శిశుపాలుడిలా వంద తప్పులు చేస్తున్నారు: వైఎస్ జగన్
శిశుపాలుడు చేస్తున్నట్లుగా చంద్రబాబు వంద తప్పులు చేస్తున్నారని.. ఆయన పాపాలను దేవుడు క్షమించడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పుష్కర స్నానం చేస్తూ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, గోదావరి పుష్కరాల సందర్భంగా మృతుల కుటుంబాలకు చెల్లించినట్లే ఇక్కడ కూడా రూ. 20 లక్షలు చెల్లించాలని ఆయన అన్నారు. తాను వస్తున్నాననే విషయం తెలిసి హడావుడిగా రూ. 3 లక్షల పోస్ట్ డేటెడ్ చెక్కులను ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని.. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని చెప్పారు. అందుకోసం తాను ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. విద్యార్థుల మరణాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పుష్కరఘాట్‌లో స్నానాలకు వారు వెళ్తే ఈతకు వెళ్లారంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఏటూరు పుష్కరఘాట్‌కు ఇదే దారి అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, ప్రతిరోజూ అక్కడ ఆహార పొట్లాలు కూడా అందిస్తున్నారని, అలాంటప్పుడు ఘాట్ వద్ద ప్రమాదకర ప్రాంతాలలో ఎందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయలేదని జగన్ ప్రశ్నించారు. పుష్కరాల్లో స్నానాలు చేయకపోతే పాపాత్ములన్న రీతిలో చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, పుష్కర ఏర్పాట్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని, ఈ మరణాలకు చంద్రబాబు సర్కారు ఏం సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు. ఇసుక మాఫియాను ప్రోత్సహించిన చంద్రబాబు వల్లే ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారని, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.