- అందరూ ఐకమత్యంతో కృషి చేయూలి
- డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య
హన్మకొండ అర్బన్ : జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతిని ధులు, అధికారులు ఐకమత్యంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రత అమల్లో అందరూ భాగస్వాములైతే మనకు వచ్చే జబ్బుల్లో 60 శాతం వరకు అరికట్టవచ్చన్నారు.
పేదరికం, నిరక్షరాస్యత వల్లే ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. జనాభాలో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద దేశంగా ఉన్న చైనాను పరిశుభ్రత విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ గంగాధర కిషన్ మాట్లాడుతూ జిల్లా అధికారులు రెండు వార్డుల చొప్పున దత్తత తీసుకుని... నెలలో ఒక వారంపాటు వాటి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
దేశ ప్రజలు అపరిశుభ్రత వల్ల రోగాల బారిన పడుతున్నారని, వైద్యం కోసం ఏడాదికి రూ.2.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న స్వచ్ఛ బారత్ నిర్మాణానికి అందరం కృషిచేయాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బార్లు, ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటోందని, ఈ విషయంలో యజమానులతో మాట్లాడి వాటి నిర్మూలనకు కృషి చేయూలని అధికారులను కోరారు.
కార్యక్రమంలో జేసీ పౌసుమిబసు, నగర పాలక సంస్థ కమిషనర్ పాండాదాస్, ఏజేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కార్యక్రమానికి హాజరైన వారితో ఉపముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిం చారు. కార్యక్రమంలో ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్, ఆరోగ్యమిత్ర సంస్థలు రూపొం దించిన ‘ప్రపంచ శాంతి-గాంధీ మార్గం’ కరపత్రాన్ని ఆవిష్కరించారు.