పుష్కరాలను చంద్రబాబే తీసుకొస్తున్నారా?
హైదరాబాద్: 'నదుల్లో 12 ఏళ్లకు ఒకసారి సహజంగానే వచ్చే పుష్కరాలను స్వయంగా తానే తీసుకొస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. నదిలోకి పుష్కరుణ్ని సైతం ఆయనే ఆహ్వానిస్తారేమో!' అని ఏపీ ముఖ్యమంత్రి తీరును ఎద్దేవా చేశారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. పుష్కరాల పిలుపు పేరుతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేశారని ఆయన విమర్శించారు.
శుక్రవారం వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. 'రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనను పొగిడినట్లు చంద్రబాబు నాయుడు పలు పత్రికల్లో వార్తలు వేయించుకున్నారు. నిజంగా అంత పలుకుబడే ఉంటే రాష్ట్రప్రయోజనాల కోసం ఎందుకు గట్టిగా అడగరు?' అని నిలదీశారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్ల 30 మంది బలైపోయారని, నాటి ఘటనపై ఏర్పాటయిన సోమయాజులు కమిటీ ఇంతవరకు ముఖ్యమంత్రిని విచారించలేదని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాల విషయంలోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఆ పిచ్చి మానుకొని, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని హితవు పలికారు.