పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానది పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. ఆయన దుర్గగుడి, కృష్ణవేణి పుష్కర ఘాట్లను సందర్శించి పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానదిలో బ్యారేజ్ దగ్గర నీటిమట్టం స్థాయిలపై ఆరా తీశారు.
ముఖ్యమంత్రి అంతకు ముందు గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్ను సందర్శించారు. ఈ సందర్భంగా సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై సంజాయిషీ చెప్పాలని హుకుం జారీ చేశారు. ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా అరెస్ట్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ కృష్ణా పుష్కరాలు చరిత్రాత్మకమైనవి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి నిర్వహిస్తోంది. ఎంతో విశ్వాసంతో పనులు అప్పగిస్తే చేసిన పనులు ఇవేనా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన గుంటూరు కృష్ణా జిల్లాలలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను రెండుగంటలకు పైగా కలియదిరిగి ఆసాంతం పరిశీలించారు.
‘నేనెంతో కష్టపడి నిమిష నిమిషం ఎక్కడ ఉన్నా పుష్కరాల పనులను సమీక్షిస్తున్నాను’ అని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని వివరణ ఇవ్వటంతో ఇవ్వటంతో ముఖ్యమంత్రి శాంతించారు. పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలించారు. పుష్కరాల నాటికి ఫ్లయ్ ఓవర్ కింద రహదారి రెండులైన్లయినా అందుబాటులోకి రావాలన్నారు.కృష్ణవేణి ఘాట్‌లో మెట్లపై నీరు నిలిచి వుండటాన్ని గమనించి అధికారులను వివరణ అడిగారు. నెలాఖరుకల్లా పనులు పూర్తిచేయటానికి పనుల వేగం పెంచాలని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్, డిజి గౌతం సవాంగ్ లు ఉన్నారు.