స్వచ్ఛ భారత్ పునాదిరాళ్లు..!
రోడ్లు ఊడ్వటం, ఆఫీసుల్లో కాగితాలు, కప్పులు చెత్తబుట్టల్లో వేయడం చాలా సులువైన పనులు. కానీ నిత్యం మురికిలో మునిగితేలుతూ, మన దేశాన్ని నిత్య ‘స్వచ్ఛ భారత్’గా చేసేందుకు కొన్ని తరాలు తమ జీవితాలనే అర్పించిన విషయాన్ని మనం గుర్తుంచుకోకపోతే స్వచ్ఛ భారత్‌లోని స్వచ్ఛతపైనే అనుమానం కలుగుతుంది.ఎవరి శ్రమతో, ఎవరి చాకిరితో ఈ సమాజం ఇంత పరిశుభ్రంగా ఉందో ఆ పారిశుధ్య కార్మికులు.. జనం విసర్జించిన మల, మూత్రాలలో మునిగి పనిచేస్తుంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నామో అర్థం కావడం లేదు.
‘‘పరిసరాల్లో ఉన్న చెత్త, చెదారాన్ని, మురికిని తొల గించి, భారతమాతకు సేవచేస్తాను. ప్రతివారం రెండు గం టల చొప్పున సంవత్సరం మొత్తం వంద గంటలు పరిస రాలు పరిశుభ్రంగా ఉంచడం కోసం కృషి చేసి, చరిత్రలో నిలిచిపోతాను’’ అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలం దరితో ప్రత్యేకించి ఉద్యోగులు, విద్యావంతులు, ఇతర ఆలోచనాపరులందరితో ప్రమాణం చేయించారు. పరిస రాలు పరిశుభ్రంగా ఉంచడం వల్ల స్వచ్ఛ భారత్‌ను నిర్మిం చడానికి ఆయన సంకల్పించడం ఆహ్వానించదగిందే. అటువంటి వాతావరణం కోసం చేస్తున్న కృషి అభినం దించదగిందే.
చరిత్ర వర్తమానాన్ని హెచ్చరిస్తుంది. వర్తమానం భవిష్యత్తుకి మార్గనిర్దేశం చేస్తుంది. గత అనుభవాలపై ఆధారపడి మనం పనిచేయాలి. గతంలో స్వచ్ఛ భారత్ లాంటి ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా? జరిగితే దాని ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను చరిత్ర నుంచి నేర్చుకోవాలి. అదే సమయంలో దీని పరిణామాలు భవిష్యత్ పైన ఎట్లా ఉంటాయో కూడా అంచనా వేసు కోవాలి. అప్పుడు వర్తమానంలో మనం నిర్వర్తించే పని సక్రమమైన మార్గంలో పయనించే అవకాశం ఉంటుంది.
1930, 31 సంవత్సరాలలో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం జరిగిన పరిణామాల నేప థ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మాగాంధీల మధ్య కుదిరిన పూనా ఒప్పందంతో భారతదేశంలో ‘అంట రాని’ కులాల స్థితిగతులపై చర్చ ప్రారంభమైంది. ఆ పరిస్థి తులలో గాంధీ హరిజనులను ఉద్ధరించడానికి హరిజన సేవక్ సంఘ్‌ను 1932లో స్థాపించారు. హరిజనులు చేసే అనేక రకాలైన పనులను ముఖ్యంగా రోడ్లను శుభ్రపర చడమనే కర్తవ్యాన్ని సమాజం అంతా స్వీకరించాలని ఉద్య మం ప్రారంభించారు. కానీ అది ఒక ప్రచార కార్యక్ర మంగా మాత్రమే మిగిలిపోయింది. చివరకు ఆగిపో యింది. ఈ విషయమై గాంధీజీ తన జీవితమంతా ప్రయ త్నించారు. కానీ ఆయన చాలా నామమాత్రపు ఫలితాన్ని సాధించారు. మళ్లీ ఒక 60 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం గతంలో అనుకున్న ఫలితాలను సాధించలేక పోవడానికి ఉన్న కారణాలేమిటి?
భారతదేశంలో ప్రతి వృత్తికి ఒక కులం, ప్రతి కులా నికి ఒక వృత్తి ఉన్నది. వృత్తిని బట్టి కులానికి, కులాన్ని బట్టి వృత్తికి గౌరవం, అగౌరవం నిర్ణయించబడుతున్నాయి. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఏర్పడాలంటే మురికి కొట్టు కుపోయిన మన ఆలోచనల మలినాన్ని మొదట వదిలిం చుకోవాలి. ఆ మురికిని వదలగొట్టడమంటే మలినాన్ని తొలగించే వృత్తిని, మురికిని నెత్తిన మోసే మనిషిని ప్రేమించాలి. మురికి మనిషిని గౌరవించే మనస్తత్వం మన సంస్కృతిలో లేదు. పైగా సమాజంలోని మురికిని వదల గొట్టే మనుషులను సమాజం నుంచి వెలివేసే గొప్ప ‘స్వచ్ఛత’ గుణం మనకు తరతరాలుగా అందివస్తున్నది. అయితే ఇప్పటికీ ఎంతో కొంత స్వచ్ఛత, పరిశుభ్రత మన పరిసరాల్లో మనకు లభించింది. అయితే అది మనవలన కాదు. శతాబ్దాలుగా ఈ సమాజం అసహ్యించుకున్న, సమాజం ఈసడింపునకు గురై, చీదరింపులను, చీత్కారా లను మోస్తూ భరిస్తున్న నూటికి పాతిక శాతం జనాభా వల్ల అది సాధ్యమవుతున్న విషయాన్ని మనం అంగీక రించక తప్పదు.
గ్రామాల్లో పశువులు మరణిస్తే ముట్టుకోవడానికి చా లా కులాలు అంగీకరించవు. కేవలం మాదిగ కులం వాళ్లు మాత్రమే వాటిని అక్కడినుంచి తొలగించి ఆ దుర్గంధాన్ని మోసుకెళ్లి, ఊరవతల వాటిని కోసి తోలు తీసి మురికిని దూరం చేస్తారు. ఒకవేళ మాదిగలు దాన్ని తొలగించకపోతే ఊరు ఊరంతా దుర్గంధంతో మునిగి రోగాలు వ్యాపించి మనుషుల ప్రాణాలే పోతాయి. అటువంటి పెను ప్రమా దం నుంచి మనల్ని రక్షించి పశువులను తొలగించి ‘స్వచ్ఛ త‘ను పంచడమే కాదు, ఆ తోలును శుభ్రంచేసి దాని ద్వారా దాదాపు పద్దెనిమిది వృత్తులకు పరికరాలు అందిం చి, వ్యవసాయంతో పాటు మరెన్నో వృత్తులను వృద్ధి చేసే విధంగా వాళ్లు తమ జీవితాలను ధారబోశారు.
అదే విధంగా వందల ఏళ్లుగా ముఖ్యంగా పట్టణాలు ఏర్పడ్డ తర్వాత డ్రైనేజీ సౌకర్యం లేని కాలం నుంచి చేతితో మలం ఎత్తి, నెత్తి మీద మోసుకెళ్లి ఊరుబయట పారవేసిన వాళ్లు లక్షలాది మంది ఈ సమాజం చేత గౌరవం పొంద డం మాట అటుంచి, అవమానాలకు, వెలివేతకు గుర య్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వీరంతా ఇంకా ఈ రకం వెట్టి పనినే కొనసాగిస్తున్నారు. 1993లో, 2013లో రెండు సార్లు మలమూత్రాలను ఎత్తివేసే మాన వుల విముక్తికి చట్టాలు చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఈ విషయాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు ఇటువంటి దారుణమైన, అమానవీయమైన వృత్తిని నిర్మూలించడానికి ఏ మాత్రం కృషి చేయడం లేదని విమర్శించింది కూడా. 1993లో అమలులోకి వచ్చిన చట్టం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికి దేశం మొత్తం మీద దాదాపు పన్నెండు లక్షల మంది ‘మాన్యువల్ స్కావెం జింగ్’ వృత్తినే కొనసాగిస్తూ రోగాల పాలవుతూ, రోజూ చస్తూ బతుకుతున్నారు. తరాలుగా వాళ్లు చస్తూ బతుకుతు న్నది ఈ స్వచ్ఛ భారత్ కోసమే. అదేవిధంగా ఇండ్లలో, ఆఫీసుల్లో, ఆసుపత్రుల్లో సాధారణ లెట్రిన్లను కడగడం కూడా మనమెవ్వరం చేయం. దానికి ఒక కులం తరతరా లుగా అంకితమవుతున్నది. వాళ్లే ఇవి కూడా చేస్తున్నారు.
నగరాలలో మనం తరచుగా వర్షాకాలంలో రోడ్ల మీద డ్రైనేజీలు పొంగిపోవడం చూస్తుంటాం. మనం నడి చివెళ్లినా, వాహనాల మీద వెళ్లినా ముక్కులు మూసుకొని వెళ్తుంటాం. అయితే ఆ డ్రైనేజీలను బయటకు పొంగ కుండా ఆపడానికి మనుషులు మ్యాన్ హోల్లోకి వెళ్లి అక్కడ అడ్డంగా ఉన్న చెత్తను తొలగిస్తారు. అక్కడక్కడా దానిని తొలగించడానికి ఇప్పుడు వాహనాలు కనిపించినా అటువంటి పని ఇంకా మనుషులే చేస్తున్నారు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం డ్రైనేజీ వర్కర్ల మీద ఒక వార్తా కథనం రాశాను. ఆ సందర్భంలో వాళ్ల పనిని చూసినప్పు డు ఎవరి శ్రమతో, ఎవరి చాకిరితో ఈ సమాజం ఇంత పరి శుభ్రంగా ఉందో వాళ్ల జీవితాలు ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయో చూసి దుఃఖం కలిగింది. జనం విసర్జిం చిన మల, మూత్రాలలో మునిగి వాళ్లు పనిచేస్తుంటే వాళ్ల శరీరాల నిండా మానవ విసర్జితాలు కనిపిస్తుంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నామో అర్థం కాలేదు. అయితే వాళ్లలో మరొక వ్యక్తి మ్యాన్‌హోల్ పైననే ఉండి, దాన్ని శుభ్రం చేయడానికి పరికరాలు అందిస్తున్నాడు. ‘నువ్వెం దుకు దిగలేదు’ అని అడిగాను. ఆయన దానికి ‘నేను సచ్చిన దిగను నేనేమైనా మాల, మాదిగోన్నా?’ అని ఎదు రు ప్రశ్న వేశాడు. అంటే దీనికి ఒక కులం అంకితమై పోయిందనిపించింది. ఇందులో పనిచేస్తున్న వాళ్లు మ్యాన్ హోల్లో దిగినప్పుడు అక్కడ ఉండే విషవాయువుల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సం వత్సరం క్రితం మాదాపూర్, దిల్సుఖ్నగర్లలో ఇటు వంటి దుర్ఘటనలు జరిగాయి.
అందుకే భారతదేశాన్ని పరిశుభ్ర దేశంగా మార్చాలనే ప్రభుత్వం, ముందుగా వీరి శ్రమను గుర్తించాలి. గౌరవిం చాలి. ఇప్పటి వరకు ఈ దేశాన్ని ‘స్వచ్ఛ’ భారత్‌గా ఉంచ డానికి తాము మురికిలో మురికిగా మారిపోయి త్యాగాలు చేసిన అందరికీ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అంకితం చేయాలి. వారి జీవితాల్లో మార్పుకి ఈ ప్రభుత్వం స్వచ్ఛందంగా పునరంకితం కావాలి. పరాయి దేశంలో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు మాత్రమే వీరు లు కాదు. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచి, అనారోగ్యాన్ని తరిమికొట్టి, స్వచ్ఛ భారత్ నిర్మాణానికి మలం తట్టలు మోసిన వారినే వీరులుగా గుర్తించేంతటి స్వచ్ఛమైన మనసు ఈ దేశ నేతలనుకున్నప్పుడే స్వచ్ఛ భారత్‌కు నిజ మైన అర్థం. అందుకే ప్రభుత్వాలు, సమాజంలోని అన్ని వర్గాల స్వచ్ఛమైన మనసుతో గతాన్ని అర్థం చేసుకొని భవిష్యత్ స్వచ్ఛ భారతాన్ని మానవులంతా సమానులేననే నినాదంతో ఐక్యంగా నిర్మించుకోవాలి.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు) మల్లెపల్లి లక్ష్మయ్య