాదు. కానీ, ఈ మధ్య పరిస్థితి క్రమంగా మారుతోంది. అప్పటి దాకా మంచి మార్కులు తెచ్చుకుంటున్న సుష్మకు పరీక్షల్లో గ్రేడ్ కూడా తగ్గుతోంది. బంధు మిత్రులెవరితో కలవనైనా కలవట్లేదు. అన్యమనస్కంగా ఉంటున్న కూతురి ప్రవర్తనలో, మాట తీరులో వచ్చిన మార్పు కన్నతల్లి సునీతకు అర్థమవుతోంది. నిన్నటి దాకా చంటిపాపలా ఉన్న కూతురు ఇప్పుడు ‘‘చాలా వేగంగా పెరిగి పెద్దది అవుతోంది’’ అనే భావన తల్లికి వచ్చేసింది.
 
పద్ధెనిమిదేళ్ళ ప్రవీణ్ తల్లితండ్రులది ఇలాంటి సమస్యే! చదువులో అప్పటి దాకా ఫస్ట్ ర్యాంకర్‌గా ఉన్న పిల్లాడు ఒక్కసారిగా వెనకబడ్డాడు. ఇంట్లో రెబల్‌లా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడూ తన గదిలోనే తలుపులు వేసుకొని, స్మార్ట్‌ఫోన్‌లో మాట్లాడుతూనో, కంప్యూటర్‌లో ఛాటింగ్ చేస్తూనో కాలం గడిపేస్తున్నాడు. అదేమని అడగబోతే, ‘మీకేం తెలుసు. నాకిష్టం లేని గ్రూప్‌లో ఇంజనీరింగ్‌లో పడేసి, నా జీవితం నాశనం చేశారు’ - జేవురించిన ముఖంతో, కోపంగా అరిచాడు. మనసు గాయపడ్డ ప్రవీణ్ అమ్మ కళ్ళలో సుడులు తిరుగుతున్న నీళ్లు.
 
అసలు ఏమిటీ సమస్య?
కౌమారం... కిశోరప్రాయం... ఇంగ్లీషులో చెప్పాలంటే ఎడాలసెన్స్... ఇప్పుడు పిల్లల తల్లితండ్రుల్ని భయపెడుతున్న దశ. అప్పటి దాకా బుద్ధిమంతులుగానే పెరిగిన పిల్లలు హార్మోన్లలో తేడాతో వచ్చిన శారీరక, మానసిక మార్పులతో... ఒక్కసారిగా రెబల్‌గా వ్యవహరించే ప్రమాదం ఉన్న దశ. ఇవాళ నూటికి తొంభై శాతం ఇళ్ళలో తల్లితండ్రులకు బెంగగా మారిన విషయం.
 
ప్రారంభమైన ప్రత్యేక క్లినిక్‌ల ట్రెండ్
పిల్లలూ, పెద్దలూ - రెండూ కాని సుష్మ, ప్రవీణ్ లాంటి వాళ్ళ మానసిక సంక్షోభానికి పరిష్కారం చూపించాలంటే ఎలా? కౌమార వయసువారి సైకాలజీని కూడా అధ్యయనం చేసిన ‘చైల్డ్ సైకియాట్రిస్ట్’ దగ్గరకు తీసుకువెళ్ళడం మినహా ఇప్పటి దాకా మరో దోవ లేదు. కానీ, ఇప్పుడిప్పుడే మారుతున్న ట్రెండ్ ఏమిటంటే, అటూ ఇటూ కాని ఈ 13 నుంచి 18 ఏళ్ళ లోపు వయసు వారి కోసం ఎడాలసెంట్ సైకియాట్రిక్ క్లినిక్‌లు శ్రీకారం చుట్టుకుంటున్నాయి! బెంగుళూరులోని సుప్రసిద్ధ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్’ (నిమ్‌హ్యాన్స్) పూర్తిగా ఈ వయసు వాళ్ళ కోసమే ఒక మానసిక చికిత్సాలయాన్ని ప్రారంభిస్తోంది.  

సైకాలజిస్ట్‌లు, స్కూల్ కౌన్సెలర్లు ఈ సరికొత్త ధోరణికి స్వాగతం పలుకుతున్నారు. కారణం ఒకటే - ఈ ఎడాలసెంట్ ఏజ్‌లో పిల్లల్లో మానసికంగా కలిగే ఆటుపోట్లు పెద్దయ్యాక కూడా వాళ్ళపై ప్రభావం చూపిస్తాయి. చివరకు వాళ్ళు జీవితంలో తీసుకొనే కీలక నిర్ణయాల మీద కూడా ముద్ర వేస్తాయి. అందుకే, ఈ హార్మోన్ల మార్పు వయసులోని పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ అవసరమని తాజా అధ్యయనాలు బల్లగుద్ది చెబుతున్నాయి.
    
ఆధునిక జీవనం తెచ్చిన అస్థిరత్వం
నిజానికి, కౌమార దశలో పిల్లల్లో ఎదురయ్యే మానసిక అస్థిరత్వం ఇవాళ కొత్తగా వచ్చినదేమీ కాదు. నేటి తల్లితండ్రులు కూడా నిన్నటి బాలలే కాబట్టి, వాళ్ళూ ఈ దశ దాటి వచ్చినవాళ్ళే! కాకపోతే, అప్పట్లో పిల్లల్లోని ఈ సమస్య పెద్దది కాకుండా, ఉమ్మడి కుటుంబంలోని బంధువుల ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు పనికొచ్చేవి. ఇంట్లోనే ఒకరు కాకపోతే మరొకరి మంచి మాటలతో పిల్లల ప్రవర్తనకు పగ్గాలు పడేవి. కానీ, ఆధునిక సాంకేతిక యుగంలోని ఇవాళ్టి పిల్లలు వేరు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు, రకరకాల టీవీ చానళ్ళు, వీడియో గేమ్‌లు అందుబాటులోకి రావడం, బయట సమాజంలో మార్కులు, ర్యాంకులు, ఫ్యాషన్ల ఒత్తిడితో పిల్లల ప్రవర్తన తీరే చాలా మారింది. పైగా, ఇవాళ అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే అయిపోయాక తల్లితండ్రులు తప్ప ఇంట్లో మంచీ చెడూ చెప్పే పెద్దవాళ్ళు, తోటి వయసువాళ్ళు లేకపోవడం పెద్ద ఇబ్బందిగా తయారైంది.
 
కొత్తగా రెక్కలొచ్చెనా...
అందుకే, ఇప్పుడు ఈ వయసు పిల్లల మీద పెద్దలు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం వచ్చింది. ఈ వయసులో పిల్లల్లో హార్మోన్ల పరంగా బోలెడన్ని మార్పులు జరుగుతాయి. అప్పటి దాకా శరీరం మీద పెద్దగా స్పృహ లేని వాళ్ళకు లైంగిక చైతన్యం కలుగుతుంది. శారీరకంగా కలిగే మార్పులు మానసికంగా కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. స్కూలు నుంచి కాలేజీకి ఎంటరై, చదువుల్లో, ఆ పైన జీవితంలో కీలకమైన మలుపులకు కారణమయ్యే వయసు అది. బాల్యం నుంచి యౌవనానికి మారే టైమ్ అది. అప్పటి దాకా ప్రతిదానికీ ఇంట్లో పెద్దల మీద ఆధారపడ్డవాళ్ళు కొత్తగా లభించిన స్వేచ్ఛతో బయట ప్రపంచంలో స్వతంత్రాన్ని అనుభవించాలని ఉవ్విళ్ళూరే దశ అది. గూటిలోని గువ్వ పిల్ల... కొత్తగా వచ్చిన పసి రెక్కలతో ఆకాశానికి ఎగరాలని తాపత్రయపడే తరుణం అది.
 
వీళ్ళొక ప్రత్యేక కేటగిరీ!
సాధారణంగా ఈ వయసు పిల్లలు తాము చేసేదంతా కరెక్ట్ అనుకుంటారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అందుకే వాళ్ళ మాటలు పెద్దల్ని ఎదిరించడంలా, రెబల్‌గా అనిపిస్తాయి. అదేమని తల్లితండ్రులు అంటే, తమని అందరూ అపార్థం చేసుకుంటున్నారని  పిల్లలు అనుకుంటారు. ఈ సమయంలో వాళ్లను సరిగ్గా అర్థం చేసుకొని, అనునయించి సరైన మార్గంలో పెట్టకపోతే, వాళ్ళు సరిగ్గా తిండి తినరు. డిప్రెషన్‌లోకి జారిపోతారు. స్కిజోఫ్రెనియాతో బాధపడతారు. ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్‌లో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సెన్సైస్’కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న వైద్యనిపుణుడు స్వయంగా ఈ సంగతులు వివరించారు.
 
ఇంట్లో పెద్దలు... స్కూల్‌లో టీచర్లు...
ఆ వయసు పిల్లలకు మంచీ చెడూ చెప్పడం తప్పనిసరి. వారికి దిశా నిర్దేశం చేయాలి. అలాగే, ఆ వయసులో వారికి వచ్చే శారీరక, మానసిక సందేహాలకు సమాధానాలు చెప్పి, సమస్యల్ని వారే ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలి. కానీ, చాలా సందర్భాల్లో పిల్లలు తమ మనసులో మాట బయటపెట్టడానికి సిగ్గుపడతారు. అలాంటప్పుడు వాళ్ళను అనునయించి, విషయం కనుక్కొని, సరైన దోవలో పెట్టాలి. ఈ విషయంలో విద్యాలయాల్లో అధ్యాపకుల పాత్ర కూడా చాలానే ఉంటుంది. శరీరంలో వస్తున్న మార్పుల గురించి పిల్లలకు అవగాహన కలిగించాలి. అదే సమయంలో లైంగిక విజ్ఞానంతో పాటు చెడుదారులు పడితే వచ్చే ముప్పు గురించీ చెప్పాలి. మాదక ద్రవ్యాల లాంటి చెడు అలవాట్ల వల్లకలిగే దుష్ఫలితాల్ని వివరించాలి.
 
పిల్లలు, పెద్దలు కాకుండా ఈ కౌమార వయస్కుల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలని ‘నిమ్‌హ్యాన్స్’ లాంటి  సంస్థలూ భావిస్తున్నాయి. అందుకే! వీళ్ళ కోసం ప్రత్యేకంగా  చికిత్సకు సన్నద్ధమవుతున్నాయి. తల్లితండ్రులు కూడా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని, వాళ్ళతో స్నేహితులలాగా, సమవయస్కుల లాగా ప్రవర్తించాలి. పెద్దలు తమ మనసులో మాట వింటున్నారన్న భావన వస్తే చాలు... ఈ వయసు పిల్లలకూ, పెద్దలకూ మధ్య మంచీ చెడూ మాట్లాడుకొనే మార్గం ఏర్పడుతుంది. పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ, అవసరాన్ని బట్టి ‘ఎడాలసెంట్ సైకియాట్రిస్ట్’ను సంప్రతించాలి.

కీలకమైన ఈ వయసులో సరైన టైమ్‌కి, సరైన తోడ్పాటు అందిస్తే... అదే మనం మన పిల్లలకు ఇచ్చే అతి పెద్ద ఎడ్యుకేషన్. గిఫ్ట్ కూడా! ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూనో, ముభావంగానో ఉన్న తెలిసీ తెలియని వయసు పిల్లల్ని మానసిక ఉద్వేగాల్ని అదుపు చేసుకున్న అందమైన యువతీ యువకులుగా తీర్చిదిద్దడాన్ని మించి ఏ తల్లితండ్రులైనా, గురువులైనా కోరుకునేది ఏముంటుంది!
 - రెంటాల
 
ప్రతి ఆరుగురిలో ఒకరున్నారు!
సాధారణంగా 13 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసు పిల్లల్ని కౌమార వయస్కులు అంటారు. ఇవాళ ప్రపంచంలో దాదాపు 120 కోట్ల మందికి పైగా ఈ కౌమార వయసు పిల్లలు ఉన్నారని లెక్క. మరో మాటలో చెప్పాలంటే, ప్రతి ఆరుగురిలో ఒకరు ఎడాలసెంట్ అన్నమాట! ఇక, మన భారతదేశ జనాభాలో 21 శాతం మంది దాకా (దాదాపు 25 కోట్ల మంది) ఈ వయసు పిల్లలే. అటు పూర్తిగా పిల్లలూ కాక, ఇటు పూర్తిగా యౌవనప్రాయులూ కాకుండా మధ్య వయసులో ఉండే చిత్రమైన దశ ఇది. బాల్యం నుంచి కౌమారానికి వచ్చే ఈ ఎదిగే వయసు పిల్లలకు తమలో శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పుల గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఈ కౌమార సమస్యల గురించి సరైన సమాచారం లేకపోవడం, సరైన గెడైన్స్ లేకపోవడం, తల్లితండ్రులు ఈ సమస్యను సరిగ్గా గుర్తించకపోవడం, పిల్లల్లో వచ్చిన మార్పును ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం ఇబ్బందిగా మారుతోంది.
 
ఈ వయసు తెచ్చే సమస్యలు!
కిశోరప్రాయంలోని పిల్లలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో కొన్ని ఇవీ...
లైంగికపరంగా తెలియని సిగ్గు, అపరాధభావన
ఒంటి రంగు, అందం గురించి నిరాశా నిస్పృహలు
దుస్తులు, ఫ్యాషన్ల పట్ల పేరుకుపోయిన తప్పుడు అభిప్రాయాలు
స్నేహం, కలసి తిరగడం పట్ల ఉన్న తప్పుడు భావాలు. ఆడామగల్లో ఉండే పరస్పర ఆకర్షణ
మిగతావాళ్ళతో పోలిస్తే తనకు తెలివితేటలు తక్కువనే అనుమానం.
పరీక్షలంటే భయం. ఎక్కడ మార్కులు తక్కువొచ్చి, అనుకున్న ర్యాంక్ రాదోనని ఆందోళన.
భవిష్యత్ కెరీర్ గురించి భయాందోళనలు
ప్రతిదానికీ కుంగిపోతూ, ఆత్మహత్య వైపు మనసు లాగడం
 
మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా?

పిల్లలు ఇలా ఉంటే... తల్లితండ్రులు, స్కూల్ టీచర్లు జోక్యం చేసుకోవాల్సిందే!
ఏదో కోల్పోయినట్లు, తరచూ విషాదంగా ఉండడం
ఎవరితోనూ కలవకుండా విడిగా ఉండడం
ఇంట్లోవాళ్ళ మీద గట్టిగా అరుస్తూ, గొడవపడడం
సరిగ్గా తిండి తినకపోవడం, నిద్రపోకపోవడం, దేని మీదా ఆసక్తి లేకపోవడం, అసహనంగా ఉండడం
బరువులో మార్పు రావడం, మాదకద్రవ్యాలకు అలవాటుపడడం, వ్యక్తిగత హానికి సైతం దిగడం
 
పెద్దలూ! ఇలా మెలగండి!
రెబల్‌గా మారిన కౌమార వయసు పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? అయితే, ఇది మీ కోసమే...
పిల్లలకు ఆర్డర్లు పాస్ చేయకండి. దాని బదులు సమస్య చెప్పి, ప్రశాంతంగా పరిష్కారాలు సూచించండి.
వాళ్ళ గోడును ప్రశాంతంగా వినండి. అంతేతప్ప, తొందరపడి కఠినంగా కామెంట్లు చేయకండి.
పెద్దలు తమ మనసులో మాట చెప్పడం మొదలుపెడితే, పిల్లలు కూడా వాళ్ళ భావాల్ని పంచుకుంటారు. వాళ్ళ మీద నింద మోపడం కాకుండా, విషయం చెబుతున్నట్లు మాట్లాడండి.
పిల్లలకు ఛాయిస్‌లు ఇచ్చి, ఏదో ఒక రాజీ మార్గం కుదుర్చుకోండి.
మీ విలువల్ని, వాళ్ళ మీద మీకున్న అంచనాల్ని అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళను స్నేహితులలాగా చూసి, ఎప్పుడు అవసరమైనా గెడైన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి.
పిల్లలు భావోద్వేగంతో ఏదో అన్నారనీ, చేశారనీ మీరు రెచ్చిపోకండి. సానుభూతితో వాళ్ళను అర్థం చేసుకోండి.
పిల్లలు లాజికల్‌గా ఆలోచించేలా ప్రోత్సహించండి. అన్నిటి కన్నా ముఖ్యంగా, వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించి, వాళ్ళకు ఇష్టమైన విషయాల్లో ప్రోత్సహించండి. మిగతా పిల్లలతో పోలికలు తేకండి. వాళ్ళను నిరుత్సాహపరచకండి. వాళ్ళ భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించనివ్వండి.
 
ఇంటి పరిస్థితులూ కారణమే!
కౌమారంలో పిల్లలు తరచూ భావోద్వేగాలకు గురవుతుంటారు. హార్మోన్లపరంగా మార్పుతో పాటు చాలా సందర్భాల్లో ఇంటిలోని పరిస్థితులు కూడా వాళ్ళను అలా తయారు చేస్తాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.
ఇంట్లో తల్లితండ్రుల మధ్య సఖ్యత లేకపోతే, ఆ ప్రభావం పిల్లల మీద కచ్చితంగా పడుతుంది. కౌమార వయసుకు వచ్చిన పిల్లల్లో అది స్పష్టంగా కనపడుతుంది.
తల్లికి దూరమైన పిల్లల్లో ఎమోషనల్‌గా ఒక అస్థిరత్వం వస్తుంది. బాల్యం నుంచి కౌమారంలోకి ఎదిగినప్పుడు అది బయటపడుతుంది.
తండ్రి గనక ఏదైనా వ్యసనానికి బానిస అయితే, అది కూడా తెలియకుండా పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. తండ్రి వ్యసనాల వల్ల ఇంట్లో బాధల్లో పెరిగిన పిల్లలు ఎడాలసెంట్ వయసులో పూర్తిగా మారిపోతారు. అయినదానికీ, కానిదానికీ ఇంట్లోవాళ్ళను ఎదిరించే స్వభావం పెరుగుతుంది.
ఒంటరిగా పెరిగే పిల్లల్లో, ఒక్కరే సంతానం కాబట్టి అతి గారాబంగా పెరిగే పిల్లల్లో కూడా ఈ ఇబ్బందులు ఎక్కువే. వీలైనంత వరకు నలుగురితో కలిసేలా, కలిసిమెలిసి ఉండేలా చూడడం వల్ల కొంత వరకు సమస్యను నివారించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement