రాష్ట్రంలోనే కర్నూలు భేష్‌ | kurnool is best in ap | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోనే కర్నూలు భేష్‌

Published Mon, Aug 22 2016 10:47 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

రాష్ట్రంలోనే కర్నూలు భేష్‌ - Sakshi

రాష్ట్రంలోనే కర్నూలు భేష్‌

కృష్ణా పుష్కర ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మెచ్చుకోలు
– శ్రీశైలాన్ని మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని వెల్లడి
– హైదరాబాద్‌ నుంచి నేరుగా హెలికాప్టర్‌ సర్వీసు ప్రారంభం
– పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల విషయంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబునిచ్చారు. పుష్కర భక్తుల నుంచి తీసుకున్న అభిప్రాయ సేకరణతో పాటు నేరుగా ఫోన్‌లో మాట్లాడి కూడా అభిప్రాయాలను సేకరించామన్నారు. మొత్తం 93 శాతం మార్కులతో కర్నూలు జిల్లా మొదటిస్థానంలో నిలిచిందన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా సేవా కార్యక్రమాలతో ఏకంగా 95 శాతం మార్కులతో అగ్రభాగాన నిలిచిందని కొనియాడారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా నేరుగా సున్నిపెంటకు చేరుకుని అక్కడి నుంచి లింగాలగట్టు ఘాట్‌ను  సందర్శించారు. అక్కడ నదిలో నీటిని నెత్తిపై చల్లుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. చక్కటి వాతావరణంలో ఉన్న శ్రీశైలాన్ని మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానన్నారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి నేరుగా హెలికాప్టర్‌ సర్వీసును కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
 
మల్లన్న పవర్‌ఫుల్‌ గాడ్‌
ఒక పక్క నీళ్లు.. ఇంకో పక్క బ్రహ్మాండమైన పచ్చదనం ఉన్న శ్రీశైలంలోని మల్లన్న పవర్‌ఫుల్‌ గాడ్‌ అని సీఎం అన్నారు. అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్‌.. మరోవైపు నూతన రాజధాని అమరావతికి మధ్యలో శ్రీశైలం కేంద్ర బిందువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో చాలా మంది ఇక్కడకు వస్తున్నారన్నారు. ఒక మంచి పుణ్యక్షేత్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా తయారుచేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టండి
ప్రస్తుతం ప్రతి యువత చేతిలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం తన ప్రసంగాన్ని కూడా కొద్ది మంది స్మార్ట్‌ఫోన్లలో రికార్డు చేస్తున్నారని.. వీటిని సోషల్‌ మీడియాలో పెట్టాలని కోరారు. తద్వారా కృష్ణా పుష్కరాలను మరింత మందికి చేరవేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నీరు ఉంటే ఎలాంటి సమస్యలు రావని.. అందుకే అందరూ వచ్చి కరువు సమస్య లేకుండా చూడాలని పుష్కర స్నానం చేస్తూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఇటువంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని.. అందుకే పంట కుంటలను తవ్వుకోమన్నామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని.. ఎక్కువ సమస్యలు, ఎక్కువ బాధలు ఉంటే ఇంకా ఎక్కువ కష్టపడతానన్నారు. ఈ సమస్యలు తీరేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని కోరారు. 
 
జిల్లా పోలీసులు భేష్‌
కృష్ణా పుష్కరాలను జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా సమర్థవంతంగా నిర్వహించారని సీఎం కితాబునిచ్చారు. ప్రధానంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కేవలం పోలీసులు అంటే ఖాకీ డ్రస్‌ వేసుకోవడం కాదని.. సేవ కూడా చేయడమని నిరూపించారన్నారు. నూటికి 95 శాతం మంది ప్రజలు పోలీసు యంత్రాంగాన్ని మెచ్చుకున్నారన్నారు. ముసలివాళ్లు వస్తే సహాయం చేయడం, కాళ్లు లేనివాళ్లను ఘాట్ల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించడం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని కొనియాడారు. ఇది నిజమైన మానవత్వమని కొనియాడారు. మనిషిని చూస్తేనే కాదు.. అతని వాయిస్‌ను విని కూడా దొంగలను పట్టుకునే టెక్నాలజీ వచ్చిందన్నారు. శ్రీశైలం నుంచి మొత్తం సమాచారం తనకు వస్తుందని.. అక్కడి నుంచి ఇక్కడ పుష్కరాల తీరును గమనిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్‌ రెడ్డి, భూమా నాగిరెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement