ఐదో రోజూ భక్తుల హోరు
దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు
* పుష్కర ఘాట్లలో తగ్గుతున్న నీటిమట్టం
* జూరాల ఘాట్‌కు భక్తులను అనుమతించని పోలీసులు
* నల్లగొండలో ఇంద్రకరణ్, జగదీశ్‌రెడ్డి విహంగ వీక్షణం
* వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సతీమణి,
* పార్టీ ఎంపీ రేణుక పుణ్యస్నానాలు
సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఐదో రోజు మంగళవారం కూడా జనప్రవాహం కొనసాగింది. అయితే పుష్కర ఘాట్లలో నీటిమట్టం తగ్గుతుండటంతో భక్తుల సంఖ్య కూడా కాస్త తగ్గింది.
వీటితోపాటు పలు పుష్కరఘాట్లలో నీటిమట్టం సైతం తగ్గింది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 7,80,415, నల్లగొండ ఘాట్లలో 2 లక్షల పై చిలుకు స్నానాలు చేశారన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద నీరు తగ్గడంతో ప్రాజెక్టునుంచి నీటి విడుదలను కట్టడి చేశారు. జూరాల ఘాట్‌కు వచ్చిన భక్తులను మరో ప్రాంతానికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పోలీసు అమర వీరులకు వారి కుటుంబాల సమక్షంలో ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలో పిండ ప్రదానం చేశారు.
మంత్రులు మహేందర్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో, లక్ష్మారెడ్డి గొందిమళ్లలో పుష్కర స్నానం చేశారు. గొందిమళ్ల ఘాట్‌లో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించారు. పార్టీ ఎంపీ బుట్టా రేణుక కూడా పుష్కర స్నానం చేశారు. ఇక వరుస సెలవులు ముగియడంతో నల్లగొండ జిల్లాలో ఐదో రోజు భక్తులు తగ్గారు. మూడు ప్రధాన ఘాట్లు మినహా మిగతావన్నీ వెలవెలబోయాయి. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పలు ఘాట్లను రోడ్డు, ఆకాశమార్గాన పరిశీలించారు. 20న గవర్నర్ నరసింహన్ మట్టపల్లిలో పుష్కర స్నానం చేస్తారని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
నాగార్జునసాగర్‌లో ఆది, సోమవారాల్లో నిబంధనలు సడలించిన పోలీసులు మంగళవారం మళ్లీ కఠినతరం చేయడంతో కిలోమీటర్ల కొద్దీ నడవలేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలకపోవడంతో వారు సాగర్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
నేడు వైఎస్‌కు పిండ ప్రదానం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ నియోజకవర్గం మంచాలకట్ట పుష్కరఘాట్ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు బుధవారం పిండ ప్రదానం చేయనున్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు రాం భూపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు.