Punyasnanalu
-
నీట మునిగి ఏడుగురు మృత్యువాత
పెదపూడి/అడ్డతీగల/వినుకొండ/వెంకటగిరి రూరల్: తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు దుర్ఘటనల్లో నీట మునిగి ఏడుగురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపరలో శివరాత్రి సందర్భంగా ఇద్దరు యువకులు కాలువలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునిగి మృతి చెందారు. కరప గ్రామానికి చెందిన పేపకాయల అజయ్ (19), గొల్లపల్లి యశ్వంత్ (20) శహపురానికి చెందిన కరెడ్ల మణికంఠ స్నేహితులు. ఈ ముగ్గురూ మరికొందరితో కలిసి ముక్తేశ్వరస్వామి ఆలయ సమీపాన గల తుల్యభాగ నదీపాయ కాలువలో మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రవాహ ఉధృతికి అజయ్, యశ్వంత్ నీట మునగ్గా.. మణికంఠ అదృష్టవశాత్తూ పైకి తేలి ఒడ్డుకు చేరుకున్నాడు. స్థానికులు కాలువలోకి దూకి కొనఊపిరితో ఉన్న యశ్వంత్‌ను బయటకు తీసి పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే యశ్వంత్ మృతి చెందగా.. మరికొంత సేపటికి అజయ్ మృతదేహం బయటపడినట్లు పెదపూడి ఎస్ఐ పి.వాసు తెలిపారు. ఇలా ఉండగా, అడ్డతీగల శివారున మద్దిగెడ్డ జలాశయం ప్రధాన పంట కాలువలో పడి మరో ఇద్దరు మృతి చెందారు. అడ్డతీగల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బవురువాక గ్రామానికి చెందిన చెదల కల్యాణ్రామిరెడ్డి, 8వ తరగతి విద్యార్థి జనుమూరి సాయిరామ్ వీరేంద్రరెడ్డి మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, శివరాత్రి సందర్భంగా దైవదర్శనం చేసుకునేందుకు వెళ్లిన మాతంగి ప్రతాప్ (16), సర్వేపల్లి బాలాజీ (12) తెలుగు గంగ కాలువలో పడి గల్లంతయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జంగాలపల్లి తెలుగుగంగ కాలువ బ్రిడ్జి వద్ద మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట దళితవాడకు చెందిన మాతంగి ప్రతాప్ ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు, అదే ప్రాంతానికి చెందిన సర్వేపల్లి బాలాజీ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. శివరాత్రి సందర్భంగా బంగారుపేట సమీపంలో ఉన్న జంగాలపల్లి వీరభద్రయ్యస్వామి ఆలయానికని మంగళవారం ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. ఆలయ సమీపంలోని తెలుగు గంగ కాలువ బ్రిడ్జి వద్ద కాలువలో ఈత కొట్టేందుకు దిగి నీటి ఉధృతికి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు చీకటి పడే వరకు గాలించినా ఫలితం దక్కలేదు. పండుగపూట విషాద ఘటనలు చోటుచేసుకోవడంతో ఆ కుటుంబాల్లో అంతులేని శోకం మిగిలింది. సరదాగా గడిపేందుకు వచ్చి.. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో స్నానానికి దిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వినుకొండకు చెందిన డ్రైవర్ మున్నీరు ఇంట్లో శుభకార్యానికి నరసరావుపేటకు చెందిన బంధువులు ఫైజుల్లాఖాన్, విజయవాడకు చెందిన ఆయేషా వచ్చారు. వీరితో కలిసి మున్నీరు కుటుంబం సరదాగా గుండ్లకమ్మ నది వద్దకు వెళ్లింది. అందరూ బ్రిడ్జి కింద కూర్చుని ఉండగా మున్నీరు కుమార్తె హీనా (19)తోపాటు ఎస్కే ఫైజుల్లాఖాన్ (17), ఆయేషా (19) స్నానానికని నదిలోకి దిగారు. లోతు అంచనా వేయలేకపోవడంతో ముగ్గురూ మునిగిపోయి మృత్యువాత పడ్డారు. వినుకొండ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
కుంభమేళాలో యూపీ కేబినెట్ భేటీ
అలహాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా దాదాపు ఆయన మంత్రివర్గం మంగళవారం కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కుంభమేళా వద్దే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో పాటు మంత్రులు, సాధువులు కూడా ఈ పుణ్యతిథి సందర్భంగా స్నానాలు ఆచరించారు. కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు నిర్ణయాలను ఆమోదించింది. అలహాబాద్ నుంచి (ప్రస్తుత పేరు ప్రయాగ్‌రాజ్) పశ్చిమ యూపీని కలిపే 600 కి.మీ. గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ఆమోద ముద్ర వేసింది. దీనికోసం రూ.36 వేల కోట్లను కేటాయించనుంది. ప్రపంచంలోనే ఇది పొడవైన రహదారిగా చెబుతున్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకే కాకుండా, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే కోసం ఇప్పటికే ప్రతిపాదించిన మేరకు తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చించారు. -
ఐదో రోజూ భక్తుల హోరు
దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు * పుష్కర ఘాట్లలో తగ్గుతున్న నీటిమట్టం * జూరాల ఘాట్‌కు భక్తులను అనుమతించని పోలీసులు * నల్లగొండలో ఇంద్రకరణ్, జగదీశ్‌రెడ్డి విహంగ వీక్షణం * వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సతీమణి, * పార్టీ ఎంపీ రేణుక పుణ్యస్నానాలు సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఐదో రోజు మంగళవారం కూడా జనప్రవాహం కొనసాగింది. అయితే పుష్కర ఘాట్లలో నీటిమట్టం తగ్గుతుండటంతో భక్తుల సంఖ్య కూడా కాస్త తగ్గింది. వీటితోపాటు పలు పుష్కరఘాట్లలో నీటిమట్టం సైతం తగ్గింది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 7,80,415, నల్లగొండ ఘాట్లలో 2 లక్షల పై చిలుకు స్నానాలు చేశారన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద నీరు తగ్గడంతో ప్రాజెక్టునుంచి నీటి విడుదలను కట్టడి చేశారు. జూరాల ఘాట్‌కు వచ్చిన భక్తులను మరో ప్రాంతానికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పోలీసు అమర వీరులకు వారి కుటుంబాల సమక్షంలో ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలో పిండ ప్రదానం చేశారు. మంత్రులు మహేందర్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో, లక్ష్మారెడ్డి గొందిమళ్లలో పుష్కర స్నానం చేశారు. గొందిమళ్ల ఘాట్‌లో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించారు. పార్టీ ఎంపీ బుట్టా రేణుక కూడా పుష్కర స్నానం చేశారు. ఇక వరుస సెలవులు ముగియడంతో నల్లగొండ జిల్లాలో ఐదో రోజు భక్తులు తగ్గారు. మూడు ప్రధాన ఘాట్లు మినహా మిగతావన్నీ వెలవెలబోయాయి. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పలు ఘాట్లను రోడ్డు, ఆకాశమార్గాన పరిశీలించారు. 20న గవర్నర్ నరసింహన్ మట్టపల్లిలో పుష్కర స్నానం చేస్తారని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో ఆది, సోమవారాల్లో నిబంధనలు సడలించిన పోలీసులు మంగళవారం మళ్లీ కఠినతరం చేయడంతో కిలోమీటర్ల కొద్దీ నడవలేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలకపోవడంతో వారు సాగర్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నేడు వైఎస్‌కు పిండ ప్రదానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ నియోజకవర్గం మంచాలకట్ట పుష్కరఘాట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు బుధవారం పిండ ప్రదానం చేయనున్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు రాం భూపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు.